హైదరాబాద్, జూన్ 16 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో చిన్నారులు, మహిళలపై అఘాయిత్యాలు విపరీతంగా పెరిగిపోతున్నాయని, ప్రస్తుతం తెలంగాణలో ఆడపిల్లలను కనాలంటేనే తల్లిదండ్రులు భయపడే పరిస్థితి నెలకొన్నదని బీఆర్ఎస్ నాయకురాలు, మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో పోక్సో కేసులు 6% మేరకు ఉంటున్నాయని, తెలంగాణలో మాత్రం వీటి సంఖ్య 16% మేరకు ఉండటం అత్యంత దురదృష్టకరమని పేరొన్నారు. రాష్ట్రంలో నేరాల రేటు భారీగా పెరుగుతున్నప్పటికీ హోంశాఖ మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇప్పటివరకు శాంతిభద్రతలపై కనీసం ఒక సమీక్ష కూడా నిర్వహించకపోవడం ఆయన బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ‘బేటీ బచావో.. బేటీ పడావో’ అని నినదిస్తున్నదని, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి తెలంగాణ నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారని సునీత గుర్తుచేస్తూ..
తెలంగాణలో ఇటు రాష్ట్ర హోంశాఖ మంత్రి, అటు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. మంగళవారం ఆమె మాజీ కార్పొరేటర్లు రాసూరి సునీత, దేదీప్యతో కలిసి తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, మహిళలకు రక్షణ కరువైందని, చట్టాలు బడాబాబులకు చుట్టాలుగా మారుతున్నాయని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఓ చిన్నారిపై దాడికి పాల్పడిన కాంగ్రెస్ సర్పంచ్‌పై పోలీసులు కేసు పెట్టకుండా సెటిల్మెంట్కు ప్రయత్నించడం దారుణమని పేర్కొన్నారు. బండి భగీరథ్ కేసులో కూడా మొదట బలహీనమైన సెక్షన్లు పెట్టడంతో మహిళలు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి పోరాడిన తర్వాతే సెక్షన్లు మార్చారని గుర్తుచేశారు. తెలంగాణలో మహిళలపై జరుగుతున్న దాడులు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి, ప్రియాంక గాంధీకి కనిపించడం లేదా? నేరాలను నియంత్రించాలని వారు సీఎం రేవంత్‌రెడ్డిని ఎందుకు ఆదేశించడం లేదు? అని నిలదీశారు.
చిన్నారులపై అఘాయిత్యాలకు పాల్పడేవారికి కఠిన శిక్షలు పడినప్పుడే నేరాలు తగ్గుముఖం పడుతాయని గొంగిడి సునీత స్పష్టం చేశారు. ఇలాంటి నిందితులను నడిరోడ్డుపై అర్ధనగ్నంగా తిప్పి కాల్చిపడేయాలని, సౌదీ అరేబియా లాంటి దేశాల్లో అమలవుతున్న కఠిన చట్టాలను ఇకడ కూడా అమలు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో తల్లిదండ్రులు తమ పిల్లలకు తప్పనిసరిగా ఆత్మరక్షణ విద్యలు నేర్పించాలని సూచించారు. గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మహిళలకు పూర్తి రక్షణ, ధైర్యం ఉండేవని గుర్తుచేశారు. నాడు అద్భుతంగా పనిచేసిన షీటీమ్స్, భరోసా కేంద్రాలు, మఫ్టీ పోలీసులు ఇప్పుడు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామని ప్రగల్భాలు పలుకుతున్న సీఎం రేవంత్‌రెడ్డి ముందు రాష్ట్రంలోని మహిళలు, చిన్నారుల ప్రాణాలను కాపాడాలని హితవు పలికారు. ఖమ్మం బాధితురాలిని నిమ్స్ దవాఖానలో పరామర్శించి, ఆర్థిక సహాయం చేసిన మంత్రి సీతక చర్యను స్వాగతిస్తున్నామని చెప్తూనే.. కేవలం పరామర్శలతో సరిపెట్టరాదని, చిన్నారులపై నేరాలకు పాల్పడేవారిపై చేపట్టే కఠిన చర్యలేమిటో సీతక, రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.