హైదరాబాద్, మార్చి 27 (నమస్తే తెలంగాణ): తెలంగాణ తొలి సీఎం కేసీఆర్‌ను స్ఫూర్తిగా తీసుకుంటామని ఎమ్మెల్సీలు మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్, శేరి సుభాష్‌రెడ్డి తదితరులు ప్రతినబూనారు. భవిష్యత్తు రాజకీయాల్లో ఆయనే తమకు గురువు అని చెప్పుకున్నారు. ఈ ఐదేండ్లు సేవలందించేందుకు తమకు అవకాశం కల్పించిన కేసీఆర్‌కు, బీఆర్ఎస్ పార్టీకి ధన్యవాదాలు తెలిపారు. శాసనమండలిలో ఈ నెల 29న పదవీకాలం పూర్తిచేసుకున్న 9 మంది శాసనమండలి సభ్యులకు మండలి ప్రాంగణంలో మండలి చైర్మన్ ఆధ్వర్యంలో అభినందన సభ ఏర్పాటు చేశారు. ఎమ్మెల్సీలైన ఎంఎస్ ప్రభాకర్‌రావు, మహమ్మద్ మహమూద్ అలీ, టీ జీవన్‌రెడ్డి, ఎగ్గే మల్లేశం, ఏ నర్సిరెడ్డి, షేరి సుభాశ్‌రెడ్డి, కూర రఘోత్తంరెడ్డి, సత్యవతి రాథోడ్, రియాజుల్ హాసన్ అఫెండి పదవీకాలం ఈనెల 29తో ముగియనున్నది.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వల్లే రాష్ట్రం లో మైనార్టీలకు తగిన గుర్తింపు లభించింద ని ఎమ్మెల్సీ మహ్మద్ మహమూద్ అలీ గుర్తుచేశారు. చరిత్రలోనే ఎన్నడూ లేనివిధంగా డిప్యూటీ స్పీకర్‌తోపాటు, హోంశాఖ, రెవెన్యూశాఖ మంత్రిగా మైనార్టీలకు అవకాశం కల్పించారని కొనియాడారు.
తనకు ఎమ్మెల్సీగా, మంత్రిగా బాధ్యతలు కల్పించిన తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ తనకు దైవ సమానులని ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు. ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటానని ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
శాసనమండలితో తనకు 15 ఏండ్ల విడదీయలేని అనుబంధం ఉన్నదని ఎమ్మెల్సీ ఎం ఎస్ ప్రభాకర్ చెప్పారు.
తనను మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీటిస్తానని మోసగిస్తే, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు తనను ఎమ్మెల్సీని చేశారని ఎమ్మెలీ ఎగ్గే మల్లేశం గుర్తుచేశారు.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌తోనే తనకు రాజకీయ భవిష్యత్తు అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి చెప్పారు. అనంతరం ఎమ్మెల్సీ టీ జీవన్‌రెడ్డి, ఎమ్మెల్సీ అలుగుబెల్లి న ర్సిరెడ్డి తమ అభిప్రాయాలను పంచుకున్నారు.