Y Satish Reddy | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ కేసు పెట్టడంపై బీఆర్ఎస్ నేత వై.సతీశ్ రెడ్డి మండిపడ్డారు. అనుచిత వ్యాఖ్యలు చేశారని కేటీఆర్ మీద కేసు పెట్టారని.. మరి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడినవి భగవద్గీత ప్రవచనాలా అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి మీద కేసు పెట్టరా అని నిలదీశారు. ఈ మేరకు ఆయన సోషల్‌మీడియా వేదికగా స్పందించారు. గతంలో రేవంత్ రెడ్డి మాట్లాడిన అనుచిత వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను పోస్టు చేశారు.
మనది సోమవారం మందిది మంగళవారం అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తోందని వై.సతీశ్ రెడ్డి ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్ని బూతులు మాట్లాడినా.. అనకూడని మాటలు అన్నా… స్పందించని పోలీసులు.. అనుచిత వ్యాఖ్యల పేరుతో కేటీఆర్ పై మరో కేసు పెట్టారని అన్నారు. కేటీఆర్ అన్న దాంట్లో తప్పు ఏమున్నదని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలతో పోలిస్తే కేటీఆర్ మాట్లాడిన మాటలు చాలా చిన్నవని తెలిపారు. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్‌గా ఉన్నప్పుడు, ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా దారుణమైన బూతులు మాట్లాడారని.. అవన్నీ ఇప్పటికీ సోషల్ మీడియాలో, మీడియాలో కనిపిస్తూనే ఉన్నాయని అన్నారు. ఇప్పటికీ వేదికలపైన కేసీఆర్‌ను ఉద్దేశించి ఆయన ఎంత దిగజారి మాట్లాడుతున్నారో చూస్తూనే ఉన్నామన్నారు. వయసులో పెద్ద వ్యక్తి అన్న గౌరవం కూడా ఇవ్వకుండా నీచమైన భాషను వాడుతున్న వ్యక్తి రేవంత్ రెడ్డి అని మండిపడ్డారు. ఒకవేళ కేసులు పెట్టాల్సి వస్తే కేసీఆర్‌పై రేవంత్ చేసిన వ్యాఖ్యలకు కొన్ని వందల కేసులు నమోదు చేయాలని తెలిపారు. కేటీఆర్‌పై , ఆయన కుమారుడిపై, కవితపై, హరీశ్‌రావుపై, చివరకు తన సొంత కేబినెట్లో ఉన్న మంత్రులపై గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలు అన్నింటిపై కేసులు పెట్టుకుంటూ వెళితే కొన్ని వేల కేసులు నమోదు చేయాల్సి ఉంటుందని తెలిపారు. కానీ పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి కేటీఆర్‌పై కేసు పెట్టారని అన్నారు.
కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావుపై ఏదో ఒక కేసు పెట్టి జైల్లోకి పంపించాలనే ఆత్రుత రేవంత్ రెడ్డిలో కనిపిస్తుందని తెలిపారు. వారిని జైల్లో పెట్టేందుకే ఆయన ముఖ్యమంత్రి అయినట్టుగా కనిపిస్తోందని విమర్శించారు. అందుకే ఇష్టారాజ్యంగా కేసుల నమోదు చేస్తే పోతున్నారని అన్నారు. వారిని జైల్లో పెట్టి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో ఆదరణ లేదని.. తీవ్రమైన వ్యతిరేకత ఉందనే విషయం ఇప్పటికే రాష్ట్ర నాయకత్వంతో పాటు ఢిల్లీలోని కాంగ్రెస్ పెద్దలకు కూడా తెలిసిపోయిందని తెలిపారు. అందుకే బీఆర్ఎస్ నాయకులపై కేసులు పెట్టి.. వారిపై తప్పుడు ప్రచారం చేసి ప్రజలకు కల్లబొల్లి మాటలు చెప్పి మరోసారి వారిని మోసం చేసి ఓట్లు వేయించుకోవాలనే ప్లాన్ లో కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్టుగా కనిపిస్తోందన్నారు. కానీ కాంగ్రెస్ చేస్తున్న తప్పులను, కాంగ్రెస్ తీరును ప్రజలు గమనిస్తూనే ఉన్నారని తెలిపారు. ఎవరు మొదట నీచమైన మాటలు మాట్లాడారో.. అన్నీ ప్రజలు గమనిస్తూనే ఉన్నారని తెలిపారు. ఈ అక్రమ కేసులకు, పిట్ట బెదిరింపులకు బీఆర్ఎస్ నాయకత్వం అసలే భయపడదని స్పష్టం చేశారు.
అనుచిత వ్యాఖ్యల పేరు మీద @KTRBRS గారి మీద మరో కేసు…
రేవంత్ గారు మాట్లాడినవి భగవద్గీత ప్రవచనాలా ❓
రేవంత్ రెడ్డి మీద పెట్టరా కేసులు ❓KCR, KTR, Harish Rao మీద ఏదొక కేసులు పెట్టి, విచారణ పేరు మీద పిలిచి, అవసరమైతే అరెస్ట్ చేసి స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టే కుట్ర చేస్తుంది… pic.twitter.com/1miWk5AYbo
— YSR (@ysathishreddy) June 14, 2025
నీ మీద ఎన్ని కేసులు పెట్టాలి గుంపు మేస్త్రీ : బీఆర్ఎస్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై (KTR) కాంగ్రెస్ సర్కార్ తాజాగా మరో కేసు బనాయించింది. కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఫిర్యాదుతో సైబర్ క్రైమ్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ సీసీఎస్ పోలీసులకు శుక్రవారం ఫిర్యాదు చేశారు. కేటీఆర్ వ్యాఖ్యలు రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా ఉన్నాయని, ఆయనపై చర్యలు తీసుకోవాలని అందులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కేటీఆర్‌పై పోలీసులు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. దీనిపై బీఆర్ఎస్ పార్టీ కూడా ట్విట్టర్(ఎక్స్) వేదికగా తీవ్రంగా స్పందించింది. రేవంత్ రెడ్డి చేస్తున్న హౌలా పనులను ప్రశ్నిస్తూ హౌలా అని అన్నందుకే కేటీఆర్‌పై కేసు పెట్టారని మండిపడింది. మరి రోజూ నోటికి వచ్చినట్లు నీ కంపు నోటితో అందర్నీ తిట్టే నీ అడ్డమైన బూతులకు, నీ మీద ఎన్ని కేసులు పెట్టాలి గుంపు మేస్త్రీ అని సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించింది.
రేవంత్ రెడ్డి చేస్తున్న హౌలా పనులను ప్రశ్నిస్తూ ‘హౌలా’ అని అన్నందుకే..
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS గారిపై అక్రమ కేసు పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం!నువ్వు రోజూ నోటికి వచ్చినట్టు నీ కంపు నోటితో అందరినీ తిట్టే నీ అడ్డమైన బూతులకు, నీ మీద ఎన్ని కేసులు పెట్టాలి గుంపు… pic.twitter.com/5Ef0zpKTtN
— BRS Party (@BRSparty) June 14, 2025