సిటీబ్యూరో/షేక్‌పేట్ నవంబర్ 6(నమస్తే తెలంగాణ) : జూబ్లీహిల్స్‌లో ఓటమి భయంతో కాంగ్రెస్ నాయకులు దౌర్జన్యాలకు తెగబడుతున్నారు. బీఆర్ఎస్కు అనుకూలంగా ఉంటూ, కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఉన్న వారిపై కక్షగట్టి అధికారంతో అండతో వారి ఇండ్లపైకి పోలీసులను పంపి దాడులు చేయించడం భయానక పరిస్థితులు సృష్టిస్తున్నారు. వృద్ధులు, మహిళలు, చిన్నారులని కూడా చూడకుండా ఖాకీలు జబర్దస్తీ చేయగా పోలీసుల తీరుపై బీఆర్ఎస్ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.
షేక్‌పేట్ మినీ బృందావన్‌కాలనీలో బుధవారం రాత్రి బీఆర్ఎస్ డివిజన్ ప్రధాన కార్యదర్శి షకీల్ అహ్మద్, అబ్దుల్ వాహిద్ ఇంటి వద్ద పోలీసులతో దౌర్జన్యం చేశారు. ఇంట్లో ఉన్న వారిని బెదిరించడంతో పాటు వస్తుసామగ్రిని చిందరవందర చేయడంతో వృద్ధులు, మహిళలు, చిన్న పిల్లలు భయపడిపోయారు. అరగంటకు పైగా జబర్దస్తీ చేయడంతో పాటు షకీల్ అహ్మద్, అబ్దుల్ వాహిద్‌లను అదుపులోకి తీసుకున్నారు. విషయం తెలుసుకున్న నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యేలు ఆశన్నగారి జీవన్‌రెడ్డి, షకీల్ అహ్మద్‌తో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు అక్కడికి చేరుకున్నారు. బీఆర్ఎస్ నాయకుల ఇండ్ల చుట్టూ పోలీసుల పహారాలో ఉండడంతో ఏం జరుగుతున్నదంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ పోలీసులతో దౌర్జన్యం చేయిస్తున్నదంటూ ఆరోపించారు. షేక్‌పేట్‌లో సీఎం రేవంత్ సభ ముగియగానే పోలీసులతో బీఆర్ఎస్ నాయకుల ఇళ్లపై దాడులు చేయిస్తున్నారంటూ మండిపడుతూ అక్కడున్న పోలీసులను నిలదీశారు. టోలిచౌక్ ఇన్స్పెక్టర్ రమేశ్‌నాయక్ ఆదేశాలతో దాడులు చేసినట్టు అక్కడున్న సిబ్బంది వెల్లడించారు. టోలిచౌక్ సీఐ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా పనిచేస్తున్నాడంటూ పోలీసులకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు ప్రజల కోసం పనిచేయాలని కానీ, కాంగ్రెస్ పార్టీ నాయకుల కోసం కాదన్నారు. ఈమేరకు సీఐ రమేశ్నాయక్పై చర్యలు తీసుకోవాలని గురువారం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్‌రెడ్డికి శాసనమండలి బీఆర్ఎస్ పక్షనేత మధుసూదనాచారి, మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, షకీల్ అహ్మద్ ఫిర్యాదు చేశారు.
‘కాంగ్రెస్ లేకుంటే ముస్లింలకు చోటు లేదు’ అంటూ చేసిన మంగళవారం రహ్మత్‌నగర్ రోడ్‌షోలో సీఎం రేవంత్‌రెడ్డి చేసిన రెచ్చగొట్టే వ్యాఖ్యలను ముస్లిం సమాజం తీవ్రంగా ఖండించింది. ఆ వ్యాఖ్యలపై పలువురు నిరసన తెలిపిన క్రమంలోనే బుధవారం సీఎం రోడ్‌షో షేక్‌పేట్‌లో ఉండడంతో డివిజన్ అంతటా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే సీఎంకు ముస్లిం సమాజమంతా వ్యతిరేకంగా ఉందని గుర్తించిన డివిజన్లోని ప్రధాన ముస్లిం నేతల ఇంటి వద్ద పహారా కాశారు. ముఖ్యంగా బీఆర్ఎస్ మైనారిటీ నాయకులను లక్ష్యంగా చేసుకొని వారి ఇండ్లపై పోలీసులు దాడులు చేశారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఉన్న మైనారిటీ నాయకులను పోలీసులు భయభ్రాంతులకు గురిచేసినట్టు ఆరోపణలున్నాయి. సీఎం రేవంత్‌రెడ్డి ముస్లిం సమాజానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడాన్ని జీర్ణించుకోలేకపోతున్న ముస్లిం సమాజం కాంగ్రెస్ పార్టీ నాయకులపై మండిపడుతున్నది. జూబ్లీహిల్స్‌లో రౌడీ రాజకీయం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ, ఎన్నిక సమీపిస్తుండడంతో పోలీసులతో దౌర్జన్యాలు చేయిస్తున్నదని స్థానికులు ఆగ్రహంతో ఉన్నారు. బీఆర్ఎస్ నాయకులు ఎన్నికల అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నా ఎన్నికల అధికారులు సైతం సరిగ్గా స్పందించడం లేదనే విమర్శలు వస్తున్నాయి. షేక్‌పేట్‌లో పోలీసులు దౌర్జన్యకాండ చేయడంపై ప్రశ్నిస్తే సీఎం సభను అడ్డుకుంటారనే ఉద్దేశంతో ముందస్తు అరెస్ట్ చేసేందుకు మాత్రమే వచ్చామంటూ బుకాయించే పనిచేస్తున్నారు. సీఎం సభకు ముందు, రోడ్ షో తర్వాత కూడా పోలీసులు దౌర్జన్యం చేశారంటూ బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పోలీసులు అరెస్ట్ చేసిన బీఆర్ఎస్ నాయకులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రజల సేవలో ఉండాల్సిన పోలీసులు, అధికార పార్టీ నాయకుల కనుసన్నల్లో పనిచేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. టోలిచౌక్‌లో తరహాలో మరెన్ని దాడులు చేస్తారోనని సామాన్యులు సైతం భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.
సిటీబ్యూరో, నవంబర్ 6 (నమస్తే తెలంగాణ) : జూబ్లీహిల్స్‌లో ఓడిపోతామనే భయంతో కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ నేతలను అక్రమ అరెస్టులు చేస్తున్నది. రహ్మత్‌నగర్‌కు చెందిన అరుణ్‌పై ఎలాంటి కేసులు లేకున్నా మధురానగర్ పోలీసులు అదుపులోకి తీసుకుని మధురానగర్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. విషయం తెలుసుకున్న పార్టీ నాయకులు దాస్యం వినయ్‌భాస్కర్, తక్కళ్లపల్లి రవీందర్రావు, కోరుకంటి చందర్, లీగల్ సెల్ అడ్వైజర్ శ్రీకాంత్ పోలీస్‌సేష్టన్‌కు వెళ్లి విడిపించి అరుణ్ అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండించారు. కార్యక్రమంలో నేతలు రంజిత్‌రెడ్డి, వినీల్‌రావు ఉన్నారు.