ఖమ్మం సిటీ, ఫిబ్రవరి 10: ఖమ్మం జిల్లాను క్రీడా ప్రతిభకు కేంద్రంగా తీర్చిదిద్దాలని కలెక్టర్ అనుదీప్ ఆకాంక్షించారు. ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలో జరుగుతున్న 2025-26 సీఎం కప్ క్రీడా పోటీలను మంగళవారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కప్ క్రీడా పోటీలను గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయిలో విజయవంతంగా నిర్వహించామని చెప్పారు. మొత్తం 44 రకాల క్రీడా పోటీలు జిల్లాస్థాయిలో జరుగుతాయని, క్రీడాకారులు అత్యంత ఉత్సాహంగా పాల్గొనాలని సూచించారు.
గెలుపోటములు సహజమని, ఎవరికి వారు శక్తివంచన లేకుండా ప్రయత్నం చేయాలని అన్నారు. నిరుడు రాష్ట్రస్థాయి పోటీల్లో 47 పతకాలు సాధించారని, ఈ ఏడాది 75 పతకాలు లక్ష్యంగా క్రీడాకారులు కృషిచేయాలని కోరారు. తొలుత పటేల్ స్టేడియంలో కలెక్టర్ క్రీడా జెండాను ఎగురవేసి క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. అనంతరం పలు రకాల క్రీడలను దగ్గరుండి ప్రారంభించగా పోటీలు అత్యంత ఉత్సాహపూరిత వాతావరణంలో కొనసాగాయి. కేఎంసీ మేయర్ నీరజ, డీవైఎస్వో తుంబూరు సునీల్‌రెడ్డి, డీఈవో చైతన్య జైనీ, వివిధ శాఖల అధికారులు, కోచ్‌లు, క్రీడాకారులు పాల్గొన్నారు.