కొనేదాకా కొట్లాడుడే..! రైతన్న గోస.. దక్కని భరోసా
రాష్ట్రవ్యాప్తంగా అన్నదాతలు అరిగోస పడుతున్నారు. పంటల కొనుగోలులో సర్కార్ నిర్లక్ష్యం కారణంగా పెద్ద సంఖ్యలో రైతులు సోమవారం రోడ్డెక్కి నిరసన వ్యక్తంచేశారు. రెండున్నరేండ్లుగా తమ కన్నీటి గోసను పట్టించుకున్న నాథుడే లేడని ఆవేదన వ్యక్తంచేశారు. వెంటనే ధాన్యం కొనాలని డిమాండ్ చేశారు.
- పంటల కొనుగోలులో జాప్యంపై బీఆర్ఎస్ ఆగ్రహం
- సర్కార్ తీరుపై సమరశంఖం.. దద్దరిల్లిన మార్కెట్లు
- వడ్లు, మక్క, జొన్న కొనుగోళ్లు లేక రైతు గోస
- అన్నదాతకు అండగా బీఆర్ఎస్ నాయకులు
- కొనుగోలు కేంద్రాల్లో పర్యటించిన బృందాలు
- క్షేత్రస్థాయి పరిస్థితుల్ని పరిశీలించిన నేతలు
- రైతుగోడు విన్న నాయకులు.. సర్కార్‌పై ఫైర్
- ముందుకు సాగని కొనుగోళ్లపై రైతుల కన్నెర్ర
- పలుచోట్ల అన్నదాతలతో కలిసి ఆందోళన
పంటల కొనుగోలులో జాప్యం, ప్రభుత్వం నిర్లక్ష్యం ఫలితంగా కాంటా కోసం నిరీక్షణలోనే రైతులు ప్రాణాలు కోల్పోతున్న నేపథ్యంలో.. సర్కార్ మెడలు వంచేందుకు బీఆర్ఎస్ సిద్ధమైంది. సోమవారం గులాబీ నేతలు కొనుగోలు కేంద్రాలకు తరలారు. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, నేతలు ఇందులో ఉన్నారు. రైతుల అవస్థలను ప్రత్యక్షంగా చూశారు. అధికారులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆరో తేదీలోగా పంట కొనుగోళ్లు చేపట్టకపోతే ఆందోళనలతో ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తామని హెచ్చరించారు.
రాష్ట్రవ్యాప్తంగా అన్నదాతలు అరిగోస పడుతున్నారు. పంటల కొనుగోలులో సర్కార్ నిర్లక్ష్యం కారణంగా పెద్ద సంఖ్యలో రైతులు సోమవారం రోడ్డెక్కి నిరసన వ్యక్తంచేశారు. రెండున్నరేండ్లుగా తమ కన్నీటి గోసను పట్టించుకున్న నాథుడే లేడని ఆవేదన వ్యక్తంచేశారు. వెంటనే ధాన్యం కొనాలని డిమాండ్ చేశారు. రోజుల తరబడి ధాన్యం కుప్పల వద్ద కాపుకాసి అలసి రైతులు కుప్పకూలుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఎన్నికల ముందు రైతులకు ఏదో చేస్తామని గొప్పలు చెప్పిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు కన్నెత్తి చూడటం లేదని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. రోడ్డుపై బైఠాయించి సర్కార్‌కు వ్యతిరేకంగా నినదిస్తున్నారు.
రైతుకు అండగా.. గులాబీ దండు
వరంగల్ ఎనుమాముల మార్కెట్లో బీఆర్ఎస్ బృందం పర్యటించింది. పంట కొనుగోళ్లలో రైతులకు ఎదురవుతున్న సమస్యలను తెలుసుకొంటున్న మాజీమంత్రి ఎర్రబెల్లి, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు అరూరి, చల్లా ధర్మారెడ్డి, పెద్ది సుదర్శన్‌రెడ్డి, నన్నపునేని తదితరులు
సంగారెడ్డి జిల్లా సదాశివపేటలోని శనగల కొనుగోలు కేంద్రంలో సోమవారం రైతులతో మాట్లాడుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

జాప్యంపై కన్నెర్ర

ధాన్యం కొనుగోలులో జాప్యాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతులు నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్‌లో సోమవారం రాస్తారోకో చేపట్టారు. కాంగ్రెస్ పాలనలో పంటలను అమ్ముకోవడానికి రైతులు అరిగోస పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రతి గింజనూ కొనేవరకు బీఆర్ఎస్ వారికి అండగా ఉండి పోరాటం కొనసాగిస్తుందని భరోసా ఇచ్చారు. – భీమ్‌గల్
ఆంక్షలపై అన్నదాత ఆగ్రహం

యాసంగి ధాన్యాన్ని ఆంక్షలు లేకుండా కొనుగోలు చేయాలని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్‌రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం పూడూర్లో జగిత్యాల -కరీంనగర్ ప్రధాన రహదారిపై 24 గ్రామాలకు చెందిన 500 మంది రైతులతో కలిసి భారీ రాస్తారోకో నిర్వహించారు. చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మాట్లాడుతూ రైతులకు వ్యతిరేకంగా రేవంత్ పాలన నడుస్తున్నదని దుయ్యబట్టారు. ధర్నా చేస్తున్న వారిపై జగిత్యాల రూరల్ సీఐ ప్రవర్తన వివాదాస్పదమైంది. -కొడిమ్యాల
నిర్లక్ష్యం మీది.. ఆవేదన మాది..

మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం రామన్నగూడెం వద్ద రోడ్డుపై రైతులతో కలిసి మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ బైఠాయించారు. ధాన్యం, మక్కలు కొనుగోలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి మండిపడ్డారు. ముందస్తు ప్రణాళిక లేకపోవడంతో రైతులు అరిగోస పడుతున్నారని పేర్కొన్నారు. -నెల్లికుదురు
కొనుగోలులో విఫలం.. అయినా వదలం

ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య విమర్శించారు. సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేటలో రైతులు, బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఆయన తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా చిరుమర్తి మాట్లాడుతూ.. సర్కార్ ధాన్యం కొనుగోలు చేపట్టేవరకూ వదిలేది లేదని స్పష్టం చేశారు.- రామన్నపేట
తరుగు దోపిడీ.. రైతు తిరగబడి..

ధాన్యం కొనుగోలులో ప్రభుత్వ నిర్లక్ష్యం, మిల్లర్ల దోపిడీపై రైతులు భగ్గుమన్నారు. సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం మల్లుపల్లి, దమ్మన్నపేట, నాగంపేట గ్రామాల రైతులు గంభీరావుపేట శివారులో కరీంనగర్-కామారెడ్డి రోడ్డుపై ధర్నా చేశారు. కోనరావుపేట మండలం సుద్దాల గ్రామంలోనూ రైతులు రోడ్డెక్కి ధర్నా చేశారు. -గంభీరావుపేట/కోనరావుపేట
అధికార పార్టీ సర్పంచ్.. సర్కార్ నిర్లక్ష్యంపై పంచ్

ధాన్యం కొనుగోలు చేపట్టాలని సోమవారం వనపర్తి జిల్లా ఆత్మకూర్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట జూరాల గ్రామానికి చెందిన రైతులు అధికార పార్టీకి చెందిన సర్పంచ్ చిన్ననర్సింహులుతో కలిసి ఆందోళనకు దిగారు. ధాన్యం కోనుగోలు చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని ఎండగట్టారు. అధికారుల హామీతో ఆందోళన విరమించారు. -అమరచింత
కొనుగోలు నిల్.. కష్టాలు ఫుల్

ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం ధర్మారం(బి) గ్రామంలో నిజామాబాద్-డిచ్పల్లి ప్రధాన రహదారిపై రైతులు సోమవారం బైఠాయించారు. ప్రభుత్వం ఇప్పటివరకు కొనుగోళ్లు ప్రారంభించలేదని మండిపడ్డారు. వాహనాలు నిలిచిపోవడంతో అధికారులు వచ్చి నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు.– డిచ్పల్లి
తరుగు తీయద్దు.. పొట్ట కొట్టొద్దు

రైస్ మిల్లర్ల దోపిడీని నిరసిస్తూ కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్‌లో రైతులు రాస్తారోకో నిర్వహించారు. బోధన్-బాన్సువాడ ప్రధాన రహదారిపై బైఠాయించారు. మిల్లర్లకు, సహకార సిబ్బందికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తరుగు తీసి తమ పొట్ట కొట్టొద్దని ఆవేదన వ్యక్తం చేశారు. తహసీల్దార్ సువర్ణ వచ్చి సముదాయించడంతో ఆందోళన విరమించారు. -నస్రుల్లాబాద్
ఆరు కిలోల కోతపై కలెక్టర్‌కు ఫిర్యాదు

కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు మిల్లర్లతో కుమ్మక్కై క్వింటాల్‌కు ఆరు కిలోల చొ ప్పున కోత పెడుతున్నారని కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం బొమ్మకల్ కు చెందిన రైతు ఎడబోయిన రాములు సోమవారం ‘ప్రజావాణి’లో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ధాన్యం కేంద్రాలకు తెచ్చి రోజులు గడుస్తున్నా కొనుగోలు మాత్రం చేయడం లేదని పేర్కొన్నారు. అకాలవర్షాలతో ధాన్యం తడుస్తున్నా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. స్పందించిన కలెక్టర్ సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. వెంటనే ధాన్యం తరలించేందుకు చర్యలు తీసుకువాలని ఆదేశించినట్టు సమాచారం.
కొంటరా.. కొనరా?

సిద్దిపేట జిల్లా రాఘవాపూర్, పెద్దలింగారెడ్డిపల్లి గ్రామాల రైతులు సోమవారం రా ఘవాపూర్ వద్ద సిద్దిపేట – ముస్తాబాద్ రహదారిపై ట్రాక్టర్లను అడ్డుపెట్టి రాస్తారో కో చేపట్టారు. ప్రభుత్వం, కలెక్టర్ దిష్టిబొమ్మను దహ నం చేశారు. -సిద్దిపేట
నిలదీతల పర్వం

సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దెడ రైతు వేదికలో రైతు కమిషన్ వైస్ చైర్పర్సన్ భవానిని రైతులు నిలదీశారు. పండించిన పంటలను సరిగ్గా కొనుగోలు చేయకపోగా.. పంట మార్పిడిల గురించి చెప్పడం ఎందుకని రైతులు ప్రశ్నించారు. ఈ క్రమంలో పోలీసులు అడ్డుకోవడంతో రైతులు మండిపడ్డారు. -కొండపాక
మండుటెండలో రహదారిపై బైఠాయించి..

మహబూబ్‌నగర్ జిల్లా మహ్మదాబాద్‌లో తాండూరు-మహబూబ్‌నగర్ రోడ్డుపై రైతులు బైఠాయించారు. ధాన్యం బస్తాలను రోడ్డుపై అడ్డంగా వేసి ఖాళీ బస్తాలకు నిప్పంటించి నిరసన తెలిపారు. రైతుల ఆందోళనకు బీఆర్ఎస్తోపాటు వివిధ పార్టీల నాయకులు మద్దతు తెలిపారు. -మహ్మదాబాద్
ఉన్నది 20.. తరలించింది ఒక్కటే..

దొడ్డు రకం ధాన్యం కొనుగోలు చేయాలని లక్కంపల్లి రైతులు నిజామాబాద్ జిల్లా నందిపేట్‌లో సోమవారం రాస్తారోకో చేపట్టారు. గ్రామంలో 20 లారీలకు పైగా ధాన్యం ఉన్నదని, ఇప్పటివరకు ఒక్క లారీ మాత్రమే రైస్‌మిల్‌కు తరలించారని మండిపడ్డారు. -నందిపేట్
దొడ్డు వడ్లు కొంటలే..

నిజామాబాద్ జిల్లా మోర్తాడ్‌లో రైతులు జాతీయ రహదారిపై బైఠాయించారు. పంట కోసి నెల దాటినా దొడ్డు వడ్లు కొనుగోలు చేయడం లేదని, క్వింటాల్‌కు పది కిలోల కడ్తా అడుగుతున్నారని ఆగ్రహించిన రైతులు రోడ్డెక్కారు. -మోర్తాడ్
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CM Vijay | ప్రజలకు తాగునీటి కోసం ఏపీలో తమిళనాడు సీఎం.. అధిష్టానం మెప్పుకోసం ఢిల్లీలో రేవంత్..!
KU | కేయూ బయోటెక్నాలజీ విభాగాధిపతిగా శ్రీనివాస్..!
Nalgonda | గ్రామసభల్లోనే ‘ఇందిరమ్మ’ లబ్ధిదారుల ఎంపిక జరగాలి.. కలెక్టర్‌కు సర్పంచుల సంఘం జేఏసీ వినతి..!
Weight Loss | బరువు తగ్గాలంటే నీరే తాగాలా? డైట్ సాఫ్ట్ డ్రింక్స్తోనూ ఫలితం.. అధ్యయనంలో వెల్లడి..
RS Praveen kumar | ‘మీరే మీ మేనమామపై కేసు పెట్టాలి’.. కాంగ్రెస్ ఎమ్మెల్యే మేఘా రెడ్డికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సూచన..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

