హైదరాబాద్, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో రైతులు పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధర లభించడంలేదని, పేరుకు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు పెట్టినా ఎకడా కొనుగోళ్లు జరగడం లేదని బీఆర్ఎస్ నేత వాసుదేవరెడ్డి ఆరోపించారు. రోజుల తరబడి రైతులు వేచి చూస్తున్నారని చెప్పారు. రైతులు పండించిన పంటలను కనీస మద్దతు ధర చెల్లించి కొనాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్రెడ్డి ఇచ్చిన హామీలు ఒట్టి మాటలే అయ్యాయని, రైతులకు ఇస్తానన్న రూ.500 బోనస్ ఇవ్వడలేదని విమర్శించారు.
అసెంబ్లీలో ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అరచేతిలో వైకుంఠం చూపించి అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని, ఒక హామీ కూడా పూర్తిస్థాయిలో అమలు చేయలేక పోయిందని వాసుదేవరెడ్డి అన్నారు. కాంగ్రెస్ 4 నెలల కాలంలో ప్రజల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైందని ఆందోళన వ్యక్తం చేశారు. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలతో తెలంగాణకు నష్టమేనని, ప్రజల పక్షాన నిలబడే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులనే లోకసభ ఎన్నికల్లో గెలిపించాలని కోరారు.