Harish Rao | హైదరాబాద్, జనవరి 4 (నమస్తేతెలంగాణ): ‘రైతు భరోసాకు కోతపెట్టిన కాంగ్రెస్ సర్కారు అన్నదాతకు గుండెకోతను మిగిల్చింది.. పెట్టుబడి సాయం కింద ఏటా రూ.15 వేలు ఇస్తామని రూ.12 వేలకు కుదించి దగా చేసింది’ అని మాజీ మంత్రి హరీశ్‌రావు నిప్పులు చెరిగారు. రైతాంగాన్ని నమ్మించి పచ్చి మోసానికి పాల్పడ్డ సీఎం రేవంత్‌రెడ్డికి తగిన సమయంలో రైతులు బుద్ధి చెప్తారని హెచ్చరించారు. ‘ఎకరాకు రూ.15 వేలు ఇస్తామంటూ ఎన్నికల సభ ల్లో ఊదరగొడుతూ ఓట్లను కొల్లగొట్టి గద్దెనెక్కిన రేవంత్‌రెడ్డి.. అదే గద్దెనెక్కినంక గద్ద లా మారి అన్నదాతలను దారుణంగా వంచిస్తున్నారని శనివారం ఎక్స్ వేదికగా మండిపడ్డారు.
ఎకరా కు రూ.12 వేల చొప్పున ఇస్తామని క్యాబినెట్ లో నిర్ణయించి రైతుల ఆశలను అడియాసలు చేశారని విరుచుకుపడ్డారు. కేసీఆర్ మానస పుత్రిక, ప్రపంచమే మెచ్చిన రైతుబంధు స్ఫూర్తికి వ్యతిరేకంగా మంత్రివర్గం నిర్ణయం తీసుకోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. ‘భూమి కలిగిన రైతులకే కాదు.. కౌలు రైతులకూ ఏటా రూ.15 వేలు చెల్లిస్తామని హామీ ఇచ్చి క్యాబినెట్లో ఆ ఊసే ఎత్తకుండా ధోకా చేశారని ధ్వజమెత్తారు. ‘సగం మందికి రుణమాఫీ ఎగ్గొట్టి చిల్లర నాటకంగా మార్చేశారు.. బోనస్ మాటను బోగస్ చేశారు.. పంట బీమాను పత్తాలేకుండా చేశారు’ అం టూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వానకాలంలో ఎగ్గొట్టిన రైతుభరోసాతో కలిపి రూ.15 వేల చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేశారు. అప్పటిదాకా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదిలిపెట్టబోమని హెచ్చరించారు.
ఎన్నికల ముందు ఎకరాకు రూ.15 వేల రైతుభరోసా ఇస్తామని చెప్పిన కాంగ్రెస్, ప్రస్తుతం రూ.12 వేలకు కుదించి కోతపెట్టి వారిని నట్టేట ముంచింది. ఇది రైతు సంక్షేమ ప్రభుత్వం కాదు. రైతు వంచక ప్రభుత్వం. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను రేవంత్‌రెడ్డి తుంగలో తొక్కుతున్నారు. రైతు రుణమాఫీ, వానకాలం పంటకు పెట్టుబడి సాయం ఎగ్గొట్టి తీరని అన్యాయం చేశారు. ఆయనకు తగిన సమయంలో
రైతులు బుద్ధి చెప్తారు.
– వేముల ప్రశాంత్‌రెడ్డి, మాజీ మంత్రి
ఎకరాకు రూ.15 వేలు రైతుభరోసా ఇస్తామని చెప్పిన రేవంత్‌రెడ్డి.. రూ.12 వేలకు కుదించడం తీరని అన్యాయం. సంక్రాంతికి ఇస్తామని చెప్పి జనవరి 26కు వాయిదా వేయడం సిగ్గుచేటు. రైతు కూలీలకు రూ.12 వేలు ఇస్తామని చెప్పిన సర్కారు ఇప్పటి వరకు విధివిధానాలు ఖరారు చేయకపోవడం విడ్డూరం. బీఆర్ఎస్ ప్రభుత్వం 11 విడతల్లో రైతుబంధును ఎలాంటి షరతుల్లేకుండా అం దించింది. రేవంత్ ప్రభుత్వం కండీషన్లు పెడుతూ అన్నదాతను దగా చేస్తున్నది.
– దేవీప్రసాద్, బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్
కేసీఆర్ రైతుబంధును ఎకరాకు కేవలం రూ.10 వేలే ఇస్తున్నారు. మేం వస్తే రూ.15 వేలు ఇస్తామని చెప్పిన రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక రైతుభరోసాను రూ.12 వేల చొప్పున మాత్రమే ఇస్తామని చెప్పడం బాధాకరం. అన్నదాతను మోసం చేసిన ముఖ్యమంత్రి వెంటనే క్షమాపణలు చెప్పాలి. ఇది ప్రభుత్వ చేతకానితనానికి నిదర్శనం. ఇప్పటికైనా రైతుల ఆగ్రహం చవిచూడక ముందే హామీ ఇచ్చిన మేరకు రూ.15 వేల చొప్పున ఇవ్వాలి.
– వై సతీశ్‌రెడ్డి, బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్