యాదాద్రి భువనగిరి, జూన్ 22 (నమస్తే తెలంగాణ) : ట్రిపుల్ ఆర్ భూసేకరణలో అవకతవకలు జరిగాయంటూ ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఇందులో ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య ప్రమేయం ఉన్నదని ఆరోపిస్తూ బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు కర్రె వెంకటయ్యతోపాటు మరికొందరు సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. అందులో పేర్కొన్న వివరాల ప్రకారం.. యాదగిరిగుట్ట మండలం మల్లాపురం రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 438లో కురుమ కులస్తులకు చెందిన సుమారు 250 ఎకరాల్లో 15 ఏండ్ల క్రితమే టీ వెంచర్ ఏర్పాటు చేసి ప్లాట్లు సైతం అమ్మేశారు.
ఇదే భూమిలో ప్రస్తుత సర్పంచ్ మంగ సత్యనారాయణ కుటుంబ సభ్యులకు చెందిన భూమిని సైతం టీ వెంచర్‌కు విక్రయించారు. ఈ భూమికి గతంలో ఎలాంటి పట్టాదారు పాసుపుస్తకాలు లేవు. గతంలో భువనగిరి ఆర్డీవోగా పనిచేసిన కిష్టప్ప కురుమ కులస్తులకు జీవో నంబర్ 38 ద్వారా పట్టా హకు కల్పించారు. ఈ పట్టాలను సవాల్ చేస్తూ ఓ నవాబు కుటుంబసభ్యులు హైకోర్టులో కేసు వేశారు. ప్రస్తుతం ఆ కేసు విచారణలో ఉన్నది. అంతేకాకుండా టీ వెంచర్ లేఅవుట్ చేసిన సమయంలో 438 సర్వే నంబర్లోని 10 ఎకరాలను మల్లాపురం పంచాయతీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేశారు. ఆ స్థలంలోనే ట్రిపుల్ ఆర్ నిర్మాణం జరుగుతున్నది. ట్రిపుల్ ఆర్ నిర్మాణం నేపథ్యంలో మల్లాపురం సర్పంచ్ మంగ సత్యనారాయణ కుటుంబసభ్యుల స్థలం నుంచి రోడ్డు వెళ్తున్నదంటూ యాదగిరిగుట్ట తహసీల్దార్‌కు రూ.20 లక్షలు ఇచ్చి తప్పుడు నివేదికను సమర్పించారని బీఆర్ఎస్ నాయకులు ఆ ఫిర్యాదులో పేరొన్నారు.
టీ వెంచర్ పంచాయతీ లేఅవుట్ కావడంతో గతంలో విక్రయించిన రైతుల పేర్లు రెవెన్యూ రికార్డులో తొలగించకపోవడంతో తిరిగి అదే రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు రావడంతో ఇబ్బందులు వస్తున్నాయి. టీ వెంచర్ యాజమాన్యం, మంగ సత్యనారాయణ కుటుంబం కుమ్మక్కై ప్లాట్లను కొనుగోలు చేసిన కస్టమర్లను మోసగిస్తున్నారని వారు పేర్కొన్నారు. ఇదే విషయమై స్వయంగా ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య ఇంట్లోనే ఒప్పందం కుదుర్చుకున్నట్టు వారు ఆరోపించారు. వచ్చిన దాంట్లో ఎమ్మెల్యేకు సగం.. సర్పంచ్ మంగ సత్యనారాయణ కుటుంబ సభ్యులకు సగం వాటా పంచుకున్నట్టు అందులో పేర్కొన్నారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి ప్లాట్లు కొనుగోలు చేసిన వినియోగదారులకు న్యాయం చేయాలని కర్రె వెంకటయ్య కలెక్టర్‌ను కోరారు.