నారాయణపేట : రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి సొంత నియోజకవర్గంలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో 6వ వార్డు బీజేపీ అభ్యర్థి మహదేవప్ప ఆత్మహత్య కలకలం రేపింది. ఆత్మహత్యపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మంత్రి మక్తల్ మున్సిపాలిటీని ఎలాగైనా చేజిక్కించుకోవాలనే లక్ష్యంతో అక్కడే మకాం వేసి మొత్తం విపక్ష అభ్యర్థులను టార్గెట్ చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్, బీజేపీ క్యాండెట్లను ప్రలోభపెట్టేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా ఈ వార్డులో బీజేపీ గెలుస్తుందని సర్వే నివేదికలు రావడంతో సదరు అభ్యర్థిని కాంగ్రెస్ నేతలు కొందరు టార్గెట్ చేసి భయపెట్టినట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
బీజేపీ పార్టీ ఫండ్ ఇవ్వనందుకేనా..?
మరోవైపు బీజేపీ కూడా మంత్రిని ఓడించి ఎలాగైనా మక్తల్ మున్సిపల్ దక్కించుకోవాలని ఎంపీ డీకే అరుణ గత రెండు రోజులుగా అక్కడే మకాం వేసింది. అయితే బీజేపీ వార్డు సభ్యులకు పార్టీ ఫండ్ పంపిణీ చేస్తున్నారు. మహదేవప్ప గిరిజన అభ్యర్థి కావడంతో పార్టీ ఫండ్లు ఇవ్వకుండా కొంతమంది నేతలు నొక్కేసినట్లు సమాచారం. ఎన్నికల్లో పంచడానికి తన దగ్గర డబ్బులు లేకపోవడం బీజేపీ నేతలు గిరిజనడనే వివక్ష చూపుతూ పార్టీ ఇచ్చిన డబ్బును కొంతమంది నేతలు మాయం చేశారని, తీవ్ర మనస్తాపం చెంది ఎక్కడ ఓడిపోతే పరువు పోతుందని మనస్థాపంతో మహదేవప్ప ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది.
మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన చిట్టెం రామ్మోహన్ రెడ్డి
మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి చందాపూర్ వెళ్లి మహదేవప్ప కుటుంబాన్ని పరామర్శించారు. రాజకీయాల్లో దమ్ముంటే పోటీ చేసి గెలవాలని ఇలా బెదిరింపులకు పాల్పడడం సిగ్గు చేటన్నారు. గిరిజన వార్డు మెంబర్లను అవమానాలకు గురి చేయడం చూస్తుంటే ఈ రెండు పార్టీలు ప్రజాస్వామ్యంపై నమ్మకం లేకుండా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. ఇది ముమ్మాటికీ కాంగ్రెస్, బీజేపీ పార్టీల రాజకీయ హత్యేనని విమర్శించారు.
మక్తల్‌లో ఉద్రిక్తత
నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో 6వ వార్డు బీజేపీ అభ్యర్థి ఆత్మహత్య చేసుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలింగ్‌కు ఒకరోజు సమయం ఉండగా ఓ గిరిజన అభ్యర్థి ఆత్మహత్యకు పాల్పడటం వెనుక రాజకీయ కుట్ర ఉందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఘటనతో 6వ వార్డు ఎన్నిక ఆగిపోనుంది. మరోవైపు మిగతా చోట్ల కూడా అధికార పార్టీ వత్తిళ్లతో ఎన్నికలు సజవుగా జరుగుతాయా లేదు అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.