ఖమ్మం రూరల్, ఫిబ్రవరి 10 : ఖమ్మం జిల్లాలో స్వేచ్ఛాయుత వాతావరణంతో కూడిన నిష్పక్షపాత ఎన్నికలు జరిగేలా సమన్వయంతో పని చేయాలని సిబ్బందికి పోలీస్ కమిషనర్ సునీల్ దత్ సూచించారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల బందోబస్తు విధులు నిర్వహించేందుకు సిద్ధమవుతున్న పోలీస్ సిబ్బంది ఎన్నికల విధులు, విధివిధానాలు, ఎన్నికల ప్రవర్తన నియమావళి, శాంతిభద్రతల పరిరక్షణ అంశాలపై, ఏదులాపురం మున్సిపాలిటీ సంబందించి ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో సీపీ పాల్గొని మాట్లాడారు. ఎన్నికల సంఘం నియంత్రణలో క్రమశిక్షణకు లోబడి పనిచేయాలన్నారు. ఎన్నికల నియమావళిపై సమగ్ర అవగాహన ఏర్పర్చుకుని, ఎన్నికల ప్రక్రియ ముగిసేంత వరకు ఎటువంటి పొరపాట్లు జరుగకుండా చూసుకోవాలన్నారు.
శాంతి భద్రతల పరిరక్షణలో కఠినంగా ఉండాలని, అప్పగించిన భాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని, పోలింగ్ కేంద్రాలను వదిలి వెళ్లవద్దని సూచించారు. ఎన్నికల్లో డబ్బు, మద్యం ప్రభావాన్ని నిలువరించేందుకు ఎన్నికల సంఘం కఠిన చర్యలు తీసుకుంటోందన్నారు. స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్, ఫ్లైయింగ్ స్క్వార్జ్ టీమ్స్, చెక్ పోస్టులు, రూట్ మొబైల్ పార్టీలు, ఎన్నికల ముందు, పోలింగ్ రోజు, ఓట్ల లెక్కింపు సందర్భంగా నిర్వహించే విధులలో పూర్తి అవగాహన ఉండాలన్నారు. అదేవిధంగా పోలింగ్ అనంతరం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకొవాలని సూచించారు. ఐదు మున్సిపాలిటీలలో 11 వందల మంది పోలీస్ సిబ్బంది (అడిషనల్ డీసీపీలు -04, ఏసీపీలు -08, సిఐలు- 25, ఎస్ఐలు- 80, పోలీస్ సిబ్బంది -975) పాల్గొంటున్నారని అన్నారు. ఎక్కడ కూడా ఘర్షణ వాతావరణం లేకుండా పోలీస్ పెట్రోలింగ్ ముమ్మరంగా చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ (ఏఆర్) కుమారస్వామి, ఏసీపీ తిరుపతి రెడ్డి, నర్సయ్య, రూరల్ డివిజన్, సిఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు.

స్వేచ్ఛాయుత ఎన్నికలే లక్ష్యంగా పనిచేయాలి : సీపీ సునీల్ దత్