హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్ట్ 12(నమస్తే తెలంగాణ) : హైడ్రా కమిషనర్ రంగనాథ్ వ్యవహరిస్తున్న తీరు చిత్రవిచిత్రంగా ఉంటున్నది. డజన్లకొద్దీ కోర్టు ధిక్కార కేసులు ఎదుర్కొంటున్న రంగనాథ్‌ను తొలగించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశిస్తుంటే మరోవైపు ఆయన మాత్రం తాను చేసింది కరెక్టేనని, తనను తాను నిరూపించుకొనేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా వివిధ మార్గాల ద్వారా ఒత్తిడి ఎత్తుగడలు ప్రయోగిస్తున్నారు. తన పదవిని కాపాడుకొనేందుకు ఎన్నడూ లేనంతగా పలు మీడియా సంస్థలకు ప్రాయోజిత ఇంటర్వ్యూలు ఇస్తూ తాను చేస్తున్నదంతా కరెక్టేననే వాదనలు పునరుద్ఘాటిస్తున్నారు. అదీగాక కోర్టు ధిక్కరణ కేసులు వేసినవారిని భూకబ్జాదారులుగా సంబోధిస్తూ వారిపై ఎదురుదాడికి దిగుతున్నారని, అంతేకాకుండా తమపై పలుచోట్ల రంగనాథ్ దుష్ర్పచారం చేస్తున్నారని నల్ల మల్లారెడ్డి, ఎడ్ల సుధాకర్‌రెడ్డి వంటి వాళ్లు ఆయన వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నారు.
ఇదిలా ఉంటే రంగనాథ్ మరో అడుగు ముందుకేసి తన సామాజికతను కూ డా తన కవచంగా వాడుకొంటూ అదే సామాజికవర్గం వారితో సోషల్‌మీడియాలో పోస్టులు పెట్టించడం, ఆ సామాజిక వర్గానికి సంబంధించి కొన్ని ప్రభుత్వ, ప్రైవేట్ శాఖలు, సంస్థల ప్రత్యేక వాట్సప్ గ్రూపుల్లో ఆయనకు అనుకూలంగా స్టేటస్లు పెట్టాలంటూ అడ్మిన్ల ద్వారా చెప్పించడం, వారు రంగనాథ్ మద్దతుగా స్టేటస్లు పెట్టడం అంతా చకచకా జరుగుతున్నది. ఇదే సమయంలో పలు సంస్థలు, కాలనీ అసోసియేషన్ల వారిని కొందరు హైడ్రా సిబ్బంది ద్వారా ప్రభావితం చేసి మద్దతు ర్యాలీలు చేయాలంటూ పురమాయించి వారి ద్వారా వరుసగా ర్యాలీలు చేయిస్తూ హైడ్రా రంగనాథ్ కావాలంటూ నినాదాలు ఇప్పిస్తున్నారు. ఇరవై రోజుల్లో వరుసగా జరుగుతున్న పరిణామాలను చూస్తే రంగనాథ్ తనను తాను కాపాడుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలుగా చెప్పాలి.
హైడ్రాను రాష్ట్రవ్యాప్తం చేయాలంటూ పలు జిల్లాల నుంచి కొందరు ప్రతినిధులు వచ్చి రంగనాథ్‌ను కలిసినట్టుగా బుధవారం హైడ్రా ఒక ప్రకటన విడుదల చేసింది. సహజంగా అధికారిని కలిసిన తర్వాత ఆయా అసోసియేషన్లు తమంతట తాముగా పత్రికలకు సమాచారం ఇవ్వడం ఆనవాయితీ, కానీ ఒక సంస్థ ప్రతినిధులు వివిధ జిల్లాల నుంచి వచ్చి రంగనాథ్‌కు మద్దతు తెలిపారంటూ హైడ్రా తన అధికారిక సోషల్ మీడియాలో ప్రకటన విడుదల చేసింది. ఇటీవల హైడ్రాకు జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో స్పీక్ అనే సంస్థ ప్రతినిధులు రంగనాథ్‌ను కలిసినట్టు హైడ్రా మీడియాకు సమాచారమిచ్చింది.
ఈ ప్రకటనలో తప్పుడు సమాచారంతో కోర్టులను, ఇతర ప్రభుత్వ శాఖలను తప్పదోవపట్టిస్తున్న వారిపై అన్ని విభాగాలు అప్రమత్తంగా ఉండాలని సంస్థ ప్రతినిధులు కోరినట్టు తెలిపారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో హైడ్రా తరహా వ్యవస్థ అందుబాటులోకి రావాలని కోరడం, హైడ్రా రంగనాథ్‌కు మద్దతు ప్రకటిస్తున్నట్టు పేర్కొన్నారు. రెండు రోజుల క్రితం కొన్ని కాలనీలు గచ్చిబౌలి, ముస్కి చెరువు తదితర ప్రాంతాల్లో రంగనాథ్‌కు మద్దతుగా ర్యాలీలు చేశారు. దీనికి సంబంధించి ర్యూట్మ్యాప్ను కూడా హైడ్రా సోషల్‌మీడియాలో ప్రకటించడం గమనార్హం. ఇదంతా హైడ్రా అధికారులు, సిబ్బంది ప్రభావితం చేసి వారి ద్వారా రంగనాథ్‌కు ఇంత పెద్ద మద్దతు ఉన్నదంటూ చెప్పే ప్రయత్నంగా కొందరు హైడ్రా బాధితులు చెప్పారు.
గతంలో ఎన్నడూ లేనంతగా రంగనాథ్ పలు మీడియా సంస్థలకు ప్రాయోజిత ఇంటర్వ్యూలు ఇస్తూ అందులో కోర్టు ధిక్కరణ కేసులు, వాటికి సంబంధించిన అంశాలపై ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు. కోర్టులో ఒక అంశం విచారణ జరుగుతున్నప్పుడు కానీ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసినప్పుడు కానీ వాటిపై ఎలాంటి కామెంట్ చేయకూడదని, కానీ రంగనాథ్ ఆ ఇంటర్వ్యూల్లో చాలా అంశాలు కోర్టులను ఉద్దేశించి, కేసులు వేసిన వారిని ఉద్దేశించి మాట్లాడుతున్నారంటూ పలువురు కంటెంప్ట్ కేసులు వేసిన వారు చెబుతున్నారు.
రంగనాథ్ తనకు మద్దతు ఉందని ప్రకటించుకోవడం కోసం ర్యాలీలు, తనను తాను కాపాడుకోవడం కోసం ఇంటర్వ్యూలు ఇవ్వడం ఒకవైపు అయితే ఒడిశాలో వచ్చిన కోర్టు తీర్పుకు సంబంధించిన పేపర్ స్టేట్మెంట్లు పీఆర్వో ద్వారా పెట్టిస్తూ తాను చేసింది కూడా కరెక్టేనని ప్రకటించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. అంతేకాకుండా తాను ఇచ్చిన ఇంటర్వ్యూలకు సంబంధించిన వీడియోలను నగరంలో యాక్టివ్‌గా ఉన్న కొన్ని వాట్సాప్ గ్రూపుల్లో వేరేవారిచేత పెట్టించి అందరికీ షేర్ చేయమంటూ విన్నపాలు చేస్తున్నారు. ఒకటికాదు రెండు కాదు రకరకాల ప్రయత్నాలతో రంగనాథ్ తనను తాను కాపాడుకొనే ప్రయత్నం చేస్తున్నారు.