మెదక్, జనవరి 12(నమస్తే తెలంగాణ) : సీఎం రేవంత్రెడ్డి కృష్ణా జలాలు ఆంధ్రాకు తరలించేందుకు కుట్ర చేస్తున్నారని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి, మెదక్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి ఆరోపించారు. సోమవారం మెదక్ కలెక్టరేట్ ఎదుట బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సింగూ ర్ జలాలు ఘనపూర్ ప్రాజెక్టుకు విడుదల చేయాలంటూ రైతులతో కలిసి ధర్నా చేశారు. ఇక్కడ వారు మాట్లాడుతూ.. సీఎం రేవంత్రెడ్డి తన రాజకీయ గురువు చంద్రబాబుకు మేలు చేసేందుకు కృష్ణా జలాలపై న్యాయపోరాటం చేయడం లేదని విమర్శించారు. సింగూర్ ప్రాజెక్టు నుంచి ఘనపూర్ ఆనకట్టకు నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
రైతులు నారుపోసి నాట్లు వేసుకున్న తర్వాత సింగూర్ నీటిని విడుదల చేయబోమని అధికారులు చెప్పడం దారుణమని మండి పడ్డారు. మరమ్మతుల పేరిట నీళ్లు విడుదల చే యకపోతే పంటలు పండే పరిస్థితి లేదని, తాగునీటి కష్టాలు వస్తాయని ఆందోళన వ్యక్తంచేశారు. నీళ్లు ఇవ్వకపోతే ప్రభుత్వం క్రాప్ హాలిడే ప్రకటించి ఎకరానికి రూ.25వేలు చెల్లించాలని డి మాండ్ చేశారు. నీరు విడుదల చేసే వరకు బీఆర్ఎస్ పోరాడుతుందని హెచ్చరించారు.