వరంగల్, అక్టోబర్ 11 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఆరు గ్యారెంటీలు, 420 హామీలను విస్మరించిన కాంగ్రెస్ సర్కార్‌పై బీఆర్ఎస్ పార్టీ బాకీకార్డు అనే ఉద్యమకాగడాను వెలిగించింది. అది ఊరూవాడా చుట్టేస్తూ ప్రజల్లో ఆలోచనను రేకెత్తిస్తున్నది. ఎన్నికల ముందు ప్రజలకిచ్చిన హామీల నుంచి కాంగ్రెస్ తప్పించుకోవాలని ఎన్ని ఎత్తుగడలు వేసినా తప్పించుకోలేని పద్మవ్యూహాన్ని బీఆర్ఎస్ పన్నింది. కాంగ్రెస్ బాకీకార్డు పేరుతో బీఆర్ఎస్ చేపట్టిన ఈ వినూత్న ఉద్యమం కాంగ్రెస్ సర్కార్‌కు ఏకంగా ముచ్చెమటలే పెట్టిస్తున్నది. గతనెల 27న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విడుదల చేసిన కాంగ్రెస్ బాకీకార్డు చాపకింద నీరులా అన్ని నియోజకవర్గాలకు విస్తరించిం ది.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ తన ప్రచారం కోసం వేసిన ఎత్తుగడగా తొలుత కాంగ్రెస్ భావించింది. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలోనే కాదు అన్ని నియోజకవర్గాల్లోనూ కాంగ్రెస్ ఎన్నికల నాడు ఇచ్చిన హామీలు, వాటిని అమలు చేయని వైనాన్ని బీఆర్ఎస్ బాకీకార్డు గుర్తు చేస్తున్నది. అంతేకాకుండా ఒక్కో వర్గం, ఒక్కో లబ్ధిదారుడు గడచిన 22 నెలల కాలంలో ఎంతెంత నష్టపోయాడు? అనే అంశం జనానికి బాగా కనెక్ట్ అయింది.
రాష్ట్రంలో ఇప్పుడు ఏ నియోజకవర్గానికి వెళ్లినా కాంగ్రెస్ బాకీకార్డుపైనే ఆసక్తికరమైన చర్చ సాగుతున్నది. దీంతో స్థానిక సంస్థల ఎన్నికలు రేవంత్ సర్కార్‌కు ముందు నుయ్యి వెనుక గొయ్యిలా పరిణమించే అనివార్యతను బీఆర్ఎస్ సృష్టించింది. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ సర్కార్ ఎంతలా మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నా క్షేత్రస్థాయిలో నెలకొన్న ప్రజావ్యతిరేకత ముందు అది దిగదుడుపేనని ఆ పార్టీ కిందిస్థాయి నేతలు, శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. ఇప్పటికీ యూరియా కోసం ఊరూరా చెప్పుల వరుసలు, నెలల తరబడి పడుతున్న అవస్థలతో అన్నదాతలు కాంగ్రెస్ సర్కార్‌పై తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారు. నిన్నమొన్నటి దాకా గల్లా ఎగరేసుకొని తిరిగిన కాంగ్రెస్ నాయకులు యూరియా సమస్యను పట్టించుకోలేదని, ఇప్పుడే ముఖం పెట్టుకొని వస్తారో చూద్దామని రైతులు మండిపడుతున్నారు.
‘ఓటు కోసం ఇంటికి వచ్చే నాయకులను నిలదీసి అడగండి’ అని బీఆర్ఎస్ ఇచ్చిన పిలుపు కాంగ్రెస్ పార్టీ నాయకులకు కాళ్లు చేతులు ఆడకుండా చేస్తున్నాయి. బీఆర్ఎస్ విడుదల చేసిన ఈ ‘కాంగ్రెస్ బాకీ కార్డు’ క్షేత్రస్థాయిలో మూడు రంగుల జెండాకు ముచ్చెమటలే పట్టిస్తున్నది. హైదరాబాద్, జూబ్లీహిల్స్, సికింద్రాబాద్, సిద్దిపేట, నర్సంపేట, పాలకుర్తి, జనగామ, భూపాలపల్లి, బాల్కొండ, చెన్నూరు సహా రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ శ్రేణులు ఇంటింటికీ బాకీకార్డులను పంపిణీ చేస్తున్నారు. రైతు భరోసా, యువ వికాసం, గృహజ్యోతి, మహిళా భరోసా, పింఛన్ పెంపు ఇలా అనేక అంశాల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీల్లో అంశాల వారీగా లెక్కలేస్తూ వివరిస్తూ ప్రజలను ఆలోచింపజేస్తున్నారు.
తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగలో ఊరూరా బీఆర్ఎస్ గానం వినిపించింది. ఎంగిలిపూల బతుకమ్మ నుంచి సద్దుల బతుకమ్మ దాకా ఊరూరా ‘గులాబీల జెండలమ్మా, సారే కావాలంటున్నరే.. తెలంగాణ పల్లెలల్లా, ఛల్ దేఖ్లెంగే’ అనే పాటలతో ఆడబిడ్డలు ఆడిపాడి సందడి చేశారు. అధికారమే పరమావధిగా నాడు వ్యవహరించిన కాంగ్రెస్ నాయకులకు ఊరూరా ఆ పాటలు కంటిమీద కునుకే లేకుండ చేశాయి. పలుచోట్ల డీజేలు బంద్ చేస్తూ తమ అక్కసును వెల్లగక్కారు. వర్దన్నపేట నియోజకవర్గం పర్వతగిరిలో ఏకంగా సౌండ్‌బాక్స్‌లను బంద్ చేసినందుకు మహిళలు గొడవకు దిగిన ఘటనను కాంగ్రెస్ శ్రేణులు గుర్తుచేసుకుంటున్నారు. ‘బాకీ పడ్డ మాట నిజమేనని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి మీడియా సమావేశంలోనే పరోక్షంగా అంగీకరించడంతో బాకీకార్డుల ప్రభావం ఏ స్థాయిలో ఉన్నదో స్పష్టం అవుతున్నది.
ఇచ్చోడ, అక్టోబర్ 11: ‘మాకు ఇయ్యాల్సిన బాకీ ఎప్పుడు ఇస్తావు? రేవంత్‌రెడ్డీ’..అంటూ కాంగ్రెస్ బాకీ కార్డులు పట్టుకొని శనివారం ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముక్రా(కే) మహిళలు పొలంలో ముఖ్యమంత్రికి సెల్ఫీలు పంపారు. వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇవ్వాల్సిన ఆరు గ్యారెంటీలు, మహిళలకు రూ.2500 చొప్పున రూ.55వేలు, పింఛన్‌దారులకు రూ.44 వేలు, ఆడబిడ్డకు తులం బంగారం, రైతులకు రైతు భరోసా, రుణమాఫీ, విద్యార్థినులకు సూటీలు, నిరుద్యోగులకు రెండు లక్షల ఉద్యోగాలు బాకీ ఉన్నారని పేర్కొన్నారు. ప్రతి కుటుంబానికి రేవంత్‌రెడ్డి బాకీ ఉన్నారని, ఎన్నికలుంటేనే రైతు భరోసా ఇస్తున్నారని, రైతు రుణమాఫీతో ప్రజలను మోసం చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కేసీఆర్, కేటీఆర్ నాయకత్వంలో ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆధ్వర్యంలో గ్రామంలో కాంగ్రెస్ బాకీ కార్డులను ప్రతి ఒకరికీ పంపిణీచేసి వివరించామని చెప్పారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గాడ్గే మీనాక్షి, మాజీ ఎంపీటీసీ సుభాష్, గ్రామస్థులు పాల్గొన్నారు.
అడ్డగోలు మాటలను నమ్మి మోసపోయి ఓటేసినం. రెండేండ్లు దగ్గరికొస్తున్నా ఒక్కటీ నెరవేరలేదు. రొండుసార్లు రైతుబంధు ఎగ్గొంట్టిండ్లు. రుణమాఫీ కాలేదా? ఇక పింఛన్లు పెంచుతమన్నరు అవి అటే పోయే. గీ యూరియా తెప్పిస్తలేరు. నాలుగు ఎకరాలు పత్తి ఏసినం. పెట్టుబడి టైంకు అందిందా ఏమన్నా? నమ్మి మోసపోయినం. ఇంకా ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడగడానికి వస్తరో రానీ.. మా దగ్గరికి వస్తే అడుగుడే.. ఇడిసిపెట్టుడు లేదు.
– కూస రాధ, చిట్యాల, జయశంకర్ భూపాలపల్లి జిల్లా
ఆపతి మొక్కులు మొక్కిండ్లు. ఇప్పుడు ముఖం లేకుంట అయిండ్లు. ఎవలను ఆదుకున్నరు. ఆదుకుంటరనుకుంటే అక్కెర తీరినంక అవతల పడ్డరు. బీఆర్ఎస్సోల్లు ఇచ్చిన కారట్లల్ల (కాంగ్రెస్ బాకీకార్డు) నిజమే ఉన్నది. యూరియా బత్తాలు కూడా ఇయ్యనోళ్లు సిఫాయిల్లెక్క వత్తరట. ఎహే.. ఏమన్న చెప్పుండ్లి.. గా కేసీఆరే నయం ఉండే. ఎదురుచూడకుంట ఎప్పుడేది కావాల్నో అన్నీ ఇచ్చిండు.
– తలారి గట్టయ్య, రైతు, కుదురుపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లా