Assembly Media point : బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సాధకుడు అయిన కేసీఆర్ గురించి రేవంత్ రెడ్డి పరుష వ్యాఖ్యలు చేశాడని, ఆయనను మార్చురీకి పంపిస్తానని అహంకారంతో మాట్లాడాడని బీఆర్ఎస్ విమర్శించింది. మాజీ మంత్రి గంగుల కమలాకర్, మాజీ విప్ కేపీ వివేకానంద, ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి, మాణిక్ రావు, అనిల్ జాదవ్ అసెంబ్లీ మీడియా పాయింట్లో మాట్లాడారు. గంగుల మాట్లాడుతూ.. తాను 2009 నుంచి అసెంబ్లీలో ఉన్నానని, వైఎస్ఆర్, రోశయ్య, కిరణ్ కుమార్‌రెడ్డి, కేసీఆర్, చంద్రబాబు లాంటి సీఎంలను చూశానని, కానీ రేవంత్ రెడ్డి లాంటి చేతగాని సీఎంను ఎప్పుడూ చూడలేదని అన్నారు.
కేసీఆర్‌ను రేవంత్ రెడ్డి కేవలం మాజీ ముఖ్యమంత్రిగా చూస్తున్నడని, కానీ తాము తెలంగాణ తెచ్చిన గొప్ప వ్యక్తిగా చూస్తున్నామని గంగుల అన్నారు. కేసీఆర్ చావాలని కోరుకుంటావా..? అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి తనకు తాను తెలంగాణ సీఎంనే అని అనుకుంటే.. పితృ సమానులైన కేసీఆర్‌కు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తండ్రి లాంటి కేసీఆర్ చావును ఎవరూ కోరుకోరని, తెలంగాణ సమాజానికి కూడా రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని అన్నారు.
గత 15 నెలలుగా రేవంత్ రెడ్డి మాట్లాడిన భాష అభ్యంతరకరంగా ఉందని, ఆయన కేసీఆర్‌ను కేసీఆర్ కుటుంబాన్ని ఎలా తిట్టాలని చూస్తున్నడని, ఇలాంటి భాష మాట్లాడితే ఊరుకునేది లేదని సుధీర్‌రెడ్డి హెచ్చరించారు. రేవంత్ రెడ్డి పండబెట్టి తొక్కుతానని, లాగులో తొండలు విడుస్తానని గతంలో మాట్లాడారని, ఇప్పుడేమో కేసీఆర్‌ను మార్చురీకి పంపిస్తా అంటున్నాడని, ఇది ముఖ్యమంత్రి మాట్లాడే భాషేనా..? అని ప్రశ్నించారు. కచ్చితంగా రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
రేవంత్ రెడ్డి తన అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి అసభ్యంగా మాట్లాడుతున్నారని కేపీ వివేకానంద అన్నారు. రేవంత్ రెడ్డి మానసిక స్థితి బాగోలేదని, ఆయనను కాంగ్రెస్ అధిష్టానం పట్టించుకోవడం లేదని, ఆయన ఆరుగురు మంత్రులను నియమించుకోలేని స్థితిలో ఉన్నారని విమర్శించారు. రేవంత్ రెడ్డికి ఏం
చేయాలో అర్థం కాక కేసీఆర్ కుటుంబాన్ని తిడుతున్నారని అన్నారు. గవర్నర్‌తో అబద్దాలు చెప్పించారని అన్నారు. రేవంత్ రెడ్డి దేవుళ్లపై ఒట్లు పెట్టారని, బూతులు తిడుతున్నారని విమర్శించారు.
కాళేశ్వరం అనే పవిత్రమైన పేరును సీఎం రేవంత్ రెడ్డి కూలేశ్వరం అంటున్నారని, ఆయన అధికార మదంతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి హామీలు ఎగ్గొట్టడంలో, అవినీతి చేయడంలో డైనమిజం ప్రదర్శిస్తున్నారని, అన్నారు. రేవంత్ రెడ్డి సీఎంగా ఉన్న సభలో తాము ఎమ్మెల్యేలుగా ఉన్నందుకు సిగ్గుపడుతున్నామని, తక్షణమే రేవంత్ రెడ్డి కేసీఆర్‌కు, తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.