ఖమ్మం, జనవరి 18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఖమ్మం జిల్లాలో ఆదివారం జరిగిన సీఎం రేవంత్ పర్యటన ఆద్యంతం తమ ప్ర భుత్వం గొప్పలను వివరించడానికే సరిపోయింది. జిల్లా అభివృద్ధిని గత బీఆర్ఎస్ ప్ర భుత్వం ఏ మాత్రం పట్టించుకోలేదని, అభివృ ద్ధి అంతా తమ ప్రభుత్వ హయాంలోనే జరుగుతుందని చెప్పడం ద్వారా రేవంత్ పూర్తి రాజకీయ ప్రసంగం చేశారనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమైంది. ఖమ్మం జిల్లా మద్దులపల్లిలో కాంగ్రెస్ నిర్వహించిన బహిరంగ సభలో రేవంత్ ప్రసంగిస్తూ చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ నేతలు తప్పుబట్టారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వరప్రదాయినిగా సీతారామ ప్రాజెక్టును రూపొందించి మెజారిటీ పనులను గత బీఆర్ఎస్ ప్రభుత్వమే పూర్తిచేయడమే గాక, పాలేరు పాత కాలువను నిర్మించింది, జిల్లాలో జాతీ య రహదారుల నిర్మాణానికి అంకురార్పణ చేసింది నాటి సీఎం కేసీఆర్ అని స్పష్టంచేశా రు.
ఇలాంటివి ఎన్నో అభివృద్ధి పనులు తమ ప్రభుత్వ పాలనలోనే జరిగాయని వారు పేర్కొన్నారు. జేఎన్టీయూ ఇంజినీరింగ్, నర్సింగ్ కళాశాలలు, మద్దులపల్లి వ్యవసాయ మార్కెట్ వంటివి వాటికి కూడా బీఆర్ఎస్ సర్కార్‌లో అప్పటి మంత్రి జయ్‌కుమార్, అప్పటి పాలేరు ఎమ్మెల్యే ఉపేందర్‌రెడ్డి కృషి కారణంగా రూపుదిద్దుకున్నాయని చెప్పారు. అయినప్పటికీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని సీఎం విస్మరించడంపై మండిపడుతున్నారు. జిల్లాలో అసలు అభివృద్ధే జరగలేదన్నట్టుగా మాట్లాడం పై వారు పెదవి విరిచారు. సీతారామ ప్రాజెక్టును పూర్తిచేసేందుకు రాష్ట్ర బడ్జెట్లో తగినన్ని నిధులు కాకుండా అరకొర మాత్రమే కేటాయిస్తూ పనులన్నింటినీ కాంగ్రెస్ ప్రభుత్వం సాగదీస్తున్నదని, దీన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేసేందుకే సీఎం అబద్ధాలు వల్లె వేసేందుకు ప్రయత్నించారన్న అభిప్రాయాన్ని వారు వ్యక్తంచేశారు.