నీలగిరి, డిసెంబర్ 5 : నల్లగొండ జిల్లాకు మెడికల్ కళాశాల మంజూరు చేసి, నిధులు కేటాయించి దాదాపు నిర్మాణాన్ని పూర్తి చేసినందుకు కృతజ్ఞతగా బీఆర్ఎస్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో గురువారం చేపట్టిన కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకాన్ని పోలీసులు అడ్డుకున్నారు. బీఆర్ఎస్ నాయకులు వైద్య కళాశాలకు చేరుకోగానే పోలీసులు వచ్చి, అనుమతి లేదని నిలువరించారు. కేసీఆర్ చిత్రపటాన్ని బీఆర్ఎస్ నేతల నుంచి తీసుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పోలీసులకు బీఆర్ఎస్ నాయకులకు మధ్య తోపులాట జరిగింది. దీంతో పోలీసులు వారిని అరెస్టు చేసి సుదూర ప్రాంతాల పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ ఘటనను మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. నల్లగొండ వైద్య కళాశాలకు రూ.250 కోట్లు కేటాయించి రూ.125 కోట్లతో భవన నిర్మాణం చేపట్టారని చెప్పారు. అందుకు కృతజ్ఞతగా కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేయాలని నిర్ణయిస్తే బీఆర్ఎస్ నాయకులను ఆరెస్టు చేయడం ఏమిటని ప్రశ్నించారు.