హైదరాబాద్, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ): కృష్ణా జలాల పునఃపంపిణీకి ట్రిబ్యునల్‌ను ఏర్పాటుచేయడంలో జాప్యానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమే కారణమని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ పేర్కొన్నారు. దీనిపై కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, బీజేపీ ఎంపీ బండి సంజయ్ అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. శుక్రవారం ఆయన హైదరాబాద్‌లోని మంత్రుల నివాసంలో మీడియాతో మాట్లాడుతూ.. కృష్ణా జలాల పునఃపంపిణీ కోసం ప్రస్తుత ట్రిబ్యునల్‌కే అదనపు టీవోఆర్‌ను నివేదించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ తాత్సారం వల్లనే కృష్ణా జలాల ట్రిబ్యునల్ ఏర్పాటులో ఆలస్యం జరిగిందని బీజేపీ నేతలు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ పేర్కొనడం సిగ్గుచేటని మండిపడ్డారు. వారిద్దరికీ కృష్ణా నదీ జలాల పంపిణీ కోసం రాష్ట్ర ప్రభుత్వం, సీఎం కేసీఆర్ నిరంతరాయంగా చేసిన పోరాట చరిత్ర తెలియదని విమర్శించారు.
తెలంగాణకు ఇది గొప్ప విజయమని, సీఎం కేసీఆర్ పట్టుబట్టి సాధించిన విజయమని బోయినపల్లి వినోద్‌కుమార్ వివరించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నెల రోజులకే సీఎం కేసీఆర్ ట్రిబ్యునల్ ఏర్పాటు కోసం ప్రధాని మోదీకి లేఖ రాశారని, గత తొమ్మిదేండ్లలో అనేకసార్లు కేంద్రానికి విజ్ఞప్తి చేశారని తెలిపారు. కేంద్రం విధించిన షరతు ప్రకారం సుప్రీంకోర్టులో కేసు ఉపసంహరించుకున్న తరువాత కూడా రెండేండ్లుగా ట్రిబ్యునల్ ఏర్పాటు చేయకుండా తాత్సారం చేసింది బీజేపీ ప్రభుత్వమేనని వినోద్‌కుమార్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇంతకాలం కేంద్రం స్పందించకపోవడానికి కారణం ఎవరని నిలదీశారు. సాగునీటి అవసరాలు పెరిగిన దృష్ట్యా కృష్ణా జలాల్లో తాతాలికంగా 50ః50 వాటాను వినియోగించుకుంటామని 2018 నుంచే తెలంగాణ డిమాండ్ చేస్తున్నదని తెలిపారు. తెలంగాణకు న్యాయమైన వాటా లభించేదాకా పోరాటం కొనసాగిస్తామని, రాష్ట్ర ప్రయోజనాలను కాపాడే విషయంలో రాజీ పడేది లేదని స్పష్టం చేశారు.