మహబూబాబాద్ రూరల్/కృష్ణకాలనీ, జనవరి 25: ‘కాంగ్రెస్ పార్టీ నాయకులకు కూల్చుడే ఎరుక.. అభివృద్ధి పనులు చేసేందుకు చేతకాదు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రారంభించిన వాటికే నేడు శంకుస్థాపనలు చేస్తున్నారు. ఆనాటి శిలాఫలకాలను కూల్చివేసి, నేడు కొత్తగా మేమే చేశామంటూ గొప్పలు చెప్పుకుంటున్నారు’ అని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, బీఆర్ఎస్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి వేర్వురు చోట్ల మాట్లాడుతూ ధ్వజమెత్తారు. మహబూబాబాద్, భూపాలపల్లి జిల్లాల్లో బీఆర్ఎస్ హయాంలో ప్రారంభించిన పనులకు నేడు మళ్లీ శిలాఫలకాలు వేయడంపై వారు ధ్వజమెత్తారు. మహబూబాబాద్ పట్టణంలోని తన నివాసంలో ఆదివారం సత్యవతి రాథోడ్ మాట్లాడారు.
ఈ రెండేండ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం మహబూబాబాద్ జిల్లాకు చేసిన అభివృద్ధి శూన్యమని ఆరోపించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మహబూబాబాద్ పట్టణాన్ని రూ.50 కోట్లతో అభివృద్ధి చేశామని, ఇంటిగ్రేటెడ్ కూరగాయల మార్కెట్ కోసం అనేక నిధులు తీసుకొచ్చామని గుర్తుచేశారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించిన పనులకే మళ్లీ కాంగ్రెస్ నాయకులు శంకుస్థాపనలు చేస్తున్నారని విమర్శించారు.
సీఎం రేవంత్‌రెడ్డి బీఆర్ఎస్ గద్దెలను కూల్చాలని అంటే కిందిస్థాయి నాయకులు మాత్రం ఆ పార్టీ వేసిన శిలాఫలకాలనే కూల్చి వేస్తున్నారని చెప్పారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో గెలువడం కోసమే పట్టణంలోని వివిధ వార్డుల్లో అభివృద్ధి పనులకు మళ్లీ శంకుస్థానలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. దీనిని ప్రజలు గమనిస్తున్నారని, అవకాశం వచ్చినప్పుడు కర్రు కాల్చి వాత పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ ఎండీ ఫరీద్, ఎల్ది మల్లయ్య పాల్గొన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని న్యూ సుభాశ్‌కాలనీలో నిర్మించిన బస్తీ దవాఖానకు పల్లె దవాఖానగా పేరు మార్చి ఆదివారం భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ప్రారంభించడంపై గండ్ర జ్యోతి తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. విషయం తెలుసుకున్న ఆమె ఘటనా స్థలానికి చేరుకొని దవాఖాన ఎదుట వేసిన శిలాఫలకాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బీఆర్ఎస్ హయాంలో ప్రారంభించిన శిలాఫలకాలను ధ్వంసం చేసే నీచ సంస్కృతి రాష్ట్రంలో రాజ్యమేలుతున్నదని మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో 2023లో ఎమ్మెల్యేగా ఉన్న గండ్ర వెంకటరమణారెడ్డి రూ.20 లక్షలతో బస్తీ దవాఖానను నిర్మించారని తెలిపారు.
అప్పటికే శాసనసభ ఎన్నికలు రావడంతో దవాఖానను ప్రారంభించలేదని, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం బస్తీ దవాఖానను పట్టించుకోలేదని తెలిపారు. ఈలోగా నాడు బీఆర్ఎస్ వేసిన శిలాఫలకాన్ని కొందరు దుండగులు శనివారం రాత్రి ధ్వంసంచేయడంపై ఆమె మండిపడ్డారు.
నియోజకవర్గంలో గండ్ర వెంకటరమణారెడ్డి వేల కోట్ల నిధులు తీసుకొచ్చి అభివృద్ధి పనులు చేశారని, ఆపనుల శిలాఫలకాలను ఇప్పటి కాంగ్రెస్ ఎమ్మెల్యే సత్యనారాయణరావు తొలగించి.. తామే నిధులు తీసుకొచ్చామని గొప్పలు చెప్పుకుంటూ తన పేరుతో కొత్త శిలాఫలకాలు వేసుకోవడం దుర్మార్గమైన చర్య అని విమర్శించారు. వెంటనే గండ్ర వెంకటరమణారెడ్డి పేరుతో ఉన్న శిలాఫలకాన్ని తిరిగి నిర్మించాలని, లేదంటే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో దవాఖాన ఎదుట పెద్దఎత్తున ధర్న చేస్తామని హెచ్చరించారు.