రుణమాఫీపై గైడ్లైన్స్ గందరగోళంగా ఉన్నాయని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. రైతు రుణమాఫీకి ఇన్ని ఆంక్షలు ఎందుకు పెట్టారని నిలదీశారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో బుధవారం సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒకే విడతలో రుణమాఫీ చేస్తామని ప్రభుత్వం చెప్పిందని గుర్తుచేశారు. రైతులందరికీ అందరికీ ఒకే విడతలో రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు.
రైతు రుణమాఫీపై రేవంత్ సర్కార్కు చిత్తశుద్ధి లేదని నిరంజన్ రెడ్డి అన్నారు. కరోనా విపత్తులోనూ బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుబంధు ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.29వేల కోట్ల రుణాలు మాఫీ చేసిందన్నారు. ఏదో కొంతమందికి రుణమాఫీ చేసి సంబరాలు చేసేందుకు సిద్ధపడకండి అని హితవు పలికారు. పట్టాదారు పుస్తకం ఉన్న ప్రతి ఒక్కరి బ్యాంక్ అకౌంట్లో రుణమాఫీ డబ్బులు వేయాలని.. లేకపోతే రాష్ట్ర ప్రజలను కాంగ్రెస్ మోసం చేసినట్లే అని అన్నారు. పాస్బుక్ ప్రామాణికం అయినప్పుడు రైతు భరోసా ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు.
ఎన్నికల ముందు ఆంక్షలను చెప్పలేదని, మేనిఫెస్టోలో పెట్టలేదని నిరంజన్ రెడ్డి అన్నారు. ఆంక్షలు లేకుండా అందరికీ రుణమాఫీ అమలు చేయాలని డిమాండ్ చేశారు.