హైదరాబాద్, జూలై 8 (నమస్తే తెలంగాణ) : ప్రత్యేక తెలంగాణ ఉద్యమం తరహాలో రాష్ట్రంలో బీసీల కోసం మరో పోరాటం తప్పదని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ స్పష్టంచేశారు. స్థానిక ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్ల అమలు కోసం రాష్ట్రంలో భూకంపమే సృష్టిస్తామని హెచ్చరించారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో మంగళవారం శాసనమండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, మాజీ మంత్రులు గంగుల కమలాకర్, వీ శ్రీనివాసగౌడ్, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్రతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ తెచ్చిన కామారెడ్డి డిక్లరేషన్‌లో 42% బీసీ రిజర్వేషన్ల అమలుతోపాటు మొత్తం 40 అంశాలు పెట్టారని, వాటిని అడ్డం పెట్టుకుని గత ఎన్నికల్లో గెలిచి, అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటి అమలును పూర్తిగా విస్మరించిందని విమర్శించారు. స్థానిక ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్ల అమలు చేయాలన్న అంశంపై సీఎం రేవంత్‌రెడ్డికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. ఈ నెల 10న జరిగే రాష్ట్ర క్యాబినెట్లో బీసీ రిజర్వేషన్లపై జీవో తీసుకొస్తున్నట్టు లీకులు ఇస్తున్నారని, ఆ జీవో ద్వారా రిజర్వేషన్లకు చట్టబద్ధత ఎలా వస్తుందని ప్రశ్నించారు. పార్లమెంట్లో ఆమోదం పొందాల్సిన బీసీ రిజర్వేషన్ల బిల్లు అమలుకు జీవో విడుదల చేస్తే ఎలా సరిపోతుందని నిలదీశారు. అసెంబ్లీలో బిల్లు పెట్టినట్టు చేసి, తూతూ మంత్రంగా కేంద్రానికి బిల్లు పంపి చేతులు దులుపుకున్నారని మండిపడ్డారు. కేవలం జీవో వల్ల ఆ బిల్లుకు చట్టబద్ధత రాదని తేల్చిచెప్పారు. జీవో విడుదల చేసి, మళ్లీ ఎవరితోనో.. కోర్టులో కేసులు వేయించి, మోసం చేయాలని చూడటం తగదని హితవు పలికారు. కేంద్రాన్ని ఒప్పించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి అఖిపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ ఢిల్లీలో తిరుగుతున్నారు కానీ, బీసీ బిల్లును మాత్రం పట్టించుకోవడమే లేదని మండిపడ్డారు.
పార్టీపరంగా రిజర్వేషన్లు అంగీకార యోగ్యం కానేకాదని, 42% రిజర్వేషన్లు బిల్లు అమలు చేశాకే స్థానిక ఎన్నికలకు వెళ్లాలని తలసాని కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రిజర్వేషన్లు ఇవ్వడం బిచ్చమా? అని ప్రశ్నించారు. బీసీ రిజర్వేషన్లు ఇవ్వడమనే అంశాన్ని అభూత కల్పనగా సృష్టిస్తున్నారని మండిపడ్డారు. నాడు ఎన్టీఆర్, చంద్రబాబు, వైఎస్సార్‌తోపాటు తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ కూడా బీసీల రిజర్వేషన్ల కోసం తీర్మానం చేసి కేంద్రానికి పంపితే.. ఇప్పటివరకు దాని మీద అతీగతీ లేకుండా పోయిందని గుర్తుచేశారు. రాష్ట్రంలో నామినేటెడ్ పోస్టులను బీసీ నేతలకే ఇవ్వడంలేదని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ సర్కారుకు చిత్తశుద్ధి ఉంటే బీసీలతో నామినేటెడ్ పదవులను భర్తీచేయాలని డిమాండ్ చేశారు. పదవులకు బీసీలు అర్హులు కాదా? అని నిలదీశారు.
‘మేమెంతో మాకంత’ అంటే జనాభాలో బీసీల సంఖ్యను బట్టి చట్టసభల్లో, విద్యా, ఉద్యోగాల్లో 42% రిజర్వేషన్లను కల్పించాలని శాసనమండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పాలన అంతా పలాయనం చిత్తగించడమేనని ధ్వజమెత్తారు. మొత్తం ఐదు బడ్జెట్లలో ఇప్పటికే రెండు బడ్జెట్లు ప్రవేశపెట్టారని, అయినా బీసీలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చ లేదని విమర్శించారు. అసెంబ్లీలో బీసీ బిల్లులకు ఆమోదం పొంది 100 రోజులైనా ఉలుకు పలుకు లేకుండా పోయిందని మండిపడ్డారు. చట్టబద్ధంగా బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించకపోతే, జరగబోయే పరిణామాలకు కాంగ్రెస్ ప్రభుత్వమే బాధ్యత వహించాలని హెచ్చరించారు.
తమిళనాడు తరహాలో తెలంగాణలో కూడా బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మాజీ మంత్రి శ్రీనివాసగౌడ్ డిమాండ్ చేశారు. బీసీలను మోసగించేందుకే కాంగ్రెస్ సర్కార్ జీవో తెచ్చేందుకు యత్నిస్తున్నదని విమర్శించారు. రిజర్వేషన్లను తుంగలో తొక్కే ప్రయత్నం చేస్తున్నదని ధ్వజమెత్తారు. సుప్రీంకోర్టు ఆదేశాలను విస్మరించి జీవో ఇస్తే ఎలా సరిపోతుందని ప్రశ్నించారు. పైసల్లేని శాఖలు, ప్రాధాన్యం లేని పోస్టులు ఇచ్చి, బీసీ నేతలను అవమానించడం తప్ప.. మరొకటి కాదని దుయ్యబట్టారు. కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయకుంటే ఉద్యమ కార్యాచరణను రూపొందిస్తామని హెచ్చరించారు.
బీసీ బిల్లును అసెంబ్లీలో ఆమోదించి, ఢిల్లీ వెల్లి ధర్నా చేశారే తప్ప.. దానిని పట్టించుకోకుండా వదిలేశారని శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్ విమర్శించారు. 42% రిజర్వేషన్ల అమలు కోసం రేవంత్‌రెడ్డి సర్కారు ఏ మాత్రం పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. ఈ బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలపక ముందే, ఆయన పేరున జీవో ఎలా ఇస్తారని ప్రశ్నించారు. బీసీ రిజర్వేషన్ల ప్రక్రియను కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే వివాదాస్పదం చేస్తుందని విమర్శించారు. ఇప్పటికైనా మాయమాటలు చెప్పకుండా 42% రిజర్వేషన్లు అమలు చేశాకే, ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ సర్కారు వైఖరి వల్ల బీసీ వర్గాల మనోభావాలు దెబ్బతింటున్నాయని మాజీ మంత్రి గంగుల కమలాకర్ ఆందోళన వ్యక్తంచేశారు. శాస్త్రీయ పద్ధతిలో బీసీ బిల్లు పొందాలని, ఈ విషయాన్ని అసెంబ్లీ వేదికగా చెప్పామని తెలిపారు. తమిళనాడు తరహాలో రిజర్వేషన్ల సాధన కోసం కేంద్రంపై ఒత్తిడి తెవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు పనిచేయడం లేదని ప్రశ్నించారు. ప్రధాని వద్దకు సీఎం రేవంత్‌రెడ్డి అఖిలపక్షాన్ని తీసుకెళ్లాలని, బిల్లు ఆమోదం పొందేవరకు తాము కూడా సహకరిస్తామని చెప్పారు. రాష్ట్ర క్యాబినెట్లో బీసీలకు ఆరు మంత్రి పదవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 42% రిజర్వేషన్లు అమలు చేయకుంటే బీఆర్ఎస్ తడాఖా చూపుతామని హెచ్చరించారు.
42% బీసీ రిజర్వేషన్ల అమలు విషయంలో కాంగ్రెస్ వైఖరి ఇలాగే కొనసాగితే, బీసీలంతా ఏకమయ్యే సమయం అసన్నమైందని స్పష్టంచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి బీసీలకు మోసం చేయాలని చూస్తుందని ధ్వజమెత్తారు. కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో మాయమాటలు చెప్పి బీసీలను చేసిందని, ఇప్పుడు రాజకీయ రిజర్వేషన్ల పేరుతో జీవో విడుదల చేసి మరోసారి మోసం చేయడానికి కుట్రలు చేస్తుందని మండిపడ్డారు. గ్రామాల వారీగా బీసీల్లో చైతన్యం వచ్చిందని, ఇది ఉద్యమంగా మారి కాంగ్రెస్‌ను పతనం చేస్తుందని హెచ్చరించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాల్సిందేనని డిమాండ్ చేశారు. సమావేశంలో బీసీ కమిషన్ మాజీ సభ్యుడు కిషోర్‌గౌడ్, కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవికుమార్‌గౌడ్, బీఆర్ఎస్ నేతలు బాలరాజుయాదవ్, సుమిత్ర ఆనంద్, తుల ఉమ, శుభప్రద్ పటేల్ పాల్గొన్నారు.