రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్‌లది ఒకటే ఎజెండా అని బీఆర్ఎస్ నేత సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. కేసీఆర్‌కు వ్యతిరేకంగా మాట్లాడటమే వారి లక్ష్యమని విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీలకు రాష్ట్రంలో సరైన అభ్యర్థులు లేక బీఆర్ఎస్ వారిని చేర్చుకొని టిక్కెట్లు ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణకు చేసిన మేలు గురించి చర్చకు సిద్దమా అంటూ కేసీఆర్ విసిరిన సవాల్‌ను స్వీకరించకుండా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తోక ముడిచారని విమర్శించారు.
బుధవారం తెలంగాణ భవన్లో సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. దక్షిణ భారతదేశంలో బీజేపీ ఉనికి లేదని, తక్కువ స్థానాలకే పరిమితమయ్యారని అన్నారు. దేశవ్యాప్తంగా బలంగా ఉంటే బీజేపీకి అభ్యర్థులు ఎందుకు కరవయ్యారని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీజేపీలు అంత బలంగా ఉంటే ఎవరిని నిలబెట్టినా గెలవాలి కదా, మరి ఎందుకు ఈ పార్టీలకు చేతకావడం లేదని నిలదీశారు. రాష్ట్రాలు, ప్రాంతీయ పార్టీల హక్కులను హరించేవిధంగా కాంగ్రెస్, బీజేపీలు పనిచేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. ఫెడరల్ స్ఫూర్తిని కాంగ్రెస్, బీజేపీలు అంగీకరించకుంటే ప్రజాస్వామ్యాన్ని ధిక్కరించడమే అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పదేళ్లలో దేశాన్ని, తెలంగాణను ఏ రంగంలో అగ్రభాగాన నిలిపారని కాంగ్రెస్, బీజేపీలకు ప్రజలు ఓట్లు వేయాలంటూ ప్రశ్నించారు.
కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామన్న కాంగ్రెస్ నినాదం హస్యాస్పదమని నిరంజన్ రెడ్డి అన్నారు. కోటి మందిని కోటీశ్వరులను చేయడం సంగతి తర్వాత, ప్రజలను బిచ్చగాళ్లుగా మార్చకుండా చూడండని ఆవేదన వ్యక్తం చేశారు. గుడ్లు పీకి గోళీలు ఆడుతాం, తొండలు వదులుతాం, మానవ బాంబులం అవుతామని అనడం నిజ జీవితంలో సాధ్యం కాదని అన్నారు. కాంగ్రెస్ నేతలు ఇలాంటి వ్యాఖ్యలు మాట్లాడటం గురించి సిగ్గుపడాలన్నారు. అంత ఉబలాటంగా ఉంటే ఓ సినిమా తీసుకుని సంతోషపడండి అంటూ సూచించారు. కేవలం మూడు నెలల్లో తెలంగాణ ముఖచిత్రం మారిపోయిందని, కరెంటు కోతలు, సాగునీరు, తాగునీటి కొరత, చేనేత కార్మికుల ఆత్మహత్యలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని జాగ్రత్తగా వాడుకుని పనిచేయాలని, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి సలాం చేస్తున్నాడని, అయితే బీజేపీ పార్టీకి గులాం గురి ఎందుకు చేస్తున్నాడంటూ ప్రశ్నించారు.
పార్లమెంటు ఎన్నికల తర్వాత ఏక్ నాథ్ షిండే వస్తాడని, బీజేపీ ఎంపీ లక్ష్మణ్, గతంలో కిషన్ రెడ్డి అన్నారని, మరి వారు అన్న మాటల గురించి స్పందించే దమ్ము రేవంత్ రెడ్డికి ఉందా అంటూ ప్రశ్నించారు. మోదీ వస్తే ఎందుకు వెళ్లి వెళ్లి వంగి వంగి దండాలు పెడుతున్నాడని నిలదీశారు. కేవలం నెల రోజులలో ఎన్నికలు పెట్టుకుని రేవంత్ ప్రధానిని ఎలా కలుస్తాడని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలే నిలదీస్తున్నారని అన్నారు. చేతనైతే నిపుణుల సలహాలు తీసుకుని కేసీఆర్ కంటే ఎక్కువ పనిచేసి చూయించాలని రేవంత్‌కు సూచించారు. అప్పుడు అభినందిస్తామని, ప్రభుత్వాన్ని కూల్చేస్తాం అన్న బీజేపీ నేతల గురించి మాట్లాడే దమ్ము కాంగ్రెస్ నేతలకు లేదన్నారు. నిందలు, బెదిరింపులు, వ్యక్తిగత దూషణలతో లాభపడుతామని కాంగ్రెస్ నేతలు భావిస్తే ప్రజలే తగిన సమాధానం చెబుతారన్నారు. విపక్షాల దుష్ప్రచారం నమ్మి ప్రజలు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేశారన్నారు. కాంగ్రెస్ హామీలను నెరవేరుస్తున్నదా, కేసీఆర్ కన్నా ఎక్కువ మేలు జరుగుతుందా, అన్న విషయం గమనించి పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలు గమనించి ఓట్లు వేయాలని ఆయన సూచించారు.