Y Satish Reddy | హైదరాబాద్ : ఫార్ములా ఈ రేసు అంశంలో రేవంత్ రెడ్డి సర్కారు మరోసారి డ్రామాలు మొదలుపెట్టింది అని బీఆర్ఎస్ నేత వై సతీష్ రెడ్డి ధ్వజమెత్తారు. ఇప్పటికే రెండు మూడు సార్లు కేటీఆర్‌ను ఏసీబీ విచారించింది. ఇప్పుడు కొత్తగా మరోసారి విచారణకు గవర్నర్ అనుమతి ఇవ్వడం ఏంటీ.? అని నిలదీశారు. ఇదంతా కేవలం మీడియాలో ప్రచారం కోసం, డైవర్షన్ డ్రామా మాత్రమే. కోర్టు ఎప్పుడో విచారణకు అనుమతి ఇచ్చింది. కేటీఆర్‌ను అరెస్ట్ చేయొద్దని కూడా చెప్పింది. అలాంటప్పుడు కొత్తగా గవర్నర్ అనుమతి ఇచ్చారంటూ హడావుడి చేయడం వెనక ఉన్న ఉద్దేశం ఏంటీ.? నిజంగానే కేటీఆర్ తప్పు చేసి ఉంటే.. కోర్టు ఎందుకు అరెస్ట్ చేయొద్దని చెప్పింది అని సతీష్ రెడ్డి అడిగారు.
అలాగే.. ఇప్పటికే ఏసీబీ అధికారులు రెండు మూడు సార్లు.. గంటల కొద్ది కేటీఆర్‌ను ప్రశ్నించారు. పొద్దంతా తమ కార్యాలయంలో కూర్చోబెట్టి ప్రశ్నించారు. మరి వాళ్లకు ఏం సమాచారం దొరికింది.? మళ్లీ ఇప్పుడు ప్రాసిక్యూషన్‌కు అనుమతి పేరుతో ఈ డ్రామాలు దేనికి.? అంటే ఇవన్నీ కేవలం డైవర్షన్ డ్రామాలు మాత్రమే. ఇవన్నీ బీఆర్ఎస్ పార్టీని దెబ్బతీసేందుకు, కేడర్‌లో ఆత్మస్థైర్యం దెబ్బతీసేందుకు కాంగ్రెస్, బీజేపీ రెండూ కలిసి చేస్తున్న కుటిల ప్రయత్నాలు మాత్రమే. అందుకే ఇటు గవర్నర్ అనుమతించడం.. వెనువెంటనే ఈడీ కూడా.. ఈ కేసుపై స్పందించడం జరిగాయి. ఇదంతా కేవలం బీఆర్ఎస్ పార్టీని దెబ్బతీసేందుకు బడే భాయ్.. చోటే భాయ్ కలిసి చేస్తున్న కుట్ర అనేది దీనిద్వారా మరోసారి స్పష్టమైంది అని సతీష్ రెడ్డి పేర్కొన్నారు.
ఫార్ములా ఈ రేసు పూర్తి పారదర్శకంగా జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే కేటీఆర్ అనేక ఆధారాలు చూపించారు. ఏసీబీ విచారణకు సహకరించారు. వారికి కావాల్సిన డాక్యుమెంట్లు అధికారిక లావాదేవీలకు సంబంధించిన ఈ మెయిల్స్ కూడా వారికి అందజేశారు. చివరకు ప్రెస్ మీట్ పెట్టి.. రేసుకు నిర్వహణ, డబ్బుల చెల్లింపునకు సంబంధించిన పూర్తి ఆధారాలు కూడా మీడియాకు చూపించారు. కేటీఆర్ తప్పు చేయలేదు కాబట్టే ధైర్యంగా నిలబడ్డారు.. ఏ విచారణకైనా తాను సిద్ధమని ముందే ప్రకటించారు. ఎన్నిసార్లు విచారణకు పిలిచినా వస్తానని కూడా స్పష్టం చేశారని సతీష్ రెడ్డి గుర్తు చేశారు.
హైదరాబాద్ అభివృద్ధి కోసమే ఆనాడు ఫార్ములా ఈ రేసును తీసుకొచ్చారు. కేవలం రూ.35 కోట్లు ఖర్చుపెడితే.. రూ. 750 కోట్ల ఆదాయాన్ని మన రాష్ట్ర ఖజానాకు తీసుకొచ్చారు. మన హైదరాబాద్ గొప్పతనాన్ని ప్రపంచ దేశాలకు చూపించారు. వేల కోట్ల పెట్టుబడులకు మార్గం సుగమం చేశారు. కానీ చేతగాని రేవంత్ రెడ్డి సర్కారు.. ఫార్ములా ఆపరేషన్స్ సంస్థకు అధికారికంగా చెల్లించిన డబ్బులను వదిలేసి.. ఇక్కడ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోంది. ఫార్ములా ఈ కేసుపై అసెంబ్లీలో చర్చ పెట్టాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తే.. చర్చ పెట్టకుండా పారిపోయిన పిరికిపంద ప్రభుత్వం ఇది. అసెంబ్లీలో చర్చ పెడితే నిజమేంటో.. అబద్దమేంటో తేటతెల్లమవుతుంది. కానీ నిజాలు బయటకు రావడం కాంగ్రెస్‌కు ఇష్టం లేదు. నిజాలు బయటకొస్తే తమ కుట్రలు, కక్ష సాధింపులకు అవకాశం ఉండదు కాబట్టే ఇదంతా చేస్తున్నారు. కానీ ఎన్ని కుట్రలు చేసినా.. ఎన్ని డైవర్షన్ డ్రామాలు చేసినా.. కేటీఆర్ ప్రజా సమస్యలపై కొట్లాడుతూనే ఉంటారు. అడ్డగోలు హామీలిచ్చి మోసం చేసిన కాంగ్రెస్ పార్టీని చీల్చి చెండాడుతూనే ఉంటారని వై సతీష్ రెడ్డి తేల్చిచెప్పారు.