కోరుట్ల రూరల్/కోరుట్ల, ఆగస్టు 2: బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల సవాళ్లతో కోరుట్ల నియోజకవర్గంలో రాజకీయ వాతావరణం ఒకసారిగా వేడెకింది. యూరియా పంపిణీలో కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఈ విషయంలో బహిరంగ చర్చకు రావాలని కాంగ్రెస్ నాయకులు సవాల్ విసిరారు. దీంతో జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం అయిలాపూర్‌లో గల రైతు వేదిక వద్దకు కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు భారీగా తరలిరావడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నది.
యూరియా పంపిణీపై చర్చలో పాల్గొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని బీఆర్ఎస్ నాయకులు ప్రకటించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో పోలీసులు, బీఆర్ఎస్ నాయకుల మధ్య కొద్దిసేపు తోపులాట చోటుచేసుకున్నది. అనంతరం పోలీసులు ఇరువర్గాల నాయకులకు సర్దిచెప్పి అక్కడి నుంచి పంపించివేశారు. గ్రామంలోని బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేసిన బీఆర్ఎస్ నాయకులు అక్కడి నుంచి వెనుదిరిగారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ.. రైతులు రెండు యూరియా బస్తాలకో జింక్ బస్తాను కొనాలనే నిబంధనను కాంగ్రెస్ ప్రభుత్వం విధించడం సరికాదని అన్నారు. నియోజకవర్గంలో ఎంతమంది రైతులకు యూరియా బస్తాలు ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. పీఏసీఎస్‌లో రైతులకు సరిపడా యూరియా బస్తాలు లేవని అన్నారు. ఈ విషయమై తాము బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నామని, పోలీసులను అడ్డుపెట్టుకుని తమ నాయకులను అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారని మండిపడ్డారు.
కాంగ్రెస్ నాయకుల సవాల్ స్వీకరించిన బీఆర్ఎస్ నాయకులు ప్రభుత్వ తీరును ఎండగట్టేందుకు బయలుదేరగా పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. మాదాపూర్‌లో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దారిశెట్టి రాజేశ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు కథలాపూర్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కోరుట్లకు చెందిన పలువురు నాయకులను అరెస్ట్ చేసి మూడు గంటల తరువాత వదిలిపెట్టారు. మెట్పల్లి నుంచి ఐలాపూర్‌కు బయలుదేరిన బీఆర్ఎస్ నాయకులను పట్టణంలోని వట్టివాగు వద్ద జాతీయ రహదారిపై అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు సర్కార్ తీరుపై మండిపడ్డారు. ప్రశ్నించే వారిపై ఉక్కుపాదం మోపుతుందని దుయ్యబట్టారు.