హైదరాబాద్, నవంబర్ 20 (నమస్తేతెలంగాణ): ఫార్ములా-ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ విచారణకు గవర్నర్ అనుమతి ఇవ్వడంపై బీఆర్ఎస్ నాయకులు భగ్గుమన్నారు. అనునిత్యం ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతున్నందుకే ఆయనపై కాంగ్రెస్ సర్కారు కక్ష సాధిస్తున్నదని మండిపడ్డారు. కేంద్రంలోని బీజేపీతో చీకట్లో చేతులు కలిపి బీఆర్ఎస్పై కాంగ్రెస్ కుట్రలు చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. రెండేండ్లుగా ఈ కేసును సాగదీస్తూ పార్టీ ఆత్మస్థయిర్యాన్ని దెబ్బతీసేందుకు చిల్లర యత్నాలకు దిగుతున్నదని ధ్వజమెత్తారు. పాలన చేతగాక, సంక్షేమ పథకాలు అమలుచేయలేక ప్రశ్నించేవారి గొంతు నొక్కుతున్నదని విరుచుకుపడ్డారు. స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ను నిలువరించేందుకు మరోసారి ఈ-కార్ రేస్ కేసు పేరిట కుట్రలను తెరపైకి తెచ్చిందని నిప్పులు చెరిగారు. ఏదేమైనా కాంగ్రెస్, బీజేపీ కూడబలుక్కొని చేసే పన్నాగాన్ని దీటుగా ఎదుర్కొంటామని తేల్చిచెప్పారు. ఎన్ని ఇబ్బందులుపెట్టినా ప్రజల గొంతుకను వినిపిస్తామని, పోరాటాలను ఆపబోమని స్పష్టంచేశారు. కేటీఆర్ ప్రాసిక్యూషన్‌కు గవర్నర్ అనుమతి ఇవ్వడాన్ని పార్టీ నాయకులు ముక్తకంఠంతో ఖండించారు.
ఫార్ములా- ఈ రేస్ కేసు లో గవర్నర్ కేటీఆర్ ప్రాసిక్యూషన్‌కు అనుమతి ఇవ్వడంపై మాజీ మంత్రి హరీశ్‌రావు ఎక్స్ వేదికగా స్పందించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై ఈ అక్రమ కేసు రాజకీయ కక్ష సాధింపునకు పరాకాష్ట అని అభివర్ణించారు. సీఎం రేవంత్‌రెడ్డి.. ప్రశ్నించే వారి గొంతునొక్కడం దుర్మార్గమని ఖండించారు. కేసీఆర్ పాలనలో పూర్తి పారదర్శకంగా ఈ-రేస్ నిర్వహించామని స్పష్టంచేశారు. ఇందులో అక్రమాలు జరిగాయని కాంగ్రెస్ ప్రభుత్వం రెండేండ్లుగా కోడిగుడ్డుపై ఈకలు పీకిన చందంగా వ్యవహరిస్తున్నదని నిప్పులు చెరిగారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను పెంచిన కేటీఆర్‌పై రేవంత్‌రెడ్డి అక్రమ కేసులు బనాయించి ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నారని విమర్శించారు.
పాలనా వైఫల్యాలను అడుగడుగునా ఎండగడుతుండడాన్ని ఓర్వలేకనే తప్పుడు కేసులతో రాక్షసానందం పొందుతున్నారని తూర్పారబట్టారు. స్థానిక సంస్థల ఎన్నికల వేళ రాజకీయ లబ్ధి కోసం ఆరాటపడుతూ చిల్లర మల్లర ప్రయత్నాలు చేస్తున్నారని విరుచుకుపడ్డారు. అక్రమ కేసులు, తప్పుడు విచారణలతో బీఆర్ఎస్ శ్రేణుల మనోస్థయిర్యాన్ని దెబ్బతీయలేరని స్పష్టంచేశారు. కేటీఆర్‌కు బీఆర్ఎస్ అండగా ఉంటుందని ప్రకటించారు. అక్రమ కేసులను న్యాయపరంగా ఎదుర్కొంటామని తేల్చిచెప్పారు.
ఈ కార్ రేసు కేసులో కేటీఆర్‌పై ప్రాసిక్యూషన్‌కు అనుమతి ఇవ్వడంతో కాంగ్రెస్, బీజేపీ కుట్రలు తేటతెల్లమయ్యాయని మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి విమర్శించారు. బీఆర్ఎస్ను కట్టడి చేసేందుకు రెండు జాతీయ పార్టీలు ఒక్కటై అక్రమ కేసులు బనాయిస్తున్నాయని మండిపడ్డారు. హామీల అమలులో చేతులెత్తేసిన సీఎం రేవంత్‌రెడ్డి డైవర్షన్ గేమ్‌లో భాగంగా కేసుల నాటకానికి తెరలేపారని విరుచుకుపడ్డారు. రెండేండ్లుగా ఫార్ములా ఈ రేస్‌పై విచారణ పేరిట సాగదీస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం కొండను తవ్వి చిట్టెలుకను కూడా పట్టలేకపోయిందని ఎద్దేవాచేశారు. స్థానిక ఎన్నికల్లో అడ్డదారిలో గెలిచేందుకు చిల్లర చర్యలకు దిగుతున్నదని ధ్వజమెత్తారు. అక్ర మ కేసులకు బీఆర్ఎస్ భయపడబోదని చెప్పారు.
సీఎం రేవంత్‌రెడ్డి ప్రతీకార రాజకీయ దాడిలో భాగంగా కేటీఆర్‌పై ఈ కార్ రేస్ కేసును తెరపైకి తెచ్చాడని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌కుమార్ ధ్వజమెత్తారు. కేటీఆర్ వ్యక్తిత్వహననం చేసేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం దుర్మార్గాలకు దిగుతున్నదని ధ్వజమెత్తారు. ఫార్ములా ఈ కేసులో చట్టపరమైన స్థిరత్వం, వాస్తవ ఆధారాలు, సాక్ష్యాలు లేని పక్కా కుట్ర అని దుయ్యబట్టారు. ఇది చట్టం కాదు.. న్యాయం కాదు.. రేవంత్ రాసిన ప్రతీకార స్క్రీప్ట్ అని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రపంచం మెచ్చిన ఈవెంట్‌ను కాంగ్రెస్ సర్కారు స్కాండల్‌గా మార్చడం బాధాకరమని ఆవేదన వ్యక్తంచేశారు. పాలనా వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే కాంగ్రెస్ అక్రమ కేసును బనాయించిందని మండిపడ్డారు. ఏదేమైనా అంతిమంగా న్యాయమే గెలుస్తుందని, కోర్టులపై సంపూర్ణ విశ్వాసం ఉన్నదని స్పష్టంచేశారు.
సీఎం రేవంత్‌రెడ్డి పాలనావైఫల్యాలను కప్పిపుచ్చుకొనేందుకే ఫార్ములా ఈ పేరిట బేకార్ కేసును తెరపైకి తెచ్చారని మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ మండిపడ్డారు. లైడిటెక్టర్ టెస్ట్‌కు సిద్ధమని కేటీఆర్ చేసిన సవాల్‌కు తోకముడిచిన ముఖ్యమంత్రి ఇప్పుడు ప్రజల దృష్టిని మళ్లించేందుకు చిల్లర ప్రయత్నం చేస్తున్నారని విరుచుకుపడ్డారు. ఈ మేరకు గురువారం సీఎం రేవంత్‌రెడ్డికి లేఖ రాశారు. తెలంగాణ అంటే కేసీఆర్ అని, ఐటీ అంటే కేటీఆర్ అనే విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. స్థానిక ఎన్నికల్లో కేటీఆర్‌ను కట్టడి చేసేందుకే ఈ-రేస్ పేరిట ఇబ్బందిపెట్టాలని చూస్తున్నారని విమరిశంచా రు. జూబ్లీహిల్స్ ఎన్నికలో చావు తప్పి కన్నులొట్టబోయిన తరహాలో కాంగ్రెస్ విజయం సాధించిందని ఎద్దేవాచేశారు. లోకల్‌బాడీ ఎన్నికల్లో తప్పుడు పద్ధతిలో గెలిచేందుకు అక్రమ కేసును ఎంచుకుంటున్నారని ధ్వజమెత్తారు.
ఫార్ములా ఈ రేసుతో పాటు అనేక కంపెనీలను తెచ్చి హైదరాబాద్ కిర్తీని విశ్వవాప్తం చేసిన కేటీఆర్‌ను విచారణ పేరిట కాంగ్రెస్ సర్కారు టార్గెట్ చేస్తున్నదని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రజాపాలన అంటే కేసుల పేరిట వేధించడమేనా? అని ప్రశ్నించారు. రాష్ర్టాన్ని అభివృద్ధి దిశగా నడిపింది బీఆర్ఎస్ నాయకత్వమని, కాంగ్రెస్‌కు కనిపించేది రాజకీయ ప్రతీకారమేనని ఎద్దేవాచేశారు. ఓటుకు నోటు కేసులో బ్యాగులతో పట్టుబడ్డ రేవంత్‌రెడ్డి..ఇప్పుడు ప్రతీకారేచ్చతో తప్పుడు కేసులు బనాయిస్తున్నారని ధ్వజమెత్తారు.
కేంద్రంలో బడే భాయ్ మోదీ..రాష్ట్రంలోని చోటే భాయ్ రేవంత్‌రెడ్డి ఒక్కటై కేటీఆర్‌ను తప్పుడు కేసులో ఇరికించేందుకు కుట్ర చేస్తున్నారని కార్పొరేషన్ మాజీ చైర్మన్ వాసుదేవారెడ్డి మండిపడ్డారు. రానున్న స్థానిక ఎన్నికల్లో దొడ్డిదారిన గెలిచేందుకు కేటీఆర్‌పై ఫార్ములా ఈ కేసు పేరిట బురదజల్లుతున్నారని విమర్శించారు. ఓటుతో బుద్ధిచెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు.
లొట్టపీసు కేసుపై కాంగ్రెస్, బీజేపీ కలిసి డ్రామాలు ఆడుతున్నాయని కార్పొరేషన్ మాజీ చైర్మన్ వై సతీశ్‌రెడ్డి ధ్వజమెత్తారు. కేటీఆర్‌ను ప్రజాక్షేత్రంలో ఎదుర్కొనే దమ్ములేకే కుట్రలకు తెగబడుతున్నాయని మండిపడ్డారు. ఇప్పటికైనా కుట్రలు, కుతంత్రాలను కట్టిపెట్టి పాలనపై దృష్టిపెట్టాలని డిమాండ్ చేశారు.
నిజంగా సీఎం రేవంత్‌రెడ్డికి దమ్మూధైర్యముంటే ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి ఫార్ములా ఈ వ్యవహారంపై నిగ్గుతేల్చాలని బీఆర్ఎస్ నేత రాకేశ్‌రెడ్డి డిమాండ్ చేశారు. లోకల్‌బాడీ ఎన్నికల్లో ఓటమి భయంతోనే సీఎంకు కేటీఆర్‌పై అక్రమ కేసు గుర్తుకువచ్చిందని ఎద్దేవాచేశారు. ఈ-రేస్ కేసులో కేటీఆర్ విచారణకు గవర్నర్ అనుమతివ్వడం వెనుక బీజేపీ హస్తం ఉన్నదని బీఆర్ఎస్ సీనియర్ నేత ఏనుగు భరత్‌రెడ్డి విమర్శించారు.
ఫార్ములా ఈ తెచ్చి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను పెంచిన కేటీఆర్‌ను బద్నాం చేసేందుకే రేవంత్‌రెడ్డి తప్పుడు కేసును తెరపైకి తెచ్చారని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర దుయ్యబట్టారు. ఫార్ములా ఈ రేస్‌లో అవినీతి జరగలేదని తెలిసినా కేటీఆర్ ప్రాసిక్యూషన్‌కు అనుమతి ఇవ్వడం విడ్డూరమని మండిపడ్డారు. బీజేపీ, కాంగ్రెస్ ఏకమై బీఆర్ఎస్ గొంతు నొక్కేందుకు యత్నిస్తున్నాయని ధ్వజమెత్తారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, వచ్చే స్థానిక ఎన్నికల్లో తగిన బుద్ధిచెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. ఇప్పటికైనా విచారణల పేరిట దృష్టిమళ్లించడం పక్కనబెట్టి పాలనపై దృష్టిపెట్టాలని హితవు పలికారు. బీఆర్ఎస్కు ఎదురుదెబ్బలు, నిర్బంధాలు కొత్తకాదని, కేటీఆర్‌పై పెట్టిన తప్పుడు కేసును న్యాయస్థానాల్లోనే తేల్చుకుంటామని స్పష్టంచేశారు.
కేటీఆర్‌పై అక్రమ కేసులు పెట్టి బీఆర్ఎస్ ఆత్మస్థర్యాన్ని దెబ్బతీయలేరని మాజీ ఎంపీ వినోద్‌కుమార్ పేర్కొన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి పాలనను పక్కన బెట్టి ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ సర్కారు పాలనావైఫల్యాలను ఎండగడుతున్న కేటీఆర్‌ను నిలువరించేందుకు ఈ ఫార్ములా పేరిట తప్పుడు కేసులు బనాయించడం దుర్మార్గమని మండిపడ్డారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను పెంచిన నేతను అక్రమ కేసులతో ఇబ్బంది పెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డికి న్యాయస్థానాల్లోనే చట్టపరంగా తగిన బుద్ధిచెప్తామని హెచ్చరించారు.
హైదరాబాద్, నవంబర్ 20 (నమస్తే తెలంగాణ): ఎలాంటి అవినీతి జరగని ఫార్ములా ఈ-కార్ రేస్‌లో ఏసీబీ విచారణకు గవర్నర్ అనుమతి తెలపడంతో కాంగ్రెస్, బీజేపీ కలిసి బీఆర్ఎస్పై కుట్రలు చేస్తున్నాయనేది మరోసారి తేటతెల్లమైందని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ విమర్శించారు. ఇచ్చిన హామీలు అమలు చేయలేక ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత, ఎన్నికలు వచ్చినపుడు ఇలాంటి కేసుల అంశాన్ని తెరపైకి తెచ్చి రేవంత్‌రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని గురువారం ఒక ప్రకటనలో మండిపడ్డారు. రెండేండ్లుగా ఫార్ములా ఈ-రేస్‌పై విచారణ చేస్తూ కొండను తవ్వి ఎలుకను పట్టలేకపోయారని ఎద్దేవా చేశారు. ఇప్పుడు మళ్లీ స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు కాంగ్రెస్ కక్షపూరిత రాజకీయాలకు తెరతీసిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. విచారణ పేరిట కేటీఆర్‌ను ఇబ్బంది పెట్టాలని రేవంత్‌రెడ్డి చూస్తున్నారని నిప్పులు చెరిగారు.
హైదరాబాద్, నవంబర్ 20 (నమస్తేతెలంగాణ):రాజకీయ ప్రేరణతోనే ఈ-రేస్ కేసులో కేటీఆర్ ప్రాసిక్యూషన్‌కు అనుమతినిస్తూ గవర్నర్ నిర్ణయం తీసుకున్నారని వైరా మాజీ ఎమ్మెల్యే చంద్రావతి బానోత్ ఆక్షేపించారు. బీజేపీ, కాంగ్రెస్ కూడబలుక్కొని కేటీఆర్‌పై కక్ష సాధిస్తున్నాయని గురువారం ఒక ప్రకటనలో ధ్వజమెత్తారు. కేటీఆర్ ఈ-రేస్ పోటీలు తెచ్చి రాష్ట్ర ప్రతిష్ఠను పెంచడమే కాకుండా, పెద్దమొ త్తంలో పెట్టుబడులను రప్పించడంలో సఫలమయ్యారని గుర్తుచేశారు. కానీ కాంగ్రెస్ సర్కారు ఆయనకు అవినీతి మకిలి అంటించే ప్రయత్నం చేస్తున్నదని ఆరోపించారు. ఇప్పటికైనా సీఎం రేవంత్‌రెడ్డి చిల్లర ప్రయత్నాలను మానుకొని పాలనపై దృష్టి పెట్టాలని హితవు పలికారు.
స్థానిక ఎన్నికల్లో లబ్ధి పొందాలనే దుర్బుద్ధితోనే సీఎం రేవంత్‌రెడ్డి ఈ-రేస్ కేసును ముందుకు తెచ్చాడని బీఆర్ఎస్ నేత కురువ విజయ్‌కుమార్ ఒక ప్రకటనలో ఆరోపించారు. ఎన్నికలు వస్తున్నాయనగానే రేవంత్‌కు కేసులు గుర్తుకొస్తాయని ఎద్దేవా చేశారు. గతంలో ఓటుకు నోటు కేసులో జైలుకెళ్లిన ఆయన.. కక్షతో కేటీఆర్‌ను అక్రమ కేసుల్లో ఇరికించేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. అక్రమ కేసులు, కాంగ్రెస్ తాటాకు చప్పుళ్లకు బీఆర్ఎస్ భయపడబోదని తేల్చిచెప్పారు.
రాజకీయంగా కేటీఆర్ ఎదుగుదలను ఓర్వలేకే సీఎం రేవంత్‌రెడ్డి కక్ష సాధింపునకు కుట్రలు పన్నుతున్నారని బీఆర్ఎస్ గ్లోబల్ ఎన్ఆర్ఐ సెల్ కో ఆర్డినేటర్ మహేశ్ బిగాల ఒక ప్రకటనలో ఆరోపించారు. కాంగ్రెస్ సర్కారు తప్పుడు కేసులతో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయాలని చూస్తున్నదని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా హామీ ఇచ్చిన పథకాల అమలుపై దృష్టిపెట్టాలని హితవు పలికారు.
దేవరుప్పుల, నవంబర్ 20 : హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను ప్రపంచ స్థాయిలో నిలిపిన మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై కుట్రలకు తెరలేపి, కక్షసాధింపు చర్యలకు కాంగ్రెస్, బీజేపీ పూనుకున్నాయని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మండిపడ్డారు. ఫార్ములా ఈ- కార్ కేసులో కేటీఆర్‌పై విచారణకు గవర్నర్ అనుమతి ఇవ్వడంపై గురువారం ఆయన మాట్లాడారు.
కాంగ్రెస్, బీజేపీ గవర్నర్‌పై ఒత్తిడి తెచ్చి కేసులు పెడుతున్నాయని ఆరోపించారు. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో పూర్తి పారదర్శకంగా నిర్వహించిన ఫార్ములా ఈ- రేస్‌పై కోడిగుడ్డుపై ఈకలు పీకుతున్న చందం గా కాంగ్రెస్ సర్కారు తీరు ఉందని విమర్శించారు. జూబ్లీహిల్స్‌లో దొంగ ఓట్లు, దౌర్జ న్యం, డబ్బుల ప్రభావంతో గెలిచిన కాంగ్రెస్ పార్టీ ప్రజల మనసులను చూరగొన్న కేసీఆర్, కేటీఆర్‌పై ఎలా కక్ష సాధించాలనే మార్గాలు అన్వేశిస్తున్నారని, ఈ కేసులో కేటీఆర్‌కు క్లీన్చిట్ రావడం ఖాయమని చెప్పారు.