హైదరాబాద్, ఆగస్టు 2(నమస్తే తెలంగాణ): ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది జాబ్ క్యాలెండర్ కాదని, పబ్లిసిటీ స్టంట్ అని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై సతీశ్‌రెడ్డి విమర్శించారు. మైసూర్ బజ్జీలో మైసూర్లానే కాంగ్రెస్ ఇచ్చిన జాబ్ క్యాలెండర్లో జాబులున్నాయని ఎద్దేవాచేశారు. ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలని చెప్పి.. అసెంబ్లీలో ప్రవేశపెట్టిన జాబ్ క్యాలెండర్లో ఎన్ని ఉద్యోగాలిస్తారో చెప్పకపోవడాన్ని బట్టిచూస్తే నిరుద్యోగులపై కాంగ్రెస్ వైఖరి తేలిపోయిందని చెప్పారు. ఈ మేరకు ఆయన శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో విమర్శలు గుప్పించారు. జాబ్ క్యాలెండర్‌తో నిరుద్యోగులకు ఎలాంటి భరోసా ఇవ్వలేదని పేర్కొన్నారు.
ఎన్ని ఉద్యోగాలిస్తారో లెక చెప్పకుండా జాబ్ క్యాలెండర్ ఇచ్చారని, ఉద్యోగాల సంఖ్య, నోటిఫికేషన్ తేదీ, అప్లికేషన్ల ప్రారంభ, ముగింపు తేదీలు, పరీక్ష తేదీ వంటి అన్ని అంశాలు ఉంటేనే దాన్ని జాబ్ క్యాలెండర్ అంటారని, అవేం లేకుండానే ఏదో కాగితం పట్టుకొచ్చి దానికి జాబ్ క్యాలెండర్ అని పేరు పెట్టడం కాంగ్రెస్‌కే చెల్లిందని దుయ్యబట్టారు. ఆరు గ్యారెంటీల మాదిరిగానే జాబ్ క్యాలెండర్ కూడా బోగస్ అని స్పష్టమైందని, ఎన్నికల సమయంలో అలవిగాని హామీలిచ్చిన కాంగ్రెస్, ఇప్పుడు అందర్నీ మోసం చేస్తున్నదని, ఏ నిరుద్యోగులను అడ్డుపెట్టుకొని ఎన్నికల్లో గెలిచిందో ఇప్పుడు ఆ నిరుద్యోగుల బతుకులనే ఆగం చేస్తున్నదని ధ్వజమెత్తారు. ఘోరమైన మోసం చేసిన కాంగ్రెస్‌కు నిరుద్యోగులే గోరీ కడుతారని హెచ్చరించారు.