మహబూబ్‌నగర్, సెప్టెంబర్ 21 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఉమ్మడి పాలమూరు జిల్లాలో సాగునీటి కోసం రైతులు సాగిస్తున్న పోరాటానికి బీఆర్ఎస్ వెన్నుదన్నుగా నిలిచింది. వారం, పదిరోజుల నుంచి గద్వాల, వనపర్తి, నారాయణపేట జిల్లాల్లో సాగునీటి కోసం ఆందోళన తీవ్రస్థాయికి చేరుకున్నది. నీటి విడుదల చేసే విషయంలో ఇరిగేషన్ శాఖ అధికారులతో మాట్లాడి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి చేపట్టిన కార్యక్రమం ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. సోమవారం జూ రాల ప్రాజెక్టుపై ధర్నాకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఉమ్మడి జిల్లా పోలీసు యంత్రాంగం ఎక్కడికక్కడే బీఆర్ఎస్ నేతలను అదుపులో తీసుకొని పోలీస్ స్టేషన్లకు తరలించడం మొదలుపెట్టారు.
తెల్లవారుజామునే ఆయా మండలాల్లో పోలీసులు ముందస్తుగా పార్టీ నాయకుల ఇండ్లకు చేరుకొని వారిని బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. జూరాల ప్రాజెక్టుపై ఎలాంటి ఆందోళన జరుగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. అటు గద్వాల నుంచి, ఇటు ఆత్మకూరు నుంచి జూరాల వైపు వెళ్లే అన్ని ఎంట్రీ పాయింట్లను పోలీసులు మూసివేశారు. వనపర్తి జిల్లా పోలీసు యంత్రాంగం సుమారు 200 మందితో భద్రతా చర్యలు చేపట్టారు.
అయినప్పటికీ బీఆర్ఎస్ నేతల పిలుపుతో రైతులు పెద్ద ఎత్తున జూరాల ప్రాజెక్టు సమీపానికి చేరుకున్నారు. మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి పోలీసుల కండ్లుకప్పి జూరాల వద్దకు వెళ్లారు. దీంతో అప్పటివరకు పదుల సంఖ్యలో ఉన్న రైతులు ఒక్కసారిగా వందల సంఖ్యలోకి చేరిపోయారు. చిట్టెం అరెస్టును నిరసిస్తూ రైతులు పోలీస్ కాన్వాయ్ ముందు అడ్డంగా పడుకొని నిరసన తెలిపారు. చిట్టెంను కొత్తకోట ఠాణాకు తరలించారు. తెల్లవారుజాము నుంచి నిర్బంధకాండను మొదలుపెట్టారు. పార్టీ నాయకులను ఎక్కడికక్కడే అరెస్టు చేసి సమీప పోలీస్ స్టేషన్లకు తరలించడం మొదలుపెట్టారు.

మాజీ మంత్రుల గృహనిర్బంధం..
ఆందోళనకు పిలుపునిచ్చిన మాజీ మంత్రు ల నివాసాలపై పోలీసులు నిఘాపెట్టి ఎక్కడికక్కడే గృహనిర్బంధంలో ఉంచారు. మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి తన వ్యవసాయ క్షేత్రం లో ఉండగా ఆయన్ను బందోబస్తుతో వనపర్తిలోని నివాసానికి తీసుకొచ్చి గృహనిర్బంధం లో ఉంచారు. మరోవైపు మాజీ మంత్రి లక్ష్మారెడ్డి మొబైల్ ఫోన్ ట్రాక్ చేసి అక్కడికి వెళ్లి అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున లక్ష్మారెడ్డి ఇంటికి చేరుకొని పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇక హైదరాబాద్‌లో ఉన్న మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఇంటి కి ఇంటెలిజెన్స్ పోలీసులు వెళ్లి గృహ నిర్బంధంలో ఉంచారు. దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి బయటికి రాకుండా ఆయన ఇంటి చుట్టూ పహారా కాశారు.
కేటీఆర్ అనుమానమే నిజమైంది..
ఈ నెల 19న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో పర్యటించి జూరాల ప్రాజెక్టు పరిస్థితిపై ప్రభుత్వానికి తీవ్రస్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు. ప్రాజెక్టు ఆయకట్టు ఎకరా ఎండినా ప్రభుత్వాన్ని వదిలిపెట్టబోమని హెచ్చరించిన 48 గంటల్లోనే పరిస్థితి తారుమారైంది. అనుకున్నట్టే సాగునీరు ఇవ్వకుండా వేలాది ఎకరాల పంటలను ఎండబెట్టే స్థాయికి సర్కార్ పూనుకున్నది.జూరాల కింద పంటలు ఎండిపోతుంటే జిల్లాకు చెందిన మంత్రి సాగునీళ్లు విడుదల చేయకుండా తాగునీటికి వినియోగిస్తామని చెప్పడం ఆయన అజ్ఞానానికి నిదర్శనమని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రైతుల పక్షాన నిలబడ్డ బీఆర్ఎస్ నేతలను అక్రమంగా అరెస్ట్ చేసి నిర్బంధించడాన్ని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తీవ్రంగా ఖండించారు. పాలమూరు బిడ్డనని చెప్పుకొనే రేవంత్‌రెడ్డి ఈ ప్రాంత రైతులకు ద్రోహం చేస్తున్నారని మండిపడ్డారు.