హైదరాబాద్, ఫిబ్రవరి 16 (నమస్తే తెలంగాణ): పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రాష్ట్రమంతా తిరిగేది భూ కబ్జాల కోసమేనా అని ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డి తనపై చేసిన భూఅక్రమణల ఆరోపణను నిరూపిస్తే నడిచౌరస్తాలో ముక్కునేలకు రాస్తానని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు సవాల్ చేశారు. బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో గురువారం వారిద్దరూ మీడియాతో మాట్లాడారు.
బీజేపీ, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులపై నిప్పులు చెరిగారు. నోటికొచ్చినట్టు మాట్లాడితే సహించేదిలేదని హెచ్చరించారు. గువ్వల బాలరాజు మాట్లాడుతూ.. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఏ మంచిపనిచేసినా బండి సంజయ్ అడ్డుపడుతున్నారని ధ్వజమెత్తారు. సీఎంను విమర్శిస్తే వార్తల్లో ఉండొచ్చనే కుత్సిత బుద్ధితో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయ అభివృద్ధికి సీఎం కేసీఆర్ కార్యాచరణ ప్రకటిస్తే..బండి సంజయ్ నీచంగా మాట్లాడుతున్నాడని, యాదాద్రి పునర్నిర్మాణం చేపట్టినప్పుడు కూడా ఇలాగే కారుకూతలు కూశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ బీజేపీ నాయకులకు రుచించటం లేదన్నారు.
వరుసగా ఉద్యోగ నోటిఫికేషన్లు వస్తుండడంతో వారి సమావేశాలకు కార్యకర్తలు రావడం లేదని దీంతో ఉద్యోగాల భర్తీ చేయకూడదనే రీతిలో బండి సంజయ్ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అంబేద్కర్ పేరుతో నిర్మిస్తున్న రాష్ట్ర సచివాలయాన్ని కూల్చివేస్తామన్న బండి సంజయ్‌ని, బీజేపీని ప్రజలు పాతాళానికి తొక్కేస్తారని హెచ్చరించారు. అబద్ధాల పునాదులపై అధికారంలోకి రావాలని బీజేపీ, కాంగ్రెస్ కలలు కంటున్నాయని, అందుకే ఒకరు కూల్చివేస్తామని, మరొకరు పేల్చివేస్తామని పిచ్చికూతలు కూస్తున్నారని అన్నారు. కాంగ్రెస్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఉండాల్సింది పిచ్చాస్పత్రుల్లోనని, ఈ విషయంలో వారి పార్టీ నేతలు ప్రత్యేక చొరవ చూపాలని ఆయన కోరారు.
ఒక్కటి నిరూపించినా పోటీచేయను: రేగా
తాను 300 ఎకరాలను అక్రమంగా సంపాదించానని నిరూపిస్తే మణుగూరు చౌరస్తాలో ముక్కునేలకు రాస్తానని, లేదంటే రేవంత్‌రెడ్డి ఆ పనిచేసేందుకు సిద్ధంగా ఉండాలని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు సవాల్ విసిరారు. రేవంత్ తనపై విడుదల చేసిన చార్జిషీట్లోని ఒక్క అంశాన్ని నిరూపించినా వచ్చే ఎన్నికల్లో పోటీచేయనని తేల్చిచెప్పారు. రేవంత్‌రెడ్డి తన కులాన్ని, జాతిని అవమానించారని మండిపడ్డారు. రేవంత్ గాలి మాటలు బంద్ చేయాలని, లేదంటే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. తాను తలచుకుంటే రేవంత్ తన నియోజకవర్గంలో పాదయాత్ర చేసేవాడేకాదన్నారు.