బీఆర్ఎస్ నేతలపై, స్థానిక నాయకత్వంపై అసూయ పెరిగేలా చేసిండ్రు. కుటుంబ పాలన, అహంకారం, దొరపాలన అని ప్రజల్లో ద్వేషం నింపిండ్రు. కేసీఆర్ పది వేలే ఇస్తుండు.. మేం 15 వేలిస్తం.. ఆడబిడ్డ పెండ్లికి కేసీఆర్ లక్షనే ఇస్తుండు.. మేం తులం బంగారం కూడా ఇస్తం. కేసీఆర్ 2 వేల పింఛనే ఇస్తుండు.. మేము 4 వేల పింఛనిస్తమని రేవంత్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి లాంటోళ్లంతా కలిసి ప్రజలకు ఆశ పెట్టిండ్రు. అసూయ, ద్వేషం, ఆశతో కూడిన అబద్ధాలతోనే తెలంగాణ ఆగమైంది.
– కేటీఆర్
నలభై డిగ్రీల ఎండలోనూ.. వెల్లువలా తరలివచ్చిన జనం, హోరెత్తిన నినాదాలు, అభిమాన నాయకుడిని చూసేందుకు మిద్దెలు మేడలెక్కిన మహిళలు, వాహనం వెంట ఉత్సాహంగా పరుగులు తీసే కార్యకర్తలు.. బీఆర్ఎస్ రజతోత్సవ సన్నాహక సభ సందర్భంగా సూర్యాపేటలో గురువారం కేటీఆర్ పర్యటన దృశ్యాలివి.. ఇది ఉద్యమసమయం కాదు. ఇపుడు ఎన్నికలు లేవు. పార్టీ అధికారంలో లేదు.. అయినా అదే జనం.. అదే ఉత్సాహం.
అదే స్ఫూర్తి.. సభలో ప్రసంగానికీ అదే రెస్సాన్స్! మాట మాటకు చప్పట్ల హోరు. ఎందుకింత ఆదరణ? ఎందుకింత ఆరాటం? జవాబు ఆ సభలోనే దొరికింది. ఓ ప్లకార్డు పట్టుకొని కూర్చున్న మహిళ తనలో తానే కన్నీరుమున్నీరవుతున్నది. కుమిలి కుమిలిపోతున్నది. నీళ్లు రాక పంటలెండిన దుఃఖం ఆమెలో పొంగిపొర్లుతున్నది. ఆమె పట్టుకున్న ప్లకార్డు మీద ‘సేవ్ తెలంగాణ.. రామన్నా!’ అని ఆర్తిగా రాసి ఉంది. రాష్ట్రంలో వర్తమానం ఏమిటో.. భవిష్యత్తు ఏమిటో ఆ ఒక్క దృశ్యమే చెప్తున్నది!!!
KTR | నల్లగొండ ప్రతినిధి, మార్చి 20 (నమస్తే తెలంగాణ) : ప్రతి తెలంగాణ బిడ్డకు గుండె ధైర్యం గులాబీ జెండానే అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘంటాపథంగా చెప్పారు. గులాబీ జెండా ఎగిరి 24 ఏండ్లు నిండి వచ్చే నెల 27న 25వ వసంతంలోకి అడుగుపెట్టబోతున్నామని చెప్పారు. అసూ య.. ద్వేషం.. ఆశను ఆసరాగా చేసుకుని కేసీఆర్‌పై, ఆయన కుటుంబంపై, బీఆర్ఎస్ నేతలపై వ్యక్తిగతంగా, పార్టీ పరంగా నీచాతినీచ నికృష్టమైన భాషలో మాట్లాడుతూ విష ప్రచారం చేస్తూ ప్రజల మనస్సులను చెడగొట్టి లేని ఆశలు చూపి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని నిప్పులు చెరిగారు. గురువారం సూర్యాపేట జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన పార్టీ జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ ప్రసంగించారు.
ఈ సందర్భంగా కేటీఆర్‌కు హైదరాబాద్ నుంచి సూర్యాపేట వరకు దారి పొడవునా పార్టీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కార్యకర్తలను ఉద్దేశించి కేటీఆర్ కీలక ప్రసంగం చేశారు. ‘ఉమ్మడి నల్లగొండ జిల్లాను చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా కేసీఆర్ బ్రహ్మాండంగా అభివృద్ధి చేసిండు. టెయిలెండ్ గ్రామాలకు నీళ్లు రాకపోతే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి గోదావరి జలాలను కోదాడ చివరి మడి వరకు తెచ్చి రెండున్నర లక్షల ఎకరాలకు రెండు పంటలకు నీళ్లిచ్చిండు. ఒక్క మెడికల్ కళాశాల లేని నల్లగొండకు మూడు మెడికల్ కళాశాలలు ఇచ్చిండు.
దామచర్లలో అద్భుతమైన విద్యుత్తు కేం ద్రం కట్టిండు. తెలంగాణలోనే ఎక్కడా లేనివిధంగా అల్ట్రా మెగా పవర్ ప్లాంట్ కట్టిండు. ఆలేరు, భువనగిరిలో ధార్మిక క్షేత్రమైన యాదాద్రిని అద్భుతంగా తీర్చిదిద్దిండు. ఇవన్నీ చేసినా నల్లగొండలో ఒక్క సూర్యాపేటలోనే పార్టీ గెలిచింది. అంటే కాంగ్రెస్, బీజేపీ చేసిన అసూయ, ద్వేషం, ఆశల ప్రచారమే మన కొంప ముంచింది’ అని కేటీఆర్ తెలిపారు. అసూయ, ద్వేషం, ఆశ.. ఈ మూడే బీఆర్ఎస్ అధికారం కోల్పోవడానికి కారణమైనట్టు ఇటీవల తనను కలిసిన ఓ మిత్రుడు చెప్పినట్టు వివరించారు.
మనకు ఉద్యమం కొత్తకాదు.. అధికారమూ కొత్త కాదు.. ప్రతిపక్ష పాత్ర కొత్తకాదు.. తిరిగి అధికారంలోకి రావాలని కోరుకుంటున్నది కూడా మన కోసం కాదు. ఆనాడు చరిత్రలో టీఆర్ఎస్ పుట్టుక ఒక అనివార్యమైన పరిస్థితి ఎలా అయ్యిందో! అదే మాదిరిగా ఇప్పుడు ఆగమైన తెలంగాణ కోసం తిరిగి అధికారంలోకి రావడమనేది ఒక చారిత్రాత్మక అవసరంగా భావిస్తున్నం.
-కేటీఆర్
‘పార్టీ అధికారంలోకి రాగానే ఫలానా నేత కొత్త కారు కొన్నడు.. కొత్త ఇల్లు కొన్నడు.. అంటూ బీఆర్ఎస్ నేతలపై, స్థానిక నాయకత్వంపై అసూయ పెరిగేలా దుష్ప్రచారం చేశారు. కేసీఆర్ రాష్ర్టాన్ని కుటుంబం కోసమే తెచ్చుకున్నడట! ఆయన ఎవ్వరినీ కలవడట! అహంకారమట! కుటుంబపాలన అట! కేసీఆర్‌ది దొరపాలననట! ఇలా ఎన్నో చెప్పి అగ్రనాయకత్వంపై ద్వేషం నిండేలా విష ప్రచారం చేసిండ్రు. కేసీఆర్ పది వేలే ఇస్తుండు.. మేము 15 వేలిస్తం.. కేసీఆర్ ఆడబిడ్డ పెండ్లికి లక్షనే ఇస్తుండు.. మేము తులం బంగారం కూడా ఇస్తం. కేసీఆర్ 2 వేల పింఛనే ఇస్తుండు.. మేము ఇంట్లో ఇద్దరికీ 4 వేల చొప్పున ఇస్తం.. మా సోనియమ్మ చెప్పింది.. వచ్చే నెల నుంచి ఇస్తం అని రేవంత్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి లాంటోళ్లంతా కలిసి ప్రజలకు ఆశలు పెట్టిండ్రు. కాంగ్రెస్, బీజేపోళ్లు అసలు రాష్ట్రం అభివృద్ధి గురించి మాట్లాడలేదు. కానీ అసూయ, ద్వేషం, ఆశలతో కూడిన అబద్ధాలు మాట్లాడుతూ ప్రజలను మభ్యపెట్టిండ్రు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో అందరి సం పద పెరిగింది. అన్ని వర్గాల ఆదాయం పెరిగింది. ఇలా అందరి సంపద పెరిగినప్పుడు ఒక్క బీఆర్ఎస్ నేతల సంపదనే పెరిగిందని విష ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిండ్రు’ అని కేటీఆర్ మండిపడ్డారు.
వరంగల్‌లో సిల్వర్ జూబ్లీ వేడుకలకు ప్రారంభ సూచికగా వచ్చే నెల 27న లక్షలాది మందితో బహిరంగసభ నిర్వహిస్తున్నం. ఇందులో ప్రతి గ్రామం నుంచి ప్రతి గులాబీ సైనికుడి భాగస్వామ్యం ఉండాలి. ఏప్రిల్ 27న బీఆర్ఎస్ 25వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ప్రతి బిడ్డా గులాబీ జెండా చేతబట్టి వరంగల్‌కు తరలిరావాలి. సూర్యాపేట గడ్డ తెలంగాణ సాయుధ పోరాటంలో నిజాంనే ఉరికించిన చైతన్యవంతమైన గడ్డ. బీఆర్ఎస్ 25వ ఏట అడుగుపెడుతున్న సంద ర్భం. మీ జిల్లా కవి రాసిన పాట ప్రకారం.. బండెనక బండి కట్టి పదహారు బండ్లు కట్టిన చందంగా బయలుదేరాలి.
కాంగ్రెస్, బీజేపీ గుండెల్లో రైళ్లు పరుగెత్తించేలా కదం తొక్కాల్సిన సందర్భమిది. పట్టణాల్లోని వార్డులు, గ్రామం అనే తేడా లేకుండా తరలిరావాలి’ అని కేటీఆర్ పిలుపునిచ్చారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్యయాదవ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గాదరి కిశోర్, బొల్లం మల్లయ్యయాదవ్, పార్టీ నేత ఒంటెద్దు నర్సింహ్మారెడి ప్రసంగించగా ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు రమావత్ రవీంద్రకుమార్, నల్లమోతు భాస్కర్‌రావు, చిరుమర్తి లింగయ్య, పైళ్ల శేఖర్‌రెడ్డి, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, కంచర్ల భూపాల్‌రెడ్డి, నోముల భగత్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు.
‘ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కలిపి చూస్తే మన చరిత్ర సుధీర్ఘమైనది. ఈ దేశంలో దశాబ్దాల పాటు తెలుగువాళ్లను మదరాసీలని పిలిచేవాళ్లు. ఆనాడు ఓ పార్టీ పెట్టి తెలుగువాళ్లు కూడా దేశంలో ఉన్నారని చాటి చెప్పిన నాయకుడు నందమూరి తారకరామారావు. ఆ తర్వాత ఈ దేశంలో తెలంగాణ గడ్డకు ప్రత్యేక అస్తిత్వం ఉన్నదని, తెలంగాణ అనే పౌరుశాల గడ్డ ఉన్నదని ఎలుగెత్తిన నాయకుడు కేసీఆర్.. ఎన్టీఆర్ పేరు తీసుకోవడంలో ప్రత్యేక సందర్భమున్నది. 76 ఏండ్ల భారతదేశ స్వాతంత్య్రం అనంతర రాజకీయ చరిత్ర చూస్తే తెలుగు గడ్డ నుంచి పుట్టిన రెండే రెండు పార్టీలు విజయవంతంగా 25 ఏండ్ల పైచిలుకు ప్రస్తానాన్ని కొనసాగించాయి. అవి టీడీపీ, బీఆర్ఎస్సే’ అని కేటీఆర్ చెప్పారు.
‘వికృత మనస్తత్వం కలిగిన రేవంత్‌రెడ్డి అదృష్టం బాగుండి 54 ఏండ్లకే సీఎం అయ్యిండు. చిన్నవయస్సులో జాక్‌పాట్ తగిలింది. ఈ జాక్పాట్తో రేవంత్‌రెడ్డి పర్సనాలిటీ పెంచుకుంటడేమో అనుకుంటే ఆయన మనస్సంతా పర్సంటేజీలు పెంచుకోవడంపైనే ఉన్న ది’ అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ‘ఢిల్లీకి మూ టలు పంపాలె.. పదవిని కాపాడుకోవాలె అన్న ధ్యాస తప్ప మరొకటి లేదు.. కేసీఆర్‌పై యూ ట్యూబ్ చానళ్లలో ఇష్టమొచ్చిన విష ప్రచారం చేసి సీఎం అయిన రేవంత్‌రెడ్డి.. ఇప్పుడు అదే యూట్యూబోళ్లను గుడ్డలూడదీసి కొడతాడట! ఆయన కాడికి వస్తే అన్నీ గుర్తుకొస్తున్నయి.. ఇది వరకు ఎవరికీ భార్య లేదు.. పిల్లలు లేరు.. ఈయనకు ఒక్కరికే ఉన్నరట! ఇదివరకు ఏది పడితే అది.. ఒక్కో ప్రాంతానికి వచ్చి ఒక్కో నాయకుడిని నీచాతినీచంగా మాట్లాడలేని భాషలో వికృతంగా మాట్లాడి ప్రజల మనస్సులను కరాబు చేసి లేని ఆశలు పెట్టి అధికారంలోకి వచ్చిండు. కేసీఆర్ మోకాలెత్తులేని రాజకీయ పిగ్నీ రేవంత్. రేవంత్‌రెడ్డి అవునన్నా కాదన్నా ఎంత ఎగిరెగిరి పడ్డా కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేస్తామని ఎన్ని డైలాగులు కొట్టినా చరిత్ర చెరిపేయలేని సత్యమేమిటంటే.. కేసీఆరే లేకపోతే.. ఈ గులాబీ జెండానే లేకపోతే.. తెలంగాణ రాష్ట్రమే లేదన్నది అక్షర సత్యం’ అని కేటీఆర్ స్పష్టం చేశారు.
‘2001లో కేసీఆర్ పార్టీ పెట్టినప్పుడు ఏముంది? అప్పటికే 46 ఏండ్ల వయస్సు! ఒక రాజకీయ పార్టీ పెట్టాలంటే దుస్సాహసమే. అప్పటికే 100 సంవత్సరాల చరిత్ర ఉన్న కాంగ్రెస్ ఓవైపు.. బీజేపీ నేతృత్వంలో దేశాన్ని నడుపుతున్న ఎన్డీయే కూటమి మరోవైపు . ఎన్డీయేకు కన్వీనర్‌గా ఉంటూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు సీఎంగా ఢిల్లీలో చక్రం తిప్పుతూ మొత్తం భవిష్యత్తు నాదేనంటూ గర్జిస్తున్న చంద్రబాబు ఇంకోవైపు. ఆ పరిస్థితుల్లో ఒక నాయకుడు. ఆయనేమీ సినిమా యాక్టర్ కాదు.. పాపులారిటీ నేత కాదు. ఒక మంత్రిగా తెలుసు. అయినా కేసీఆర్ వెంట లక్షల మంది కలిసి నడిచిండ్రు.
ప్రజా సంఘాలు కలిసొచ్చినయి. విద్యార్థులు బలిదానాలు చేసుకున్నరు. కానీ కేసీఆర్ నడుం బిగించి మొదటి అడుగు వేయకపోతే ఆ తర్వాత 14 ఏండ్ల చరిత్రనే లేదు. తెలంగాణ సమాజమే మళ్లీ తెలంగాణ వస్తదంటే నమ్మలేని పరిస్థితులు! ఇలాంటి పరిస్థితుల్లో ఒక్కడిగా బయల్దేరిండు. జగదీశ్‌రెడ్డి వంటి ఉమ్మడి నల్లగొండ జిల్లా మిత్రులు కొందరు కలిసి ఆయనతోపాటు ప్రయాణం ప్రారంభించిండ్రు. ఒక్కో అడుగు వేసుకుంటూ 14 ఏండ్ల ఉద్యమం. తర్వాత అధికారం. ఇప్పుడు ప్రతిపక్షం. నిజంగా 25 ఏండ్ల టీఆర్ఎస్ చరిత్ర ఇది. బీఆర్ఎస్గా ఈ రోజున్నం. 2001లో గులాబీ జెండా ఎగరేసి ఒక్కడుగా బయల్దేరి.. శూన్యం నుంచి సునామీ సృష్టించి తెలంగాణ రాష్ట్రం సాధించిన మహానాయకుడు కేసీఆర్’ అని కేటీఆర్ కొనియాడారు.
15 నెలల కిందట అధికారం పోయి ప్రతిపక్షంలోకి వచ్చినం. మేం ప్రతిపక్షంలోకి వచ్చాక ఆటో చెంప ఇటో చెంప వాయిస్తున్నరని, కూసోనిస్తలేరని రేవంత్‌రెడ్డి వాపోతున్నడు. ప్రతిపక్ష పార్టీగా కూడా ప్రజల పక్షాన అసెంబ్లీలో, బయట ఎలుగెత్తి పోరాడుతున్నది ఒక్క బీఆర్ఎస్ పార్టీ మాత్రమే.
-కేటీఆర్
‘దేశ రాజకీయ చరిత్ర పరిశీలిస్తే మూడు పాత్రల్లోనూ విజయవంతమైన ఏకైక పార్టీ బీఆర్ఎస్ ఒక్కటే.. మొదటి 14 ఏండ్లు ఉద్యమ పార్టీగా విశ్వరూపాన్ని చూపెట్టి.. దేశంలోనే ప్రజాస్వామ్యబద్ధంగా రాష్ట్రంతోపాటు తమ కోరికలు నెరవేర్చుకోవచ్చనే అన్నివర్గాల ప్రజలకు అద్భుతమైన ఉద్యమ రూపాన్ని ఆవిష్కరించిన పార్టీ టీఆర్ఎస్. ఆ తర్వాత పదేండ్ల పాటు అధికారమిస్తే ప్రజలు, పేదల కోసం ఎలా పని చేయవచ్చో స్వల్పకాలంలో అన్ని అనుమానాలను పటాపంచలు చేస్తూ.. దేశంలో నంబర్ 1 రాష్ట్రంగా ఎట్లా నిలుప వచ్చో చూపెట్టిన నాయకత్వం కేసీఆర్‌ది. 15 నెలల కిందట అధికారంపోయి ప్రతిపక్షంలోకి వచ్చినం. ప్రతిపక్ష పార్టీగా కూడా ప్రజల పక్షాన అసెంబ్లీలో, బయట ఎలుగెత్తి పోరాడుతున్న ఏకైక పార్టీ బీఆర్ఎస్ ఒక్కటే! ప్రతి తెలంగాణ బిడ్డకు గుండె ధైర్యం ఈ గులాబీ జెండా అని ఘంటాపథంగా.. గర్వంగా చెప్పుకోవచ్చు. అలాంటి గులాబీ జెండా ఎగిరి 24 ఏండ్లు నిండి వచ్చే నెల 27న 25వ వసంతంలోకి అడుగు పెడుతున్నది’ అని కేటీఆర్ చెప్పారు.
‘కేసీఆర్ ఉన్నప్పుడు వచ్చిన నీళ్లు ఇవ్వాళ ఎందుకు వస్తలేవో సమాధానం చెప్పే సత్తా కాంగ్రెస్ నేతలకు లేదు. సూర్యాపేటకు వచ్చే నీళ్లు కాళేశ్వరం ప్రాజెక్టువి కాదూ.. ఎస్సారెస్పీవి అని భట్టీ విక్రమార్క చెప్పిండు. అది నిజమే అనుకుందాం. మరి మీరు కట్టిన ఎస్సారెస్పీ బాగానే ఉన్నది కదా?.. మరి గోదావరి నీళ్లు ఎందుకు వస్తలేవు? కేసీఆర్ కట్టిన కాళేశ్వరంతో కేసీఆర్ ప్రభుత్వంలో ఆప్పుడు నీళ్లోచ్చినయ్. మీ ప్రభుత్వం రాంగనే నీళ్లు ఎందుకు బందైనయి అంటే సమాధానం లేదు. కేసీఆర్‌పై ఉన్న గుడ్డి ద్వేషంతో.. వ్యతిరేకతతో కేసీఆర్ ఆనవాళ్లను ప్రజలు మర్చిపోవాలని మేడిగడ్డలో చిన్న పర్రె పడితే రిపేర్ చేయకుండా ఎండబెట్టి ఆంధ్రకు నీళ్లు పోతున్నా పట్టించుకోకుండా గోదావరి పరీవాహక ప్రాంతంలో లక్షలాది ఎకరాల్లో పంటలు ఎండుతున్నయి అంటే ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు కాదా? రేవంత్‌రెడ్డి పాపం.. రైతన్నలకు శాపమవుతున్నది.
కేసీఆర్ మీద రేవంత్‌రెడ్డికి ఉన్న కోపం.. రైతన్నలకు శాపమైంది. కేసీఆర్ నీరటాయన లెక్క పనిచేసి గోదావరి నీళ్లిస్తే సూర్యాపేట జిల్లాలో రెండున్నర లక్షల ఎకరాల్లో కాళేశ్వరం ద్వారా రెండు పంటలు పండినయి. ఉమ్మడి నల్లగొండ జిల్లాను వరి ధాన్యం ఉత్పత్తిలో నంబర్ 1 చేసింది కేసీఆరే. సూర్యాపేట జిల్లాలోనే నీళ్ల మంత్రి ఉన్నా.. నీళ్లు మాత్రం లేవు. ఎస్ఎల్బీసీ సొరంగంలో ఎనిమిది మంది చిక్కుకుపోతే నల్లగొండ మంత్రులు చిత్ర విచిత్రాలు చేస్తున్నరు. ఒకాయన చేపల కూర తెప్పించుకొని తింటూ నీళ్లు వాటర్ కలిసినయ్ అంటడు. ఇంకొకాయన నీళ్లు ఇవ్వలేని మంత్రి. ఇట్లాంటి మంత్రులను నల్లగొండ ప్రజలు తెచ్చి నెత్తిన పెటుకున్నరు. కృష్ణానదిలో వర్షాకాలంలో పుష్కలంగా నీళ్లున్నయ్.
శ్రీశైలం, సాగర్, జూరాలలో నిండా నీళ్లు ఉండె. అయినా అక్కడ ఎందుకు నీళ్లివ్వలేకపోతున్నరు? ఆనాడు ఇదే నల్లగొండ జిల్లాలోని చివరి భూముల వరకు జగదీశ్‌రెడ్డి, ఇతర నేతలంతా కలిసి నీళ్లివ్వలేదా? కేసీఆర్ ఉన్నపుడు కృష్ణానదిలో మనం 36 శాతం నీళ్లు వాడుకున్నం. ఈ సన్నాసుల ప్రభుత్వం వచ్చాక 24 శాతం కూడా వాడుకొనే తెలివి లేక నీళ్లన్నీ సముద్రంలోకి వదిలేసిండు. నీళ్లు వాడుకునే తెలివి లేదు.. పొదుపు చేసే తెలివి లేదు.. చెరువులను నింపి భూగర్భజలాలను పెంచే తెలివి లేదు. కేసీఆర్ చేసిన పనిని కూడా చేసే తెలివి వీళ్లకు లేదు.. డైలాగులు కొట్టే తెలివి మాత్రం ఉన్నది. ప్రాజెక్టుల కింద పంటలు ఎండితే ప్రభుత్వ బాధ్యత అని, బోర్ల కింద ఎండితే ప్రభుత్వ బాధ్యత కాదని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్తున్నడు. ప్రాజెక్టులో నీళ్లున్నప్పుడు చెరువులు నింపే తెలివి లేదు. అదే కేసీఆర్ ఉన్నప్పుడు ఎర్రటి ఎండాకాలంలోనూ చెరువులు మత్తడులు దుంకలేదా? మీకు ఎందుకు చేతనైతలేదో చెప్పాలె’ అని కేటీఆర్ నిలదీశారు.
దేశ రాజకీయ చరిత్రలో మూడు పాత్రల్లోనూ విజయవంతమైన ఏకైక పార్టీ బీఆర్ఎస్సే. మొదటి 14 ఏండ్లు ఉద్యమ పార్టీగా విశ్వరూపం చూపింది. ఆ తర్వాత ప్రజలు పదేండ్ల పాటు అధికారమిస్తే పేదల కోసం ఎట్లా పనిచేయవచ్చో చేసి చూపించింది. స్వల్పకాలంలోనే అందరి అనుమానాలను పటాపంచలు చేస్తూ రాష్ర్టాన్ని దేశంలో నంబర్ 1గా నిలిపి చూపెట్టిన నాయకత్వం కేసీఆర్‌ది.
-కేటీఆర్
బీజేపీ వాళ్లు ఇదే రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడరు. పైన బడాభాయ్… కింద చోటాభాయ్.. వీళ్లిద్దరూ ఒక్కటే. బయటకు డ్రామా తప్ప ఇద్దరి లక్ష్యం ఒక్కటే. గులాబీ జెండా తెలంగాణ ప్రజాపక్షం. కాంగ్రెస్, బీజేపీలు ఢిల్లీ పక్షం. అందుకే వాళ్లు ప్రజాపక్షంగా ఉన్న గులాబీ పార్టీ ఉండొద్దని కోరుకుంటున్నరు. ఇవ్వాళ బండి సంజయ్, కిషన్‌రెడ్డి కలిసి రేవంత్‌రెడ్డి మీద ఈగ వాలకుండా కాపాడుతున్నరు. రేవంత్‌రెడ్డి ఎంత అవినీతి చేసినా వేల కోట్లు దోచుకుంటున్నా మనం ఆధారాలతో సహా సమర్పించినా కంటికి రెప్పలా కాపాడుతున్నరు. కాంగ్రెస్, బీజేపీ వాళ్లు మనకు ఏనాడైనా శత్రువులే. రాష్ట్ర శాసనసభలో ఒక విచిత్రమైన సన్నివేశం నెలకొన్నది.
అధికార పక్షం కాంగ్రెస్‌తో బీజేపీ కలిసిపోయింది. సీపీఐ అటే ఉన్నది. మజ్లిస్ అటే ఉన్నది. ఇవ్వాళ పంచపాండవుల మాదిరిగా కౌరవుల సభలో వంద మందిని ఎదుర్కొంటున్నది ఒక్క కేసీఆర్ సైన్యం.. గులాబీ దండు మాత్రమే. దళిత స్పీకర్‌ను అవమానిస్తావా అని అసెంబ్లీలో జగదీశ్‌రెడ్డిని సస్పెండ్ చేసిండ్రు. దళిత స్పీకర్, బీసీ స్పీకర్, ఓసీ స్పీకర్, గిరిజన స్పీకర్ అని ఉంటదా? స్పీకర్ ఎన్నికకు పోటీ లేకుండా మేము సహకరించినం. కేసీఆర్ సలహాతో స్పీకర్ వద్దకు వెళ్లి చెప్పినం. పదేండ్లు మంత్రిగా పని చేసిన జగదీశ్‌రెడ్డి మాటలపై మీరు నొచ్చుకుంటే మైక్ ఇస్తే విచారణ వ్యక్తం చేసేందుకు సిద్ధమని చెప్పినం. కానీ మైక్ ఇవ్వలే. రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా సూర్యాపేట జనరల్ స్థానంలో దళిత మహిళ అన్నపూర్ణను మున్సిపల్ చైర్మన్ చేసిన జగదీశ్‌రెడ్డి దళిత వ్యతిరేకా? ఇంకా విచిత్రం ఏమిటంటే ఈ సభ మనందరిదన్న జగదీశ్‌రెడ్డిని సస్పెండ్ చేసి.. సభ గాంధీభవన్ సభను తలపిస్తుందన్న మజ్లిస్ సభ్యునికి మైక్ ఇచ్చి బాకా ఊదించుకుంటున్నరు. అసెంబ్లీలోనైనా, బయటనైనా ప్రజల ప్రయోజనాల కోసం గొంతెత్తుతున్నది ఒక్క బీఆర్ఎస్సే’నని కేటీఆర్ స్పష్టం చేశారు.
‘ప్రజా ప్రయోజనాల కోసం గొంతెత్తుతున్న ఏకైక పార్టీగా ఈ ఏడాది పార్టీ మహాసభకు సిద్ధమవుతున్నం. తర్వాత మేలో పార్టీ సభ్యత్వ నమోదును ప్రారంభిస్తం. ఆ తర్వాత పార్టీలో ఖాళీలను భర్తీ చేస్తూ కొత్త కమిటీలను నిర్మించుకుందాం. బూత్ స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు పటిష్టంగా కమిటీలు ఏర్పాటు చేసుకుందాం. కష్టకాలంలో పార్టీని పట్టుకొని ఉన్న నిఖార్సైన నాయకులకే పెద్దపీట వేయాలని గీటురాయిగా పెట్టుకున్నం. ఈ ఏడాదిలోనే పార్టీ అధ్యక్షుడి ఎన్నిక, జిల్లా కమిటీల ఎన్నికలు కూడా పూర్తి చేసుకుందాం. 32 జిల్లాల్లో 32 పార్టీ కార్యాలయాలు ఉన్నాయి. ప్రతి పార్టీ కార్యాలయం ఒకచైతన్య కేంద్రంగా మార్చుకుని కార్యకర్తల శిక్షణ శిబిరాలను పెడ్దాం. కాంగ్రెస్, బీజేపీ మోసాలను ఎండగట్టేందుకు కార్యకర్తలను చైతన్యవంతులుగా తీర్చిదిద్ది ఏడాది పోరాటనామ సంవత్సరంగా ముం దుకు సాగుదాం’ అని కేటీఆర్ పిలుపునిచ్చారు.
‘మనకు ఉద్యమం కొత్తకాదు.. అధికారమూ కొత్త కాదు.. ప్రతిపక్ష పాత్ర కొత్తకాదు.. కానీ తిరిగి అధికారం కావాలని కోరుకోవడం మన కోసం కాదు.. ఆనాడు టీఆర్ఎస్ పుట్టుక ఒక అనివార్యం ఎలా అయ్యిందో.. అదే మాదిరిగా ఇప్పుడు తెర్లయిన తెలంగాణను కాపాడుకొనేందుకు తిరిగి అధికారంలోకి రావాలని కోరుకునేది ఒక చారిత్రాత్మక అవసరంగా భావిస్తున్నం. ఈ 15 నెలల్లో ఎక్కడకు పోయినా మళ్లీ బీఆర్ఎస్ రావాలని.. కేసీఆర్ కావాలని ప్రజ లు కోరుకుంటున్నరు. ఫీనిక్స్ పక్షిలా లేచి మళ్లీ అధికారంలోకి వస్తం.. అద్భు తం పోరాట పటిమతో ప్రజా సమస్యలపై కదం తొక్కుతూ అటు కాంగ్రెస్‌కు, ఇటు బీజేపీకి కాళరాత్రులు చూపిస్తున్నం’ అని కేటీఆర్ తేల్చిచెప్పారు.
‘హైదరాబాద్‌లో ఉండి పిలుపునిస్తే క్షేత్రస్థాయిలో కేసులు పెట్టినా, భయపెట్టినా భయపడకుండా పోరాడుతున్న పార్టీ కార్యకర్తలందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. సూర్యాపేటలో కార్యకర్తల సమావేశానికి వస్తే 5 కిలోమీటర్ల ర్యాలీలో ఎక్కడికక్కడ ప్రజలు బారులుదీరి చేతులూపుతూ మళ్లా మీరే వస్తా రు. తప్పకుండా గెలవాలని ఆశీర్వదించే పరిస్థితి 15 నెలలు తిరక్కుండానే వచ్చిందంటే అది కార్యకర్తల పోరాట పటిమే. పోయింది అధికారమే. ప్రజాభిమానం పోలేదు. గులాబీ జెండా తిరిగి రావాలి. కేసీఆర్ తిరిగి సీఎంకావాలనే మాట ప్రతి గుండెలోంచి వినపడుతున్నది. చీకటిని చూస్తేనే వెలుగు విలువ అర్థమైతది. అప్పుడప్పుడూ గాడిదలను చూస్తేనే గుర్రాల విలువ తెలుస్తది. అక్కడ కంచ ర గాడిదను చూసిన తర్వాత బీఆర్ఎస్ ఏందో.. కేసీఆర్ ఏందో.. పదేండ్లు ఎలా అద్భుతంగా పాలించాడో అందరికీ అర్ధమైంది’ అని కేటీఆర్ వివరించారు.
‘అసెంబ్లీలో డిప్యూటీ సీఎం మాట్లాడుతుంటే నవ్వాలో ఏడ్వాల్నో అర్థమైతలేదు. ఇది అద్భుతమైన బడ్జెట్ అట! మన దేశపతి శ్రీనివాస్ రాసిన గోవిం దా.. గోవిందా పాట గుర్తుకొచ్చింది. ఆ రు గ్యారెంటీలు గోవిందా… తులం బం గారం గోవిందా.. రైతుబంధు గోవిందా అని గుర్తుకొచ్చింది. వంద రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని, దేవుడి దగ్గర అఫిడవిట్ పెట్టి దేవుడిని కూడా మోసం చేసండ్రు. రుణమాఫీ అయిపోయిందని సిగ్గూశరం లేకుండా చెప్పిం డ్రు. రుణమాఫీ గురించి ఒక్క ఊరికైనా వెళ్దామంటే సప్పుడు లేదు. సీఎం ఊరై నా సరే.. డిప్యూటీ సీఎం ఊరైనా సరే.. ఏ ఊరైనా మీ ఇష్టం పోదాం. ఒక్క ఊర్లోనైనా రుణమాఫీ మొత్తం అయ్యిందంటే అక్కడే పదవులను పారేసి పోతమంటే ప్రభుత్వం నుంచి సప్పుడు లేదు. పదవిని కాపాడుకొనేందుకు 40 సార్లు ఢిల్లీకి పోయిన రేవంత్‌రెడ్డి.. పోయినప్పుడల్లా ఢిల్లీకి 500 కోట్లు లేక 600 కోట్లే తీసుకుపోయిండా? రైతులకు చెందిన 30 వేల కోట్లు టకీటకీమని రాహుల్, ఖర్గే, ప్రి యాంక ఖాతాల్లో పడుతున్నయ్ తప్ప.. రైతుబంధు లేదు.. ఏదీ లేదు’ అంటూ కేటీఆర్ ధ్వజమెత్తారు.