హైదరాబాద్, జూన్ 29 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి, మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఇన్చార్జీలు వారి ఆదాయం పెంచుకుంటున్నారే తప్ప.. రాష్ట్ర ఆదాయం, అభివృద్ధి విషయాన్ని పట్టించుకోవడంలేదని బీఆర్ఎస్ నేత, అటవీ అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రం దివాలా అంచుల్లోకి వెళ్తున్నదని ఆందోళన వ్యక్తంచేశారు.
రాష్ర్టానికి ప్రతి నెలా రూ.13 వేల కోట్ల ఆదాయం రావాల్సి ఉండగా, గత నెలలో రూ.10 వేల కోట్లు మాత్రమే వచ్చిందని ఉదహరించారు. శనివారం ఆయన తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం 32 వేల కోట్ల అప్పులు తెచ్చి ఒక్క ప్రాజెక్టుకానీ, ఒక్క కొత్త పథకాన్ని కానీ అమలు చేయలేదని మండిపడ్డారు.