లింగంపేట (తాడ్వాయి), అక్టోబర్ 7: పోలీసులు బీఆర్ఎస్ కార్యకర్తలను వేధిస్తే సహించేది లేదని కామారెడ్డి జిల్లా తాడ్వాయికి చెందిన బీఆర్ఎస్ నాయకులు స్పష్టంచేశారు. తాడ్వాయి మండలంలోని సంగోజీవాడి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త తాజ్ సోషల్ మీడియాలో వచ్చిన ఓ కథనాన్ని ఇతర గ్రూపులో పోస్టుచేయడంతో కాంగ్రెస్ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు తాజ్‌ను పోలీస్ స్టేషన్‌కు పిలిపించారు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ నాయకులు సైతం స్టేషన్‌కు తరలివెళ్లారు. గతంలో మాజీ ఎమ్మెల్యే సురేందర్‌పై కాంగ్రెస్ పార్టీ నాయకులు పోస్టులు పెట్టినా తాము ఎవరిపై ఫిర్యాదులు చేయలేదని వారు పోలీసులకు వివరించారు. బీఆర్ఎస్ కార్యకర్తలపై ఫిర్యాదు చేయడాన్ని నిరసిస్తూ పోలీస్ స్టేషన్ ఎదుట రాస్తారోకో నిర్వహించారు.
కామారెడ్డి, ఎల్లారెడ్డి ప్రధాన రహదారిపై రాస్తారోకోతో రాకపోకలు నిలిచిపోయాయి. సోషల్ మీడియాల్లో వచ్చిన కథనాన్ని పోస్టు చేయడం నేరమా? అని ప్రశ్నించారు. విచారణల పేరు తో కార్యకర్తలను వేధించడం సరికాదని అన్నా రు. ఆందోళనలో డీసీఎంఎస్ డైరెక్టర్ కపిల్‌రెడ్డి, మండల పరిషత్ మాజీ ఉపాధ్యక్షుడు ముదాం నర్సింహులు, బీఆర్ఎస్ నాయకులు రవీందర్‌రెడ్డి, మంగారెడ్డి, సాయిరెడ్డి పాల్గొన్నారు.