Vemula Prashanth Reddy | చెరిపేస్తే చెరిగిపోయేవి కావు కేసీఆర్ ఆనవాళ్లు అని రేవంత్ రెడ్డికి జ్ఞానోదయం అయింది అనుకుంటా అని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సెటైర్లు వేశారు. కేసీఆర్ కట్టిన అద్భుతమైన కట్టడాలు సెక్రటేరియట్ భవనాన్ని, పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ను , యాదాద్రి దేవాలయం, నాగార్జున సాగర్ బుద్ధవనం చూసి ప్రపంచ సుందరీమణులు సంబరంతో ఆశ్చర్య పోయి, సెల్ఫీలు తీసుకున్న విషయాన్ని తెలిపారు. అమరుల స్మారక జ్యోతి,125 అడుగుల అంబేడ్కర్ విగ్రహ ప్రాంగణం,T హబ్ లను కూడా ప్రపంచ సుందరీమణులకు చూపించాలని సూచించారు. కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేయడం ఎవరితరం కాదు.. కేసీఆర్ అంటేనే తెలంగాణ..తెలంగాణ అంటేనే కేసీఆర్ అని స్పష్టం చేశారు. దిగజారుడు విమర్శలు, పిచ్చి ప్రేలాపనలు మాని..ఇకనైనా ప్రజలకు ఇచ్చిన హామీలు, పరిపాలనపై దృష్టి సారించాలని సీఎం రేవంత్ రెడ్డికి హితవు పలికారు.
ప్రపంచం గర్వించదగ్గ నిర్మాణాలు చేపట్టడం కేసీఆర్‌కే సాధ్యమని, KCR ఆనవాళ్లను చెరిపేస్తా అని చెప్పిన వాళ్లు, ఇప్పుడు ఆ ఆనవాళ్ళనే ప్రపంచానికి చూపించుకునే పరిస్థితి ఉందని వేముల ప్రశాంత్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. “కేసీఆర్ హయాంలో నిర్మించిన అంబేడ్కర్ సచివాలయం, పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్, యాదాద్రి దేవాలయం, నాగార్జున సాగర్ బుద్ధవనం తెలంగాణకు తలమాణికాలు అని కొనియాడారు. అవి గొప్ప నిర్మాణాలని, చెరిపేస్తే చెరిగిపోవడానికి మట్టి రాతలు కాదని.. తెలంగాణ రాష్ట్రం ఉన్నంత కాలం శాశ్వతంగా నిలిచిపోయే కేసీఆర్ ఆనవాళ్లు అని స్పష్టం చేశారు.
మిస్ వరల్డ్ పోటీలకు వచ్చిన పోటీదారుల ద్వారా తెలంగాణ గొప్పదనం ప్రపంచానికి తెలిసేలా చేయడానికి కేటీఆర్ కట్టించిన సెక్రటేరియట్, పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్, యాదాద్రి దేవాలయం, నాగార్జున సాగర్ బుద్ధవనం వంటి నిర్మాణాలు అలాగే రాచరిక పోకడలు అని మాట్లాడి తెలంగాణ చిహ్నం నుంచి తొలగించాలని అనుకున్న చార్మినార్, కాకతీయ కళా వైభవాలే ఈ ప్రభుత్వానికి దిక్కు అయ్యాయని వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ అమరుల త్యాగం తెలంగాణ ప్రజల గుండెల్లో నిరంతరం జ్వలించేలా కేసీఆర్ కట్టించిన అమరుల స్మారక జ్యోతి చిహ్నం, బడుగు బలహీన వర్గాల కోసం పని చేయాలని పాలకుల్లో స్ఫూర్తిని నింపే విధంగా కేసీఆర్ కట్టిన 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహ ప్రాంగణాన్ని కూడా మిస్ వరల్డ్ పోటీదారులకు చూపిస్తే తెలంగాణ చరిత్ర, అమరుల త్యాగం, రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ గొప్పతనం విశ్వవ్యాప్తమవుతుందని సూచించారు.
తెలంగాణ అంటే కేసీఆర్.. కేసీఆర్ అంటే తెలంగాణ అని.. వాటిని చెరిపేయాలని అనుకోవడం రేవంత్ రెడ్డి మూర్ఖత్వమే అవుతుంది అని వేముల ప్రశాంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. గత పదేండ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో దేశంలో అగ్రగామిగా నిలిస్తే.. రేవంత్ రెడ్డి ఆవగాహన లేని పరిపాలన తో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో రోజురోజుకు దిగజారుతున్నదదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి పరిపాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులకు గురి అవుతున్నారని తెలిపారు. ధాన్యం కొనేవారు లేక, అకాల వర్షాలకు తడిచిన ధాన్యం అమ్ముకోలేక బాధతో కల్లాల మీద రైతులు ప్రాణాలు వదులుతుంటే జీతాలు సరిగ్గా రాక చిన్న ఉద్యోగులు తమ నిత్య నిరసనలు తెలియజేస్తుంటే ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్ల (గుల్జార్ హౌజ్ లో అగ్ని ప్రమాదం)అమాయక ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోతుంటే, రాష్ట్రంలో విచ్చల విడిగా క్రైమ్ రేట్ పెరిగిపోతుంటే, రేవంత్ రెడ్డి మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా అంత బాగున్నట్టు మిస్ వరల్డ్ పోటీల నిర్వహణలో మునిగి తేలుతున్నాడు అని ఎద్దేవా చేశారు.
రాష్ట్రం దివాళా తీసింది, ఎక్కడా అప్పు పుట్టడం లేదు, కేంద్రంలో నన్ను చెప్పులు ఎత్తుకు పోయేవాడి లాగా చూస్తున్నారు అని సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నడని.. అలాంటప్పుడు అందాల పోటీల పేరుతో వందల కోట్ల దుబారా ఖర్చు ఎందుకు చేస్తున్నారని వేముల ప్రశాంత్ రెడ్డి ప్రశ్నించారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని.. సమయం వచ్చినప్పుడు వడ్డీతో సహా చెల్లిస్తారని అన్నారు. నీ పరిపాలనతో విసుగు చెందుతున్న ప్రజలే.. నీ రాజకీయ ఆనవాళ్లు తెలంగాణ నుంచి శాశ్వతంగా చెరిపేస్తారని రేవంత్ రెడ్డిని హెచ్చరించారు.