Ramineni Srinivasa Rao | తెలంగాణ ఉద్యమకారుడు, టీఎన్జీవో ట్రెజరర్, ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న రామినేని శ్రీనివాసరావు (60) అలియాస్ బొట్టు శ్రీను మరణం పట్ల బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్, హరీశ్‌రావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి సంతాపం తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. నెల క్రితం బ్రెయిన్ స్ట్రోక్‌కు గురైన రామినేని శ్రీనివాసరావు.. కంచన్‌బాగ్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కోమాలో ఉన్న శ్రీనివాసరావు పరిస్థితి విషమించడంతో ఆదివారం మరణించారని వైద్యులు తెలిపారు
కేటీఆర్ సంతాపం
శ్రీనివాసరావు మరణం పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంతాపం తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. ఉద్యమకాలంలో శ్రీనివాసరావుతో కలిసి పనిచేసిన జ్ఞాపకాలతో పాటు, తెలంగాణ ఉద్యమానికి ఆయన చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు.
రామినేని మరణం తీరని లోటు : హరీశ్‌రావు
గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో పోరాడిన ఉద్యమసహచరులు, తెలంగాణ ఎన్జీవో రాష్ట్ర కోశాధికారి, అబ్కారీ శాఖలో సూపరింటెండెంట్ గా పని చేస్తున్న రామినేని శ్రీనివాసరావు మరణం తీరనిలోటు అని హరీశ్‌రావు అన్నారు. తెలంగాణ సాధన ఉద్యమంలో ఆయన చేసిన పోరాటం అనిర్వచనీయమని కొనియాడారు. అయన మృతి ఉద్యోగ సంఘాలకే కాదు.. తెలంగాణకు తీరని లోటు అని పేర్కొన్నారు. మంచి ఉద్యమ సహచరుడిని కోల్పోవడం బాధాకరమని విచారం వ్యక్తం చేశారు.