 
                                                            హైదరాబాద్, అక్టోబర్ 30 (నమస్తే తెలంగాణ): జూబ్లీహిల్స్‌లో ప్రచారం చేస్తున్న తమ క్యాడర్‌ను వారంలోగా ఖతం చేస్తానని కాంగ్రెస్ అభ్యర్థి బెదిరించడం దుర్మార్గమని బీఆర్ఎస్ నాయకులు ఖండించారు. ఎన్నికల నియామవళిని ఉల్లంఘించిన నవీన్‌యాదవ్‌పై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నాయకులు పల్లె రవికుమార్, రామచంద్రునాయక్, కిశోర్‌గౌడ్, ఉపేంద్ర, సుర్వియాదయ్యగౌడ్తో కూడిన బృందం గురువారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌కు ఫిర్యాదు చేసింది. నవీన్‌యాదవ్ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.
రాష్ట్ర ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసిన అనంతరం బీఆర్కే భవన్ వెలుపల బీఆర్ఎస్ నాయకులు మీడియాతో మాట్లాడారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ప్రజలు స్వేచ్ఛగా ఓటేసేలా ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవికుమార్‌గౌడ్ విజ్ఞప్తిచేశారు. కాంగ్రెస్ అభ్యర్థి వారంలోగా బీఆర్ఎస్ క్యాడర్‌ను ఖతం చేస్తామని బెదిరించడం కోడ్ ఉల్లంఘన కిందికి వస్తుందని స్పష్టంచేశారు. ఆయన మాటలు రాజ్యాంగవిరుద్ధమని ఆక్షేపించారు.
సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి బెదిరింపులకు బీఆర్ఎస్ భయపడబోదని తేల్చిచెప్పారు. ప్రజాస్వామ్యపద్ధతిలోనే తగిన బుద్ధిచెప్తామని హెచ్చరించారు. నవీన్‌యాదవ్‌కు నోటీసు జారీ చేస్తామని ఎన్నికల కమిషనర్ హామీ ఇచ్చారని వెల్లడించారు. బీఆర్ఎస్ క్యాడర్‌ను బెదిరించిన కాంగ్రెస్ అభ్యర్థిని పోటీకి అనర్హుడిగా ప్రకటించాలని ఎస్ఈసీని కిశోర్‌గౌడ్ కోరారు. వెంటనే కోడ్ ఉల్లంఘన కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నదని సుర్వి యాదయ్యగౌడ్ ఆరోపించారు.
 
                            