నమస్తే తెలంగాణ నెట్వర్క్, నవంబర్ 9: సీఎం రేవంత్ అనుచిత వ్యాఖ్యలపై బీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమన్నాయి. మూసీకి అడ్డొస్తే బుల్డోజర్లతో తొక్కిస్తామంటూ మాట్లాడిన తీరుపై రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకులు ఆందోళనలు చేపట్టారు. బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి సీఎం కేసీఆర్‌పై హింసాత్మక, బెదిరింపు ధోరణిలో వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిలపై పలు పోలీసు స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. జిల్లా కేంద్రాల్లో సీఎం, మంత్రుల దిష్టిబొమ్మను దహనం చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి కోమటిరెడ్డిపై చర్యలు తీసుకోవాలని మాజీ ఎంపీ బాల్క సుమన్, బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి సోయి లేకుండా చేసిన వ్యాఖ్యలను చూసి సభ్య సమాజం తలదించుకుంటున్నదని మండిపడ్డారు. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని డీసీపీ కార్యాలయంలో ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్‌పై అడ్డగోలుగా మాట్లాడిన కోమటిరెడ్డిని మంత్రివర్గం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. మూసీ పనులను అడ్డుకునే ప్రజలనే చంపేస్తారా? తొకేస్తారా? నరికేస్తారా? ఇదేనా ప్రజా పాలన? ప్రజలను చంపి రాష్ట్ర పాలన చేస్తారా?’ అని ప్రశ్నించారు.
ఖమ్మం జిల్లాలోని టూటౌన్ సీఐ బాలకృష్ణకి బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ ప్రతిష్ఠను భంగపరిచేలా వ్యాఖ్యలు చేసిన రేవంత్‌రెడ్డిపై చట్టప్రకారం కేసు నమోదు చేసి తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రాజన్నసిరిసిల్ల జిల్లాలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య ఎస్పీకి ఫిర్యాదు చేశారు. అధికారంలో ఉన్న వారు ఇలాంటి భాష మాట్లాడటంతో తెలంగాణలో శాంతి, సుస్థిరతకు తీవ్ర ముప్పు వాటిల్లుతుందని తెలిపారు. కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కాగజ్‌నగర్ పట్టణ పోలీస్‌స్టేషన్‌లో బీఆర్ఎస్ నాయకులు ఫిర్యాదు చేశారు. వనపర్తి జిల్లా కేంద్రంలో అదనపు ఎస్పీ రామదాస్ తేజావత్కు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్, జడ్చర్లలో పలువురు నాయకులు సీఐ ఆదిరెడ్డికి, జోగుళాంబ గద్వాల జిల్లా అయిజ పీఎస్‌లో బీఆర్ఎస్వీ జిల్లా కోఆర్డినేటర్ కుర్వ పల్లయ్య ఫిర్యాదు చేశారు.
నిరసన జ్వాలలు..
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి కోమటిరెడ్డిల దిష్టిబొమ్మల దహనానికి ఓయూ ఆర్ట్స్ కాలేజీలో బీఆర్ఎస్వీ నేతలు యత్నించారు. మంచిర్యాల పట్టణంలోని ఐబీ చౌరస్తాలో మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టారు కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే కోవలక్ష్మి ఆధ్వర్యంలో సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకు లు బైక్‌ర్యాలీ నిర్వహించి, సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం సుబేదారి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సూర్యాపేట జిల్లాకేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద శనివారం సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు.