Telangana | నీతులు చెప్పే పాలకులు నీతిమాలిన విధంగా మహబూబాబాద్‌లో మహాధర్నాకు అనుమతిని ఇవ్వలేదని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ విమర్శించారు. తమ ఉద్దేశం సరైనదే అని గుర్తించి హైకోర్టు అనుమతినిచ్చిందని తెలిపారు. గిరిజన, దళిత, పేద రైతులపై కాంగ్రెస్ ప్రభుత్వ దమనకాండకు నిరసనగా మహబూబాబాద్‌లో బీఆర్ఎస్ తలపెట్టిన మహా ధర్నా స్థలాన్ని మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, మాజీ ఎమ్మెల్యేలు శంకర్ నాయక్, రెడ్యా నాయక్ తదితరులు పరిశీలించారు. ఈ సందర్భంగా సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. . హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పు సీఎం రేవంత్ రెడ్డికి చెంపపెట్టు అని అన్నారు.
బీఆర్ఎస్ తలపెట్టిన ఈ మహాధర్నాకు పోలీసులు, అధికార యంత్రాంగం సహకరించాలని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ కోరారు. బీఆర్ఎస్ హయాంలో పార్టీలకు అతీతంగా అనుమతులు ఇచ్చి ప్రజాస్వామ్యాన్ని గౌరవించామని పేర్కొన్నారు. లగచర్ల ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటివరకు స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ.. రేపటి మహబూబాబాద్ మహా ధర్నాను అడ్డుకునేందుకు కాంగ్రెస్ పార్టీ యత్నిస్తుందని ఆరోపించారు. మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని దోచుకుంటుందని మండిపడ్డారు. సోషల్ మీడియాలో వాస్తవాలను వెల్లడిస్తే తమపై కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సబ్బండ వర్గాలను అన్ని విధాలుగా కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని విమర్శించారు. రేపటి మహబూబాబాద్ మహా ధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా రెడ్యా నాయక్ మాట్లాడుతూ.. లగచర్లలో గిరిజనుల మీద దాడులపై నిరసనలు తెలుపుతామని తెలిపారు. రేపటి మహా ధర్నాకు హైకోర్టు అనుమతి ఇచ్చిందని అన్నారు. ఈ ధర్నాకు వ్యతిరేకంగా దాడులు చేస్తామని కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు బహిరంగంగానే హెచ్చరిస్తున్నారు.సంఘ విద్రోహ శక్తుల పట్ల పోలీసులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జిల్లా గిరిజనులు స్వచ్ఛందంగా ఈ మహాధర్నాకు తరలిరావాలని పిలుపునిచ్చారు.