హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 14 (నమస్తే తెలంగాణ): పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి దండుపాళ్యం బ్యాచ్‌ను ఏర్పాటు చేసుకొని మరో నయీంలా మారారని బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ ఆరోపించారు. గురువారం అర్ధరాత్రి తరువాత రేవంత్ అనుచరుల నుంచి తనకు బెదిరింపు కాల్స్ వచ్చాయని దాసోజు శ్రవణ్ శుక్రవారం సీసీఎస్ సైబర్‌క్రైమ్స్ డీసీపీ స్నేహా మెహ్రాకు ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మట్లాడుతూ.. గురువారం అర్ధరాత్రి 12.15 నుంచి దాదాపు 1.30 గంటల వరకు ఒకరి తరువాత ఒకరు నిరంతరంగా గుర్తుతెలియని వ్యక్తులు తనకు ఫోన్ చేశారని చెప్పారు. ఫోన్ కట్ చేయగానే ఒకరి తరువాత మరొకరు మాట్లాడుతూ.. తాము రేవంత్ అనుచరులమని, అభిమానులమని, బయటకు చెప్పడానికి వీలు లేని పదాలతో దుర్భాషలాడారని వెల్లడించారు. రేవంత్‌రెడ్డిని విమర్శిస్తారా? మీ అంతు చూస్తామంటూ బెదిరించారని, ఇలా దాదాపు 10 మంది వేర్వేరు ఫోన్ నంబర్ల నుంచి కాల్స్ చేశారని, తనకు వచ్చిన ఫోన్ కాల్స్ వివరాలను కూడా పోలీసులకు అందజేశానని వివరించారు.
విమర్శిస్తే ఎదుర్కొనే దమ్ములేక, ఫోన్లు చేసి దండుపాళ్యం బ్యాచ్‌తో బెదిరిస్తావా? అంటూ రేవంత్‌ను దాసోజు ప్రశ్నించారు. తాను ఒక బీసీ నాయకుడినని, మంత్రులు గంగుల కమలాకర్, శ్రీనివాస్‌యాదవ్ బీసీ సామాజికవర్గానికి చెందిన వారని, కాంగ్రెస్ లోనూ హన్మంతరావు తదితర బీసీలపై రేవం త్ తన అక్కసు వెల్లగక్కారని, నోటికి వచ్చినట్టు దుర్భాషలాడరని ఆరోపించారు. రేవంత్‌రెడ్డికి బీసీలంటే పడదని మండిపడ్డారు. చావు నోట్లో తలపెట్టి తెలంగాణ సాధించిన కేసీఆర్‌పై కూడా దుర్భాషలాడుతావా? అంటూ రేవంత్‌పై విరుచుకుపడ్డారు.