మహబూబ్‌నగర్, జూన్ 26 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ప్రాజెక్టులపై కాంగ్రెస్ పట్టనితనం ప్రజలకు శాపంగా మారుతున్నది. కాళేశ్వరం ప్రాజెక్టులో రెండు పిల్లర్లు కుంగితే నానా యాగీ చేసిన రేవంత్ సర్కారు.. దానికి మరమ్మతులు చేయించి వినియోగంలోకి తేవాలన్న సోయి లేకుండా పోయింది. ఫలితంగా రైతులు తమ పంటలను ఎండబెట్టుకునే పరిస్థితి వచ్చింది. తాజాగా, జూరాల ప్రాజెక్టు విషయంలోనూ కాంగ్రెస్ అదే అలసత్వం ప్రదర్శిస్తున్నది. సకాలంలో మరమ్మతులు చేయించకపోవడంతో జూరాల క్రస్ట్ గేట్లు ప్రమాదం అంచున ఉన్నాయి. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో కమిటీ నివేదిక మేరకు జూరాల మరమ్మతులకు రూ. 12 కోట్లు కేటాయించారు. అయితే, మరమ్మతులు పూర్తిచేసే లోపే అధికారం మారడంతో ఆ తర్వాత పనులను పట్టించుకునే వారు కరువయ్యారు. సరిగ్గా మరమ్మతులు చేసే సమయంలో వరద రావడంతో 8 గేట్లలో నాలుగు గేట్ల రోప్‌వేలు తెగిపోయాయి. ఎగువన కురుస్తున్న వర్షాలకు జూరాలకు పెద్ద ఎత్తున వరద వస్తున్నది. వరద ఉధృతిలో బలమైన రాళ్లు కొట్టుకొస్తే ప్రాజెక్టు గేట్లకు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉన్నదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సొంత జిల్లాలోని జూరాల ప్రాజెక్టు మరమ్మతులను గాలికి వదిలేయడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం మాత్రం జూరాల ప్రాజెక్టుకు వచ్చిన ముప్పేమీ లేదని బుకాయిస్తున్నది. ప్రాజెక్టు గేట్ల రోప్‌వేలు తెగిపోయిన విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ నేతలు గురువారం ప్రాజెక్టు సైట్‌ను సందర్శించారు. కాళేశ్వరంలో ఒకటి, రెండు పిల్లర్లు కుంగిపోతే మరమ్మతులు గాలికి వదిలేసి ప్రాజెక్టు మునిగిపోయిందని ప్రచారం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ సొంత జిల్లాలో జూరాల ప్రాజెక్టును డేంజర్ జోన్లో పడేశారని ఆరోపించారు.
దివంగత ఇందిరాగాంధీ పేరు వచ్చేలా ఈ ప్రాజెక్టుకు ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు (పీజేపీ)గా నామకరణం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో ఈ ప్రాజెక్టు నిర్వహణను గాలికి వదిలేశారు. దీంతో కుడి, ఎడమ కాల్వలు శిథిలావస్థకు చేరాయి. చాలాచోట్ల పిల్లర్లు దెబ్బతిన్నాయి. దీంతో ఆందోళన వ్యక్తంచేసిన ఇంజినీర్లు గత ప్రభుత్వానికి నివేదిక అందించారు. స్పందించిన కేసీఆర్ ప్రభుత్వం వెంటనే ఒక కమిటీని నియమించింది. ఈ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ప్రభుత్వం ప్రతి ఏటా మరమ్మతులకు నిధులు కేటాయిస్తూ వచ్చింది. 2022లో ప్రాజెక్టుపై నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికతో మరమ్మతుల కోసం రూ.12 కోట్లతో టెండర్లు పిలిచారు. రాష్ట్రంలో గేట్ల మరమ్మతుల్లో ఆరితేరిన స్వప్న కన్స్ట్రక్షన్ కంపెనీ ఈ పనులు దక్కించుకున్నది. మరమ్మతులు ప్రారంభించే లోపే ప్రభుత్వం మారింది. ఈ క్రమంలో సర్కారు వద్ద రూ. 8 కోట్ల బిల్లులు బకాయిపడ్డాయి. కాంగ్రెస్ సర్కారు వచ్చి 18 నెలలైనా నాటి ప్రభుత్వం విడుదల చేసిన నిధులను ఖర్చు చేయకపోవడం, బకాయిలు చెల్లించకపోవడంతో ప్రాజెక్టు మనుగడ ప్రశ్నార్థకమైంది.
బకాయి పడిన రూ.8 కోట్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఏడాది కోటి రూపాయలు మాత్రమే విడుదల చేసింది. ఈ నిధులతో క్రస్ట్ గేట్లను మరమ్మతుల చేయాలని ఆదేశించింది. అయితే, ఈ డబ్బుతో తూతూమంత్రంగా రిపేర్లు చేయడం వల్ల గేట్ల భద్రతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వస్తున్న వరదను నియంత్రించి దిగువకు నీటిని వదిలే గేట్ల భద్రతపై అధికార యంత్రాంగం అనుమానాలు వ్యక్తం చేస్తున్నది. వరద ఉధృతి పెరుగుతుండటం, ప్రాజెక్టు గేట్లను ఆన్, ఆఫ్‌ను చేసే రోప్‌వేలు తెగిపోవడం ఈ అనుమానాలకు మరింత బలం చేకూరుస్తున్నది. గురువారం ప్రాజెక్టు సైట్‌ను నీటిపారుదల శాఖ అధికారులు పరిశీలించారు. ఎగువ నుంచి వస్తున్న వరద ఉధృతిని, మరమ్మతులు చేపట్టాల్సిన నాలుగు క్రస్టు గేట్ల రోప్‌వేను పరిశీలించారు. ప్రస్తుతం వరద ఎక్కువగా వస్తున్నందున అధికార యంత్రాంగం పైపైనే పరిశీలించి ఉన్నతాధికారులకు నివేదించింది.
ప్రస్తుతం 9వ గేటుకున్న రోప్‌లు తెగిపోయాయి. వీటితోపాటు 12, 34 గేట్లకు ఏర్పాటు చేసిన రోప్‌లు వదులుగా ఉన్నాయి. ఈ రోప్ అనేది గేట్లు ఎత్తడానికి ఉపయోగించే ఇనుప వైరు. ఇవి తెగినంత మాత్రాన ప్రాజెక్టుకు ప్రమాదం ఉండదని ఎస్సీ రహీముద్దీన్ ‘నమస్తే తెలంగాణ’ ప్రతినిధికి వివరించారు. రోప్‌లు తెగిపోయినా గ్రాంట్టీ క్రేన్ ద్వారా గేట్లను ఎత్తడానికి అవకాశం ఉంటుందని వివరించారు. 9వ నంబర్ గేటు కొట్టుకుపోయినట్టు జరుగుతున్న ప్రచారంలో ఎలాం టి నిజం లేదని స్పష్టం చేశారు. 10 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా ప్రాజెక్టుకు నష్టం వాటిల్లకుండా దిగువకు నీరు విడుదల చేయొచ్చని స్పష్టం చేశారు.
జోగుళాంబ గద్వాల, వనపర్తి జిల్లాల సరిహద్దులో కృష్ణా నదిపై నిర్మించిన ఉమ్మడి జిల్లా వరప్రదాయిని జూరాల ప్రాజెక్టుకు భారీ వరద వస్తున్న నేపథ్యంలో క్రస్ట్ గేట్ల రోప్‌వేలు తెగిపోవడం ప్రమాద తీవ్రతను తెలియజేస్తున్నది. గేట్లకు మరమ్మతులు చేస్తున్న తరుణంలో ఏర్పాటు చేసిన రోప్‌వేలు కొన్ని తెగిపోవడం, మరికొన్ని వదులు కావడంతో కలకలం రేపుతున్నది. రేవంత్ సొంత జిల్లాలో అతిపెద్ద జూరాల ప్రాజెక్టు మరమ్మతులపై కాంగ్రెస్ సర్కారు శ్రద్ధ చూపకపోవడం వల్లే ఈ దుస్థితి నెలకొన్నదన్న విమర్శలు వస్తున్నాయి. సర్కారు వచ్చి 19 నెలలైనా మరమ్మతులపై దృష్టి సారించకపోవడం, చివరి నిమిషంలో హడావుడిగా విడుదల చేసిన రూ. కోటి నిధులతో చేపట్టిన మరమ్మతుల్లో డొల్లతనం బయటపడింది.
జూరాల ప్రాజెక్టు మొత్తం గేట్లు 62 కాగా ఈ వేసవిలో మరమ్మతుల కోసం 8 గేట్ల వద్ద పనులు ప్రారంభించారు. 4 గేట్ల రోప్ పూర్తిచేశారు. గేట్లకు రోప్‌వేలు, ఇతర మరమ్మతులు చేయాలంటే నిపుణులైన స్విమ్మర్లతో దాదాపు 4 మీటర్లు కిందికి వెళ్లాల్సి ఉంటుంది. నంబర్ 28, 41, 45, 51 గేట్లకు రోప్ పూర్తి చేశారు. మిగతా 4 గేట్లకు మరమ్మతులు చేసేటప్పుడు మే నెలలో వరద రావడంతో 8, 12, 19, 27 గేట్ల పనులు నిలిచిపోయాయి. కాంగ్రెస్ సర్కారు వచ్చాక కాంట్రాక్టర్‌కు ఇవ్వాల్సిన రూ.8 కోట్ల బకాయిల్లో రూ.కోటి మాత్రమే విడుదల చేసి, కాంట్రాక్టర్‌ను బతిమిలాడి రిపేర్లకు ఒప్పించింది. ఒక్కో గేటు మరమ్మతుకు రూ.11 లక్షలు ఖర్చు చేస్తున్నారు. దీంట్లో రబ్బర్లు బిగించడం, పెయింటింగ్, లీకేజీలకు మరమ్మతులు వంటి పనులు చేపట్టాల్సి ఉన్నది.
ప్రపంచమే అచ్చెరువొందేలా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుపై విషం కక్కిన రేవంత్ సర్కారు ఇప్పుడు జూరాల ప్రాజెక్టుపై ఏం సమాధానం చెప్తుందని మాజీ మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి ప్రశ్నించారు. గురువారం జూరాల ప్రాజెక్టును వీరు సందర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కాళేశ్వరం కుంగిపోయిందని ప్రచారం చేసే అధికార పార్టీ నేతలు జూరాల ప్రాజెక్టు గేట్లపై వస్తున్న అనుమానాలపై ఎందుకు మౌనం వహించారని నిలదీశారు. మంత్రులు, అధికార పార్టీ నేతలు ప్రాజెక్టును ఎందుకు సందర్శించలేదని నిలదీశారు. రేవంత్ రాష్ర్టానికే కాకుండా సొంత జిల్లాకు కూడా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారని ఎద్దేవా చేశారు. ఈ ప్రాజెక్టును తామే కట్టామని చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం మరమ్మతులకు నిధులు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలోని ప్రాజెక్టులపై ప్రభుత్వానికి ఏమాత్రం అవగాహన లేదని దుయ్యబట్టారు. ఈ ఏడాది వానకాలంలో కృష్ణానదికి ముందుగానే వరద వచ్చినా రైతులకు సకాలంలో సాగునీరు ఇవ్వడంలో సర్కారు విఫలమైందని విమర్శించారు. వేసవిలోనే ప్రాజెక్టు గేట్లకు మరమ్మతులు చేయాలన్న సోయి కూడా లేదని ధ్వజమెత్తారు. మరమ్మతులకు రూ.11 కోట్లతో టెండర్లు పిలిచినా కమీషన్లు ఇవ్వాలని వెంటబడటంతో పనులు చేయకుండానే గుత్తేదారు పరారయ్యాడన్నారు.