హైదరాబాద్, జనవరి 9 (నమస్తే తెలంగాణ): పార్లమెంట్లో తెలంగాణ గళం వినిపించటం బీఆర్ఎస్తోనే సాధ్యమని ఆ పార్టీ లోక్‌సభా పక్ష నేత నామా నాగేశ్వరరావు తెలిపారు. బీజేపీ, కాంగ్రెస్ కంటే ఎక్కువసార్లు తెలంగాణ గురించి లోక్‌సభ, రాజ్యసభల్లో ప్రశ్నించామని చెప్పారు. మంగళవారం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గ సన్నాహక సమావేశం జరిగింది.
ఆ తర్వాత బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, మాజీ విప్ రేగా కాంతారావు, మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, కందాళ ఉపేందర్‌రెడ్డి, మెచ్చా నాగేశ్వరరావు, వనమా వెంకటేశ్వరరావు, బానోత్ మదన్‌లాల్, కొండబాల కోటేశ్వరరావుతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.
కాంగ్రెస్ పార్టీ ఎలాగైనా ఎన్నికల్లో గెలవాలని అమలుకు సాధ్యంకాని హామీలిచ్చిందని, ఇప్పుడు వాటిని ఎలా అమలు చేయాలో తెలియక తల పట్టుకుంటున్నదని విమర్శించారు. ఎన్నికల ముందు పింఛన్ తీసుకోవద్దని, డిసెంబర్ తర్వాత రూ.4000 వేలు ఇస్తామని, రైతుబంధు రూ.15 వేలు వేస్తామని, ప్రతి ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తామని ప్రకటించారని.. ఇప్పుడు గుర్తుచేస్తే ఉలిక్కి పడుతున్నారని మండిపడ్డారు.
ప్రజలకు లోటు కనిపిస్తున్నది: వద్దిరాజు
నెలరోజుల్లోనే తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ లేనిలోటు స్పష్టంగా కనిపిస్తున్నదని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అన్నారు. ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తెలిపారు. కేసీఆర్ సీఎం పదవిలో లేకపోవడాన్ని ప్రజలు జీర్ణించుకోలేక పోతున్నారని చెప్పారు. అందుకే.. ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో కేసీఆర్‌కే ఓటెయ్యాలని ప్రజలు నిర్ణయించుకున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతలు 420 హామీలిచ్చి.. అడిగితే ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని విమర్శించారు.
పార్లమెంట్లో తెలంగాణ సమస్యలను బలంగా వినిపించడం బీఆర్ఎస్తోనే సాధ్యమవుతుందని మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. నామా నాగేశ్వరరావు తెలంగాణ బలాన్ని, గళాన్ని వినిపించిన వ్యక్తి అని, అందుకే మళ్లీ ఆయన్నే ఖమ్మం ఎంపీగా నిలబెట్టాలని పార్టీ అధ్యక్షుడిని కోరామని తెలిపారు. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రతి అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే ఎమ్మెల్యే స్థానంలో పార్టీ గెలిచిందని, లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం మంచి మెజార్టీతో బీఆర్ఎస్ పార్టీని గెలిపించారని గుర్తుచేశారు. ఈసారి కూడా ఇదే జరగబోతున్నదని చెప్పారు.
ప్రజాపాలన రోడ్డుపాలు: కాంతారావు
హైదరాబాద్ నడిరోడ్డుపై ప్రజాపాలన దరఖాస్తులు దర్శనమిచ్చాయని, కాంగ్రెస్ ప్రభుత్వ చిత్తశుద్ధికి ఇంతకంటే నిదర్శనం ఇంకేం ఉంటుందని మాజీ విప్ రేగా కాంతారావు మండిపడ్డారు. కాం గ్రెస్ నెలరోజుల పాలనను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని తెలిపారు. డిసెంబర్ 9న అధికారంలోకి వచ్చిన వెంటనే రైతు రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పిందని, ఆ హామీ ఏమైందని ప్రశ్నించారు.
హామీలపై కాలయాపనతో సరిపుచ్చాలని ప్రభుత్వం చూస్తున్నదని మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఆరోపించారు. ఆరు గ్యారెంటీలపై ప్రభుత్వ తీరు, మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు కాలయాపనలో భాగమేనని విమర్శించారు. నెలరోజుల్లోనే కాంగ్రెస్, బీఆర్ఎస్ పాలనకు మధ్య వ్యత్యాసాన్ని ప్రజలు గమనించారని తెలిపారు.