మహబూబ్‌నగర్/నారాయణపేట/నీలగిరి/సూర్యాపేటటౌన్, జనవరి 20 : బీఆర్ఎస్ గద్దెలను కూల్చాలని ఈ నెల 18న ఖమ్మంలో స్వయాన సీఎం రేవంత్‌రెడ్డి పిలుపునివ్వడంపై బీఆర్ఎస్ నేతలు భగ్గుమంటున్నారు. ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినందుకు ఆయనపై కేసు నమోదుచేయాలని ఆయా జిల్లాల్లో బీఆర్ఎస్ నేతలు ఎస్పీలకు ఫిర్యాదు చేశారు. మంగళవారం నారాయణపేట ఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ లింగయ్యకు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి ఫిర్యాదు చేశారు.
మహబూబ్‌నగర్‌లో అదనపు ఎస్పీ ఎన్బీ రత్నంకు గ్రంథాలయాల సంస్థ మాజీ చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్, జడ్పీ మాజీ వైస్ చైర్మన్ యాదయ్యతోపాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు ఫిర్యాదు అందజేశారు. సీఎం రేవంత్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్‌రెడ్డి, నోముల భగత్‌కుమార్, ఎన్ భాస్కర్‌రావు, జడ్పీ మాజీ చైర్మన్ బండా నరేందర్‌రెడ్డి తదితరులు నల్లగొండలో ఎస్పీ శరత్చంద్ర పవార్‌ను కలిసి విన్నవించారు. కాగా సూర్యాపేటలో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై వెంకటేశ్వర్లు, నిమ్మల శ్రీనివాస్‌గౌడ్ తదితరులు ఎస్పీ నర్సింహకు ఫిర్యాదు చేశారు.