Bandi Sanjay | హైదరాబాద్, మార్చి 11 (నమస్తే తెలంగాణ): బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంస్కార హీనంగా ప్రవర్తిస్తున్నారని మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎమ్మెల్సీ కవితపై బండి చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకొని తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అన్నింటికీ స్పందించే రాష్ట్ర గవర్నర్ తెలంగాణ ఆడబిడ్డపై బండి సంజయ్ అనుచిత వ్యాఖ్యలపై ఎందుకు స్పందించట్లేదని ప్రశ్నించారు. శనివారం ఢిల్లీలోని తెలంగాణ భవన్లో మంత్రులు మీడియాతో మాట్లాడారు.
మంత్రి సబితాఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల కోసం ఢిల్లీలో దీక్ష చేపడతామని ఈ నెల 2న ఎమ్మెల్సీ కవిత ప్రకటించగానే.. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఆమెకు ఈడీ నోటీసులు జారీ చేసిందని ఆరోపించారు. దేశవ్యాప్తంగా బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలను, అప్రజాస్వామిక విధానాలను ఎండగడుతున్న బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్‌ను నేరుగా ఎదుర్కోలేకనే ఎమ్మెల్సీ కవితను టార్గెట్ చేసిందని మండిపడ్డారు. ఎన్ని కుట్రలు చేసినా బీఆర్ఎస్ విస్తరణను బీజేపీ అడ్డుకోలేదని స్పష్టంచేశారు. ప్రజలంతా సీఎం కేసీఆర్ వెంటే ఉన్నారని చెప్పారు. రాజకీయ జీవితంలో ఉన్నవాళ్లు నోరు అదుపులో పెట్టుకోవాలని బండికి హితవు పలికారు. ఆడబిడ్డల హక్కుల కోసం ఎమ్మెల్సీ కవిత చేపట్టిన దీక్షకు వచ్చిన స్పందన చూసి ఓర్వలేక బండి సంజయ్ నోరుపారేసుకున్నారని ధ్వజమెత్తారు. బీజేపీ రాష్ట్ర నాయకులు హైదరాబాద్‌లో ధర్నా ఎందుకు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.
స్థానిక సంస్థల్లో మహిళలకు 50 శాతం కంటే ఎక్కువ రిజర్వేషన్ అమలుచేసిన ఏకైక పార్టీ బీఆర్ఎస్ అని స్పష్టంచేశారు. రాష్ట్రంలో లక్షా 13 వేల వార్డు సభ్యుల్లో 59 వేల వార్డుల్లో మహిళలే ఉన్నారని.. 6,844 మహిళా సర్పంచులు, 3,330 ఎంపీటీసీలు, 300 పైచిలుకు జడ్పీటీసీలు, 349 మంది ఎంపీపీలు మహిళలేనని ఉద్ఘాటించారు. జీహెచ్ఎంసీ మేయర్ స్థానం జనరల్‌కు కేటాయించినా ఆ స్థానాన్ని మహిళకు కేటాయించి సీఎం కేసీఆర్ నారీ లోకానికి గౌరవాన్ని పెంచారని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో కల్యాణలక్ష్మి నుంచి గృహలక్ష్మి దాకా అన్నింట్లోనూ స్త్రీలకే సీఎం కేసీఆర్ అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని వివరించారు. మహిళా దినోత్సవం రోజే గ్యాస్ ధర పెంచి మహిళలకు మోదీ సర్కార్ గొప్ప బహుమానం ఇచ్చిందని ఎద్దేవాచేశారు. కేంద్రం ఎన్ని ఇబ్బందులకు గురిచేసినా బీఆర్ఎస్ మొక్కవోని దీక్షతో పోరాడుతుందని చెప్పారు.
చీమచిటుక్కుమన్నా స్పందించే గవర్నర్ తమిళిసై సౌందరరాజన్.. మహిళా ప్రజాప్రతినిధిపై బండి సంజయ్ అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఎందుకు మాట్లాడటం లేదని స్త్రీ,శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ప్రశ్నించారు. ఎమ్మెల్సీ కవితపై బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యలను ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు. బండిని తక్షణమే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి వ్యాఖ్యలకు చోటు లేదన్నారు. బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అయ్యాక రాజకీయ విలువలు దిగజారిపోయాయని ఆవేదన వ్యక్తంచేశారు. ఉద్యమనేత బిడ్డగా తండ్రి అడుగుజాడల్లో నడిచి తెలంగాణ సంసృతిని ప్రపంచానికి చాటిన గొప్ప వ్యక్తి ఎమ్మెల్సీ కవిత అని తెలిపారు. దశాబ్దాలుగా రిజర్వేషన్లకు నోచుకొని మహిళల కోసం కవిత చేపట్టిన దీక్షకు దేశవ్యాప్తంగా ఆదరణ వచ్చిందని, దీన్ని జీర్ణించుకోలేకే బీజేపీ అవాకులు చవాకులు పేలుతున్నదని మండిపడ్డారు. బీజేపీకి మహిళలంటే గౌరవం లేదని, అందుకే బండి ఇలాంటి సంస్కార హీనమైన మాటలు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. సీఎం కేసీఆర్ దిశానిర్దేశంలో రాష్ట్ర మహిళలు దేశంలో తలెత్తుకొని తిరుగుతున్నారని చెప్పారు. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో మహిళలపై జరుగుతున్న అకృత్యాలను ఎండగట్టారు. బండి చేసిన వ్యాఖ్యలు వ్యక్తిగతమా, బీజేపీ పార్టీవా చెప్పాలని డిమాండ్ చేశారు. మోదీ, బీజేపీ పంపే వేటకుక్కలకు తెలంగాణ భయపడదని చెప్పారు. 2018 ఎన్నికల్లో 105 స్థానాల్లో డిపాజిట్ కోల్పోయిన బీజేపీకి వచ్చే ఎన్నికల్లో అంతకన్నా ఘోర పరాజయం తప్పదన్నారు.
ఎమ్మెల్సీ కవితపై చేసిన అనుచిత వ్యాఖ్యలను తక్షణమే ఉపసంహరించుకోవాలని బండి సంజయ్‌ని ఎంపీ మాలోత్ కవిత డిమాండ్ చేశారు. మహిళా లోకానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేదంటే చెప్పులతో సమధానం చెప్పాల్సి ఉంటుందని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వ అప్రజాస్వామిక విధానాలను ఎండగడుతున్న బీఆర్ఎస్ నేతలను మోదీ కండ్లల్ల పెట్టుకున్నారని మండిపడ్డారు. సీఎం కేసీఆర్‌ను ప్రత్యక్షంగా ఎదుర్కోలేక ఎమ్మెల్సీ కవితపై ఈడీని ఉసిగొల్పారని మండిపడ్డారు. మోదీ తాటాకు చప్పుళ్లకు తెలంగాణ తలవంచదని స్పష్టంచేశారు.