హైదరాబాద్, జూలై 1 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ నగరంలో శాంతి భద్రతలు అదుపుతప్పాయని బీఆర్ఎస్ నేత షేక్ అబ్దుల్లా సోహైల్ అన్నారు. నగరంలో ఇప్పటి వరకు 30 హత్యలు జరిగాయని, రౌడీ షీటర్ల ఆగడాలు పెరిగాయని, పోలీసులు ఎలాంటి విచారణ చేయడం లేదని ఆరోపించారు. సోమవారం ఆయన తెలంగాణ భవన్లో మాట్లాడుతూ హంతకులను కస్టడీలోకి తీసుకోవడంలో పోలీసులు విఫలమవుతున్నారని విమర్శించారు. గంజాయి, మత్తు పదార్థాల సరఫరాను నివారించాలని, శాంతిభద్రతల విషయంలో పోలీసుశాఖతో సీఎం రేవంత్రెడ్డి, ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష నిర్వహించాలని కోరారు. రేవంత్రెడ్డి వద్దే హోంశాఖ ఉన్నా శాంతి భద్రతలను ఆదుపులో ఉంచేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదని ఆరోపించారు. హైదరాబాద్ నగరం ఆటవిక రాజ్యం దిశగా వెళ్తున్నదని ఆందోళన వ్యక్తంచేశారు. కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలో రాష్ట్రంలో ఎలాంటి శాంతి భద్రతల సమస్య ఉత్పన్నం కాలేదని చెప్పారు.