దళితబంధు రెండో విడత డబ్బులు విడుదల చేయాలని ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలియజేస్తున్న ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, లబ్ధిదారులను అరెస్టు చేయడం అప్రజాస్వామికమని మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. ప్రశ్నించిన వారందరిపై కేసులు పెట్టడం, దాడులు చేయడమేనా ప్రజా పరిపాలనా అని నిలదీశారు. ఇదేనా మీరు చెప్పిన ఇందిరమ్మ రాజ్యం అని ప్రశ్నించారు.
రేవంత్ రెడ్డి పాలన ఎమర్జెన్సీ రోజులను తలపిస్తుందని వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఒక శాసనసభ్యుడు అని చూడకుండా ఇంత రాక్షసంగా వ్యవహరిస్తారా అని మండిపడ్డారు. ప్రజల చేత ఎన్నుకోబడి.. అదే ప్రజల పక్షాన నిలబడిన ఎమ్మెల్యేపై మీ కనుసన్నల్లోనే పోలీసులు దాడులు చేస్తున్నారని అన్నారు. ఇంత కర్కశంగా వ్యవహరిస్తూ ఉంటే ఇక సామాన్య ప్రజలకు మీ పాలనలో రక్షణ ఎక్కడ ఉంటుందని ప్రశ్నించారు. ఎన్ని దాడులు చేసినా, అక్రమ కేసులు పెట్టి జైళ్లకు పంపించినా ప్రజల పక్షాన బీఆర్ఎస్ పోరాటం చేస్తూనే ఉంటుందని స్పష్టం చేశారు.
హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై పోలీసులు వ్యవహరించిన తీరుకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని వేముల ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. బాధ్యులైన పోలీసులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని అన్నారు. అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలన్నారు.