హైదరాబాద్ కలెక్టర్ హరిచందన, సివిల్ సప్లైస్ కమిషనర్ డీఎస్ చౌహాన్ రేషన్ కార్డుల విషయంలో తప్పుడు ప్రకటనలు చేసి ప్రజలను తప్పుదారి పట్టించారని బీఆర్ఎస్ పార్టీ ఆరోపించింది. వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఈ మేరకుప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణకు ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, బీఆర్ఎస్ నాయకుడు ఆనంద్ గౌడ్ ఫిర్యాదు చేశారు.
ఇటీవల హైదరాబాద్ బంజారాహిల్స్లో నిర్వహించిన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో హరిచందన, డీఎస్ చౌహాన్ పాల్గొన్నారని.. ఈ సందర్భంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేశారని వారు ఆ లేఖలో పేర్కొన్నారు. ‘గత పదేళ్లలో కొత్త రేషన్ కార్డుల ఇచ్చిన దాఖలాలు లేవు. చాలామంది దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఒక్కటి కూడా ఇవ్వలేదు’ అని డీఎస్ చౌహాన్ అన్నారని తెలిపారు. అలాగే ‘గత 12 ఏళ్ల కింద నేను సబ్ కలెక్టర్గా ఉన్నప్పుడు రేషన్ కార్డులు ఇచ్చాం. మళ్లీ ఇప్పుడే ఇస్తున్నాం’ అని హరిచందన వ్యాఖ్యానించారని పేర్కొన్నారు. ఇవన్నీ తప్పుడు ఆరోపణలేనని.. బీఆర్ఎస్ ప్రభుత్వం నిబంధనల ప్రకారం 6.47 లక్షల రేషన్ కార్డులను ఇచ్చిందని ఆ లేఖలో వివరించారు. అధికారులు ప్రజాప్రతినిధుల మెప్పు కోసం తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. ఇది ప్రజాస్వామ్యానికి హానికరమని అన్నారు.
తప్పుడు ప్రచారం చేస్తున్న సదరు అధికారులపై వెంటనే క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నాయకులు విజ్ఞప్తి చేశారు. అధికారుల పనితీరును డీపీవోటీకి నివేదించాలని కోరారు. సదరు అధికారులు బహిరంగ క్షమాపణతో పాటు వాస్తవాలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు.
Brs Complaint1
Brs Complaint2
Brs Complaint3