హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి (CM Revanth Reddy) హనుమకొండ జిల్లలో పర్యటించనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ఆర్ట్స్ కాలేజీ మైదానంలో ఏర్పాటుచేసిన సభకు ఆయన హాజరుకానున్నారు. అలాగే కాళోజీ కళాక్షేత్రం సహా పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో నగరంలో భద్రతను కట్టుదిట్టం చేశారు.భద్రత ఏర్పాటు చేశారు. లగచర్ల సంఘటనతో ముందస్తు చర్యల్లో భాగంగా భారీగా పోలీసులను మోహరించారు. హనుమకొండ బాలసముద్రం కాళోజీ కళాక్షేత్రం, సుబేదారి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానం సభా ప్రాంగణం, సీఎం కాన్వాయ్ ప్రయాణించే రూట్లలో పెద్ద ఎత్తున బలగాలను మోహరించారు.
రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకులను అక్రమంగా అరెస్టు చేస్తున్నారు. అర్ధరాత్రి నుంచే నాయకులు, కార్యకర్తలను ఎక్కడికక్కడ నిర్బంధిస్తున్నారు. గిరిజన నేతలు, విద్యార్థులను అదుపులోకి తీసుకుంటున్నారు. కాగా, బీఆర్ఎస్ నాయకుల అరెస్టులను మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఇది ప్రజాపాలన కాదని, ఇందిరమ్మ ఎమర్జెన్సీ పాలన అని దుయ్యబట్టారు. ఉద్యమాల గడ్డ వరంగల్ నుంచి ముఖ్యమంత్రి పతనం ప్రారంభమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. హామీలు నెరవేర్చుకుండా విజయోత్సవ సభలు నిర్వహించడం హాస్యాస్పదమన్నారు. రైతులను మోసం చేసినందుకు విజయోత్సవాలు చేస్తున్నారా అని ప్రశ్నించారు. ఒక్క ఇల్లు ఇవ్వకుండా ఉన్న ఇండ్లు కూలగొట్టినందుకు సంబురాలా అని నిలదీశారు. హామీలు అమలు చేస్తామని మాట తప్పిన సీఎం ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.