హైదరాబాద్, ఫిబ్రవరి 28 (నమస్తే తెలంగాణ): శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (ఎస్ఎల్బీసీ) టన్నెల్ తవ్వకాల విషయంలో మంత్రి జూపల్లి కృష్ణారావు అబద్ధాలు చెప్తున్నారని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. బీఆర్ఎస్ హయాంలో 12 కిలోమీటర్లు ఎస్ఎల్బీసీ టన్నెల్ తవ్వామని, అయితే, తమ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న జూపల్లి కృష్ణారావు.. 12 మీటర్లు తవ్వలేదంటూ అబద్ధం చెప్తున్నారని మండిపడ్డారు. జూపల్లి చెప్పింది తప్పని రుజువు చేస్తే మంత్రి పదవికి రాజీనామా చేసి రాజకీయాల నుంచి తప్పుకుంటారా? అని సవాల్ విసిరారు.
తాము చెప్పేది తప్పయితే ముకు నేలకు రాసి రాజకీయాల నుంచి విరమించుకుంటామని స్పష్టంచేశారు. బీఆర్ఎస్ హయాంలో ఎస్ఎల్బీసీకి రూ.3,900 కోట్లు ఖర్చు పెట్టామని, గత కాంగ్రెస్ ప్రభుత్వం కన్నా రూ.600 కోట్లు ఎకువే ఖర్చు పెట్టామని చెప్పారు. తెలంగాణభవన్‌లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎస్ఎల్బీసీ టన్నెల్ కూలి ఎనిమిది మంది కూలీలు మట్టిదిబ్బల కింద చిక్కుకొని ఆరు రోజులు అవుతున్నా తట్టెడు మట్టి కూడా తీయలేదని విమర్శించారు.
సహాయక చర్యలను ప్రభుత్వం నామమాత్రంగా చేస్తున్నదని, రోజూ మంత్రులు హెలికాప్టర్లో వెళ్లి గెస్ట్‌హౌస్‌లో కూర్చొని వస్తున్నారని మండిపడ్డారు. మంత్రులు బాధ్యత మర్చి అడ్డగోలుగా మాట్లాడుతూ శవ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. కార్మికులకు ఏమైనా జరిగితే కాంగ్రెస్ ప్రభుత్వానిదే పూర్తి బాధ్యత అని హెచ్చరించారు. ప్రభుత్వం చర్యల వల్లనే టన్నెల్లో ప్రమాదం జరిగిందని మండిపడ్డారు. సొరంగంలో ఊట నీళ్లు వస్తున్నాయని, మట్టిపెల్లలు కూలేలా ఉన్నాయని షిఫ్టు పూర్తయిన కార్మికులు చెప్పినా, వినకుండా ఒత్తిడి తెచ్చి కార్మికులను పంపించారని, అందుకే దుర్ఘటన జరిగిందని విమర్శించారు. వారికి రోజు కూలి రూ.500 కూడా ఇవ్వడం లేదని, అది మూడు నెలలుగా పెండింగ్‌లో ఉన్నదని విమర్శించారు.
మేడిగడ్డ పిల్లర్ కుంగితే రాహుల్‌గాంధీ వచ్చి చూశారని, ఇప్పుడు టన్నెల్ కూలి ఎనిమిది మంది కార్మికులు చిక్కుకుంటే ఆయన ఎందుకు రాలేదని శ్రీనివాస్‌గౌడ్ నిలదీశారు. సొంత జిల్లాలో దుర్ఘటన జరిగితే సీఎం రేవంత్‌రెడ్డి ఎందుకు రాలేదని ప్రశ్నించారు. హెలికాప్టర్లో మంత్రులు ఎస్ఎల్బీసీ వద్దకు పొద్దున వచ్చి సాయంత్రం ఇంటికి పోతున్నారని, కార్మికులను పట్టించుకోవడం లేదని విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో పెద్దవాగు, సుంకిశాల, ఎస్ఎల్బీసీ, వట్టెం పంప్‌హౌస్ కూలిపోయాయని మండిపడ్డారు.
హరీశ్‌రావు ఎస్ఎల్బీసీ వద్దకు వెళ్లి మాట్లాడితే కేసు పెట్టారని మండిపడ్డారు. మీరు ప్రభుత్వంలో వందేండ్లు ఉంటామని అనుకుంటున్నరా? అని ప్రశ్నించారు. హరీశ్‌రావు అనుభవాన్ని ప్రభుత్వం వినియోగించుకొనే బదులు కేసు పెడుతుందా? అని ఆగ్రహం వ్యక్తంచేశారు. తమపై ఎన్ని కేసులు పెట్టినా భయపడబోమని, అలా భయపడితే తెలంగాణ రాష్ట్రం సాధించేవాళ్లమా? అని ప్రశ్నించారు.
మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఇష్టం వచ్చినట్టు మాట్లాడారని, ఎస్ఎల్బీసీ దుర్ఘటన కాంగ్రెస్ ప్రభుత్వానికి మచ్చగా మిగులుతుందని పేర్కొన్నారు. రాజ్యాంగ పదవిలో ఉండి గుత్తా సుఖేందర్‌రెడ్డి అబద్ధాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సమావేశంలో మాజీ ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, మాజీ ఎమ్మెల్యేలు అంజయ్యయాదవ్, డాక్టర్ మెతుకు ఆనంద్, పెద్ది సుదర్శన్‌రెడ్డి, బీఆర్ఎస్ నేత కురువ విజయ్‌కుమార్ పాల్గొన్నారు.