వాంకిడి గురుకులంలో ఫుడ్ పాయిజన్ వల్ల బిడ్డను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆ తల్లిదండ్రులకు భరోసా ఇచ్చేందుకు వారి గ్రామానికి వెళ్తున్న ఎమ్మెల్యే కోవా లక్ష్మి సహా ప్రజాప్రతినిధులను అడ్డుకోవడం సిగ్గుచేటు అని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విమర్శించారు. ఆదివాసీ మహిళా ఎమ్మెల్యే మీద నోరు జారిన సబ్ కలెక్టర్‌పై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
వంద మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ జరిగి, పది రోజులు కూడా గడవలేదు.. మళ్లీ మాగనూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరగడం విషాదకరమని సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మాగనూరు ZPHS పాఠశాలను సందర్శించడానికి వెళ్తారనే నెపంతో మక్తల్ మాజీ ఎమ్మెల్యేతో పాటు, బీఆర్ఎస్ నాయకులను ముందస్తు అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించడం దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు.
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల్లో వరుస ఫుడ్ పాయిజన్ కేసులు నమోదవుతున్నా, ప్రాణాలు కోల్పోతున్నా ప్రభుత్వం మొద్దు నిద్ర వీడటం లేదని సబితా ఇంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంచెం కూడా మానవత్వం లేని విధంగా వ్యవహరిస్తున్న తీరు చాలా బాధ కలిగిస్తుందని అన్నారు. తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నా కనీస చర్యలకు ఉపక్రమించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య తీరు వల్ల ఇంకెంత మంది విద్యార్థులు ఆస్పత్రి పాలవ్వాలని, ఇంకెందరు ప్రాణాలు కోల్పోవాలని ప్రశ్నించారు.