సిటీబ్యూరో/దుండిగల్, ఫిబ్రవరి 10(నమస్తే తెలంగాణ) : రిక్టర్ స్కేల్‌పై స్వల్ప భూప్రకంపనలు జనాలను భయాందోళనలకు గురిచేశాయి. ఉదయం 10.17 సమయంలో 40 సెకన్ల పాటు భూమి కంపించడంతో జనాలు బెంబెలెత్తిపోయారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలో సంభవించిన భూప్రకంపనలు స్వల్ప కాలమే ఉన్నాయని ఎన్జీఆర్ఐ పరిశోధకులు తేల్చారు. రిక్టర్ స్కేల్‌పై 1.5 మ్యాగ్నిట్యూడ్‌గా నమోదైనట్లుగా వెల్లడించారు. భూమి కంపించిన సమయంలో భారీ శబ్దం రావడంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. అయితే ఇది భూకంపం లేక సమీపంలో జరుగుతున్న క్వారీ, భారీ నిర్మాణ పనుల వలన కలిగిన ప్రకంపనలా అని అనుమానం వ్యక్తం చేశారు.
కానీ ఎన్జీఆర్ సైంటిస్టుల వివరణతో నగరంలో సూక్ష్మ స్థాయిలో భూకంపం వచ్చిందని తేలింది. అయితే అధికారులు కూడా ఘటనకు సంబంధించిన వివరాలు సేకరించే పనిలో ఉండగా… ప్రస్తుతానికి ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదన్నారు. హైదరాబాద్ దక్కన్ పీఠభూమి ప్రాంతం కావడంతో భూకంప ప్రభావం ఉండదని చెబుతున్నారు. సెస్మిక్ జోన్-2 పరిధిలో ఉండటంతో భూప్రకంపనలు మాత్రమే నమోదయ్యే అవకాశం ఉందని, దీనికి భూగర్భంలో జరిగే మార్పులు, భారీ మౌలిక వసతుల నిర్మాణాలు, భూగర్భంలో జరిగే కార్యకలాపాల కారణంగా భూమి కంపించడానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని చెబుతున్నారు. అయితే ఓ పాఠశాలలో చిన్నారులు భయంతో బయటకు పరుగులు తీయగా, స్థానికులు తీసిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.