జయశంకర్ భూపాలపల్లి, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ)/మహదేవపూర్ : కాళేశ్వరం ప్రాజెక్టులోని కన్నెపల్లి(లక్ష్మి) పంప్‌హౌస్‌లో మోటర్లు ఆన్ చేసి రైతులకు నీళ్లివ్వాల్సిందేనని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎంపీ వినోద్‌కుమార్ డిమాండ్‌చేశారు. బీఆర్ఎస్ అధిష్ఠానం ఆదేశాల మేరకు సోమవారం కొప్పుల ఆధ్వర్యంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ముఖ్యనేతలు పంప్‌హౌస్ సందర్శనకు వెళ్లారు. కాళేశ్వర-ముక్తీశ్వర స్వామిని దర్శించుకొని గోదావరి వరదను పరిశీలించారు. పంప్‌హౌస్ మోటర్లు ఆన్‌చేసి రైతులకు నీళ్లు అందిస్తామంటూ బీఆర్ఎస్ బృందం పంప్‌హౌస్‌లోకి వెళ్లే ప్రయత్నం చేయగా పోలీసులు గేట్లకు తాళంవేసి అడ్డుకున్నారు. దీంతో బీఆర్ఎస్ శ్రేణులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ గేటు ఎదుట బైఠాయించారు. ఈ సందర్భంగా కొప్పుల మాట్లాడుతూ.. కన్నెపల్లి పంప్‌హౌస్ నుంచి నీటిని లిప్టు చేసి రిజర్వాయర్లు, చెరువులు నింపే అవకాశం ఉన్నప్పటికీ రేవంత్ ప్రభుత్వం కావాలనే కుట్రలు చేస్తున్నదని మండిపడ్డారు. వారంరోజుల్లోగా మోటర్లు ఆన్ చేసి రైతులకు నీళ్లు అందించకపోతే కేటీఆర్, హరీశ్‌రావు ఆధ్వర్యంలో లక్షలాది మంది రైతులతో కలిసి పంప్‌హౌస్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు.
కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రైతులకు నీళ్లిచ్చే అవకాశం ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్‌ను బద్నాం చేయడమే టార్గెట్‌గా రైతుల జీవితాలతో చెలగాటమాడుతున్నదని మాజీ ఎంపీ, రాష్ట్ర ప్రణాళికా సంఘం మాజీ ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ పేర్కొన్నారు. వర్షాకాలం ప్రారంభమై రెండు నెలలు గడిచినా చెరువులు, కుంటలకు నీళ్లు రాలేదు.. ఎక్కడా మత్తళ్లు పడిన దాఖలాలులేవు .. ఈ పరిస్థితుల్లో రైతులు పంటలు సాగుచేసుకునేదెలా అని ప్రశ్నించారు. మేడిగడ్డ బరాజ్‌లో ఒక ఫిల్లర్ కుంగినా లక్ష్మి పంప్‌హౌస్ ద్వారా నీటిని లిప్టుచేసి చెరువులు, రిజర్వాయర్లు నింపవచ్చని తెలిసినా ప్రభుత్వం కావాలనే కుట్రలు చేస్తున్నదని మండిపడ్డారు. లక్ష్మి పంప్‌హౌస్ వద్ద 97.60 మీటర్ల లెవల్లో నీరు ఉన్నదని, 93.76 మీటర్ల లెవల్లోనే పంపింగ్ చేసుకునే అవకాశం ఉన్నదని చెప్పారు. మేడిగడ్డ బరాజ్ నుంచి రోజూ లక్షా 46 వేల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తున్నదని, ప్రతి రోజూ 10 టీఎంసీల నీరు సముద్రంలో కలిసిపోతున్నదని తెలిపారు.
తమ్మిడిహట్టి వద్ద 152 మీటర్లకు తాను అనుమతి తీసుకువస్తానని బండి సంజయ్ చెప్పడం అతడి అవగాహనా రాహిత్యానికి నిదర్శనమని ఎద్దేవాచేశారు. వైఎస్ఆర్ శంకుస్థాపన చేసినప్పుడు ఢిల్లీ, మహారాష్ట్ర, ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ అధికారంలో ఉంది.. వాళ్లు ఎందుకు పర్మిషన్ తీసుకురాలేదని ప్రశ్నించారు. అందుకే కేసీఆర్ మేడిగడ్డ వద్ద ప్రాజెక్టు నిర్మాణం చేసి మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌లు నిర్మించారని వివరించారు. ఉత్తం, రేవంత్‌కు ప్రాజెక్టులపై ఏ మాత్రం అవగాహన లేదని మండిపడ్డారు. పెన్‌గంగపై 20 వేల కోట్లతో మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వాలు బరాజ్‌లు కడుతున్నా.. అక్కడ నీళ్లు నిలువవని చెప్పా రు. కార్యక్రమంలో మంథని మాజీ ఎమ్మెల్యే మధు, ఎమ్మెల్సీ రమణ, మాజీ ఎమ్మెల్యేలు విద్యాసాగర్, చందర్, రసమయి, దివాకర్‌రావు, రవిశంకర్, మనోహర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణ్‌రావు పాల్గొన్నారు.
కన్నెపల్లి పంప్‌హౌస్ ముట్టడి
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన కన్నెపల్లి పంపులను ప్రారంభించి గోదావరి జలాలను ఎత్తిపోయాలని డిమాండ్ చేస్తూ జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని పంప్‌హౌస్‌కు వస్తున్న బీఆర్ఎస్ బృందం.