BC Reservations | హైదరాబాద్ : బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాల్సిందేనని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ మధుసూదనాచారి డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్లో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌తో కలిసి ఎమ్మెల్సీ మధుసూదనాచారి మీడియాతో మాట్లాడారు.
కాంగ్రెస్ పార్టీ బీసీల పట్ల విశ్వాస ఘాతుకానికి పాల్పడుతోంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుకు స్పష్టమైన అవకాశాలు ఉన్నా వాటిని కాంగ్రెస్ ప్రభుత్వం నీరు గారుస్తుంది. దేశంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కుల గణన చేపట్టిన దాఖలాలు లేవు. కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయకుండా కాంగ్రెస్ మోసం చేస్తుంది. కేసీఆర్ ఆదేశాలతో తమిళనాడులో బీసీ చట్ట బద్ధత ఎలా కల్పించారో అక్కడ పర్యటించి తెలుసుకున్నాం. ఆ విషయాలు ఈ ప్రభుత్వానికి చెప్పినా పెడ చెవిన పెట్టింది. బీసీ బిల్లు పెట్టాక సీఎం రేవంత్ రెడ్డి డిల్లీకి అనేక సార్లు పోయినా దీనిపై మాట్లాడలేదు. రాహుల్ గాంధీ దీనిపై ఎందుకు స్పందించడం లేదు. మా మనసు గాయపడితే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయి. 42 శాతం రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలని ఎమ్మెల్సీ మధుసూదనాచారి డిమాండ్ చేశారు.
అనంతరం మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. బీసీ రిజర్వేషన్లను 9వ షెడ్యూల్లో చేర్చి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం. మీరు జీవో ఇవ్వకుండానే కొందరు కోర్టుని ఆశ్రయించారు. ఇప్పుడూ ప్రభుత్వం ఏం చేస్తుంది. కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ లేదు.. రాష్ట్రంలో బీసీలకు మంత్రి పదవులు కేటాయించలేదు. కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడంలో రేవంత్ ప్రభుత్వం విఫలం… బీజేపీ ఎంపీలు నోరు విప్పరు. కేవలం కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ బీసీల తరపున పోరాడుతుందని శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు.
అనంతరం మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. 42శాతం జీవో ద్వారా ఎన్నికలు నిర్వహిస్తాం అంటున్నారు. మరి 22 నెలలల్లో జీవో ఎందుకు ఇవ్వలేదు. దేశంలో బీసీ రిజర్వేషన్ల సాధించిన రాష్ట్రం తమిళనాడు. మిగతా రాష్ట్రాలు ఎందుకు విఫలం అయ్యాయో అసెంబ్లీలో మేము వివరించాము. మీరు జీవో ఇవ్వకుండానే కొందరు కోర్టుకు వెళ్లడం కాంగ్రెస్ కుట్రనే. అఖిల పక్షాన్ని ప్రధాని వద్దకు తీసుకెళ్లి తేల్చుకోవాలి. బీసీ రిజర్వేషన్ల సాధించే వరకు ఢిల్లీ వదిలేది లేదు అని పోరాడాలి. రేవంత్ సర్కార్ బీసీ రిజర్వేషన్లు అనే పులిపై స్వారీ చేస్తున్నారని చెప్పాం. మాట తప్పితే తీవ్ర పరిణామాలు తప్పవు అని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ హెచ్చరించారు.